నిఖిల్ కు పోటీగా అఖిల్.. ఇద్దరికీ హిట్ దక్కుతుందా?
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు మేకర్స్.;
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. ఇప్పుడు స్వయంభు మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా.. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకంగా 8 భాషల్లో అంటే.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో రిలీజ్ కానుంది.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు మేకర్స్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహాశివరాత్రి కానుకగా సినిమా విడుదల చేయనున్నారు. 2026 ఫిబ్రవరి 13వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా చెప్పేశారు.
ఇప్పటికే ప్రమోషన్స్ కంటెంట్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొనగా.. నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నిఖిల్ కు పోటీగా యంగ్ హీరో అఖిల్ రానున్నట్లు తెలుస్తోంది.
అఖిల్ ప్రస్తుతం మాస్ ఎంటర్టైనర్ లెనిన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలనే కసితో ఆయన చేస్తున్న ఆ సినిమాను మురళీకృష్ణ అబ్బురు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా మూవీ షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా కీలక షెడ్యూల్ ను కంప్లీట్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే సినిమాలో హీరోయిన్ గా ముందు శ్రీలీలను ఫిక్స్ చేసి కొంత షూట్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల శ్రీలీల ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో భాగ్యశ్రీ బొర్సేను హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో షూటింగ్ పూర్తి అవ్వాల్సి ఉండగా.. హీరోయిన్ ఛేంజ్ అవ్వడంతో శ్రీలీల నటించిన సీన్స్ ను ఇప్పుడు భాగ్యశ్రీతో చిత్రీకరిస్తున్నారని టాక్.
త్వరలో మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుండగా.. మూవీ 2026 ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు రోజు స్వయంభు రానుండగా.. తర్వాత రోజు లెనిల్ విడుదల కానుందని వినికిడి. అలా బాక్సాఫీస్ వద్ద శివరాత్రికి అటు నిఖిల్.. ఇటు అఖిల్ పోటీ పడనున్నారు. స్వయంభుతోపాటు లెనిన్ పై కూడా ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. మరి ఇద్దరూ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.