అసలు అనురాగ్ మూవీ విషయంలో జరిగిందేంటి? ఆ ఎఫెక్టా?
ఇప్పుడు రీసెంట్ గా అనురాగ్ కశ్యప్.. బందర్ సినిమా ప్రమోషన్లకు కూడా దూరంగా ఉండటానికి ఇదే కారణమని వెల్లడించారు.
ఒక డైరెక్టర్ తానే తెరకెక్కించిన సినిమాను "అది నా మూవీ కాదు" అని బహిరంగంగా చెప్పడం చాలా అరుదు. కానీ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బాబీ డియోల్ లీడ్ రోల్ లో తెరకెక్కిన బందర్ సినిమా విడుదలై చర్చనీయాంశంగా మారిన వేళ.. దానిపై వస్తున్న విమర్శలను ఖండించలేనని, థియేటర్లలో ఉన్న వెర్షన్ తన ఫైనల్ కట్ కాదని ఆయన చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పుడు రీసెంట్ గా అనురాగ్ కశ్యప్.. బందర్ సినిమా ప్రమోషన్లకు కూడా దూరంగా ఉండటానికి ఇదే కారణమని వెల్లడించారు. "ఆ సినిమాను నేను పూర్తిగా ఓన్ చేసుకోలేను. అందుకే ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. ప్రేక్షకులు చూస్తున్న వెర్షన్ నా ఫైనల్ కట్ కాదు. అందుకే సినిమాపై వచ్చిన విమర్శలు కూడా సమంజసంగానే ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు. అసలు వివాదం మొత్తం ఎడిటింగ్ దగ్గరే మొదలైందని అనురాగ్ చెప్పారు.
తాను షూట్ చేసిన సీన్స్ అలాగే ఉన్నప్పటికీ.. కొన్ని కీలక భాగాలను తొలగించడం వల్ల సినిమా అసలు ఉద్దేశం మారిపోయిందని వెల్లడించారు. ముఖ్యంగా సినిమా చెప్పాలనుకున్న మెసేజ్, ప్రేక్షకులకు చేరే యాంగిల్ పూర్తిగా మారిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. బందర్ సినిమాలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొనే ఓ స్టార్ జీవితాన్ని చూపించారు. అయితే సినిమా రిలీజైన తర్వాత.. మహిళలను తక్కువ చేసి చూపించిందని, మీటూ ఉద్యమాన్ని బలహీనపరిచేలా ఉందని విమర్శలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో అనురాగ్ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. సినిమా కథ కంటే.. దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విధానమే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇక సినీ ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులపై కూడా అనురాగ్ స్పందించారు. ఒకప్పుడు నిర్మాతలు కథను నమ్మి సినిమాలు తీసేవారని.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. కార్పొరేట్ సంస్థలు సినీ రంగంలోకి వచ్చిన తర్వాత దర్శకుల క్రియేటివ్ ఫ్రీడమ్ క్రమంగా తగ్గుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
సినిమా ఆలస్యమవడం, బడ్జెట్ పెరగడం వంటి కారణాలతో చివరికి దర్శకుల చేతుల్లో అధికారం ఉండడం లేదని ఆయన తెలిపారు. ఒప్పందాలు ఉన్నప్పటికీ.. చివరికి ఏ వెర్షన్ విడుదల కావాలనేది స్టూడియోలే నిర్ణయిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కొద్ది పెద్ద స్టూడియోలే మార్కెట్ ను నియంత్రిస్తుండటంతో.. ఇండిపెండెట్ చిత్రాలపై ఆ ఎఫెక్ట్ పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలతో మరోసారి బాలీవుడ్ లో ఫైనల్ కట్ హక్కులపై చర్చ మొదలైంది. దర్శకుడు ఊహించిన సినిమా, ప్రేక్షకుడు చూసే సినిమా ఒక్కటేనా? లేక మధ్యలో జరిగే మార్పులే సినిమా ఫ్యూచర్ ను నిర్ణయిస్తున్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు సినీ పరిశ్రమలో వినిపిస్తున్నాయి. ఏదేమైనా బందర్ సినిమాపై వచ్చిన విమర్శల కంటే.. అది ఫైనల్ కట్ కాదని అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి.