యష్ భారతీయ సినిమాని గ్లోబల్ వేదికపై నిలబెట్టేందుకు శ్రమిస్తున్నాడు!-కేవీఎన్
రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది.
రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర నిర్మాత వెంగట్ కె. నారాయణ (KVN) మాట్లాడుతూ. భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడానికి యష్ నిరంతరం తపన పడుతున్నారని కొనియాడారు. సముద్రమంత సుదీర్ఘమైన ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో ల్యాండ్‌మార్క్స్- మైల్‌స్టోన్స్ క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారని ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ వేడుకలో హాజరైన వేలాది మంది యువతను ఉద్దేశించి మాట్లాడిన కేవీఎన్ ఇది పూర్తిగా `జెన్ జీ` యుగమని.. దేశంలోనూ.. వారి వ్యక్తిగత జీవితంలోనూ ఇది చాలా కీలకమైన టైమ్ అని పేర్కొన్నారు. సినిమాలో ఉండే `ఎవ్రీ ఛాయిస్ హాస్ ఎ ప్రైస్` (తీసుకునే ప్రతి నిర్ణయానికి వెలకట్టాల్సి ఉంటుంది) అనే ప్రతిష్టాత్మక డైలాగ్ ప్రతి ఒక్కరి జీవితానికి వర్తిస్తుందని చెప్పారు. అలాగే మల్లా రెడ్డి ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయనలో ఉండే అద్భుతమైన విశ్వాసం- కన్విక్షన్ వల్లే ఆయన ఏ మాటనైనా ధైర్యంగా చెప్పగలరని అభిప్రాయపడ్డారు.
`టాక్సిక్` చిత్రాన్ని కేవలం ఒక సాధారణ సినిమాగా చూడలేమని... అదొక ప్రత్యేకమైన అనుభూతిని పంచే ప్రపంచమని నిర్మాత స్పష్టం చేశారు. ఈ చిత్రం ఎలాంటి రివ్యూలు, క్రిటిక్స్ లేదా అభిప్రాయాలకు అందకుండా వీక్షకులకు ఒక విలక్షణమైన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందన్నారు. యష్ కష్టపడే తత్వం, ప్యాషన్, డెడికేషన్, త్యాగాలు తెరవెనుక ఉంటే.. ఆయన స్వాగ్, స్టైల్, ఆటిట్యూడ్ వెండితెరపై స్పష్టంగా కనిపిస్తాయని వ్యాఖ్యానించారు.
`కేజీఎఫ్` వంటి ప్రభంజనం తర్వాత దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌తో సినిమా చేయడానికి ప్రతి ఒక్కరూ సందేహించినప్పుడు, ``జీవితంలో అతిపెద్ద రిస్క్ ఏమిటంటే ఏ రిస్క్ తీసుకోకపోవడమే` అని ధైర్యం చెప్పి యష్ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపారని వెల్లడించారు. ఒక జపనీస్ సామెతను ఉదాహరణగా చెప్తూ, ``ఆ పని ఎవరైనా చేయగలిగితే నువ్వు కూడా చేయి.. ఒకవేళ ఆ పని ఎవరూ చేయలేకపోతే దాన్ని తప్పకుండా నువ్వే చేయాలి!` అనే ఆటిట్యూడ్ ఉన్న ఏకైక హీరో యష్ అని.. అదే ఆయనలోని ప్రత్యేకత అని కొనియాడారు.
చివరగా చిత్రకథానాయికలు నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషిలతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారానికి కేవీఎన్ ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు 26న విడుదలవుతున్న ఈ చిత్రం థియేటర్లలో లైట్స్ ఆఫ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఎగ్జైట్ చేయడమే కాకుండా.. ప్రేక్షకుల పల్స్ రేట్‌ను 100 శాతం మార్చేస్తుందని నమ్మకంగా చెప్పారు. దిల్ రాజు, మల్లా రెడ్డి, పోలీస్ కమిషనర్ అందించిన సపోర్ట్‌కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.