చిన్న సినిమాలకు పెద్ద దర్శకుల సపోర్ట్ & బ్రాండింగ్!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. వందల కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా వండర్స్ క్రియేట్ చేసే స్టార్ దర్శకులు దృష్టిని చిన్న చిత్రాల వైపు మళ్లిస్తున్నారు.

Update: 2026-09-12 14:30 GMT

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. వందల కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా వండర్స్ క్రియేట్ చేసే స్టార్ దర్శకులు దృష్టిని చిన్న చిత్రాల వైపు మళ్లిస్తున్నారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ప్రోత్సహించడానికి సమర్పకులుగా మారుతున్నారు. త‌ద్వారా తమ బ్రాండ్ ఇమేజ్‌తో ఆ సినిమాలకు భారీ ప్రచారాన్ని కల్పిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతున్న `హనుమాన్ హంస్` (తెలుగు) చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విలక్షణమైన కథాంశంతో వస్తున్న ఈ చిన్న సినిమాకు త్రివిక్రమ్ సపోర్ట్ తోడవడంతో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.

ఆయన బ్రాండింగ్ వల్ల సినిమా బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దర్శకధీరుడు రాజమౌళి సైతం ఫాహాద్ ఫాజిల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` సినిమాకు మద్దతు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడు చిన్న సినిమా వెనుక నిలబడటంతో ఆ ప్రాజెక్ట్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కుతోంది. అలాగే `కేజీఎఫ్`, `సలార్` వంటి మాస్ బ్లాక్‌బస్టర్లతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ `418` అనే హార్రర్ చిత్రానికి ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు.

సాధారణంగా హార‌ర్ సినిమాలకు సరైన ప్రచారం లభించడం కష్టం. కానీ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి సపోర్టుగా నిలవడంతో `418` పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా బ‌య‌ట‌కు రాని ద‌ర్శ‌కులు చాలా మంది ఉన్నారు. స్టార్ డైరెక్ట‌ర్లు కొంద‌రు ఇత‌ర బ్యాన‌ర్ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం లేదా? త‌న బ్రాండ్ నే పెట్టుబ‌డిగా పెట్టి త‌మ పేరుతో సినిమాను మార్కెట్ లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. త‌ద్వారా కోట్ల ఆదాయం పైసా ఖ‌ర్చు లేకుండానే ఖాతాలో జ‌మ అవుతుంది.

ఈ ప్రెజెంటర్ ట్రెండ్‌ను పరిశీలిస్తే వీళ్లందరి కంటే ముందే దర్శకుడు మారుతి ఈ రూట్‌లో ప్రయాణించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ చిన్న సినిమాలను నిర్మించడం , సమర్పకుడిగా మారి ప్రమోట్ చేయడంలో మారుతి అప్పట్లోనే విజయం సాధించి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఆయన చూపిన బాటలోనే ఇప్పుడు మిగతా స్టార్ డైరెక్టర్లు నడుస్తున్నారు. అగ్ర దర్శకులు ప్రెజెంటర్లుగా మారడం వల్ల చిన్న సినిమాలకు థియేటర్ల లభ్యత పెరగడమే కాకుండా ఓటీటీ, శాటిలైట్ హక్కులకు మంచి ధర ద‌క్కుతుంది. కథపై నమ్మకంతో స్టార్ డైరెక్టర్లు అందిస్తున్న ప్రోత్సాహం, తెలుగు పరిశ్రమలో మరిన్ని కొత్త ఆలోచనలకు, సరికొత్త ప్రతిభకు తగిన గుర్తింపు లభించేలా చేస్తోందని చెప్పొచ్చు.

Tags:    

Similar News