2000 కోట్లు వసూల్‌.. `టాక్సిక్` ఈవెంట్లో దిల్ రాజు టీజింగ్

రాకింగ్ స్టార్ యష్, దర్శకురాలు గీతు మోహన్‌దాస్ కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` పై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Update: 2026-08-22 16:35 GMT

రాకింగ్ స్టార్ యష్, దర్శకురాలు గీతు మోహన్‌దాస్ కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` పై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ప్రచార చిత్రాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుండగా, `టాక్సిక్` విడుదలైన తర్వాత యష్ మరోసారి ఇండియన్ సినిమా వర్గాల నుంచి అపూర్వమైన ప్రశంసలు అందుకోవడం ఖాయమని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టాక్సిక్ ఈ నెలాఖ‌రున విడుద‌ల‌కుస సిద్ధ‌మ‌వుతుండ‌గా హైద‌రాబాద్ మ‌ల్లారెడ్డి గ్రౌండ్స్ లో జ‌రిగిన ప్రీరిలీజ్ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా బిజినెస్ - పొటెన్షియల్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

తాజా వేడుకలో దిల్ రాజు మాట్లాడుతూ, `కేజీఎఫ్ 2` తర్వాత యష్ గీతు మోహన్‌దాస్‌తో సినిమా చేస్తున్నారని తెలిసినప్పుడు మొదట ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. కేజీఎఫ్ వంటి పీక్ సక్సెస్ తర్వాత ఎవరైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లతో వెళ్తారని.. కానీ యష్ మాత్రం కథలోని పొటెన్షియాలిటీని నమ్మి ఒక కొత్త డైరెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేయడం ఆయన విజన్‌కి నిదర్శనమని కొనియాడారు. బొంబాయిలో యష్ విజువల్స్ చూపించినప్పుడు ఆయనకున్న విజన్ ఏంటో అర్థమైందని.. `ఇంతింతై వటుడింతై` అన్నట్లు యష్ తన కెరీర్‌ను పాన్-ఇండియా స్థాయి నుంచి వరల్డ్ సినిమాగా మారుస్తున్నారని ప్రశంసించారు.

ఈ సినిమాను నిర్మిస్తున్న KVN ప్రొడక్షన్స్ అధినేతను కూడా దిల్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. యష్‌తో టాక్సిక్, విజయ్‌తో జననాయగన్, హిందీలో అక్షయ్ కుమార్‌తో, తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు తీస్తూ ప్రతి భాషలోనూ జెండా పాతేలా ఒక ఇండియన్ ప్రొడ్యూసర్‌గా ఎదుగుతున్నారని కేవీఎన్ విజన్‌ను ప్రశంసించారు. అంతేకాకుండా, యష్ -కేవీఎన్‌ల విజన్‌పై ఉన్న నమ్మకంతోనే `టాక్సిక్` తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం వారు అడిగిన భారీ మొత్తాన్ని ఆలోచించకుండా కేవలం ఒక్క నిమిషంలోనే ఓకే చెప్పేసి హక్కులు దక్కించుకున్నామని దిల్ రాజు వెల్లడించారు.

రాజమౌళి, యష్ వంటి వారు రీజనల్ సినిమాలను ఇండియన్ సినిమాగా.. ఆపై వరల్డ్ సినిమాగా మార్చారని దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో మల్లా రెడ్డి గారి 50 ఏళ్ల విజన్‌ను.. ఆయన క్రియేట్ చేసిన కాలేజీల సామ్రాజ్యాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. యష్ విజన్ కూడా అలాంటిదేనని వ్యాఖ్యానించారు. అలాగే సంగీత దర్శకుడు విశాల్ మిశ్రాని వేదికపైకి పిలుస్తూ ``ఇటీవల విశాల్ నన్ను కలిసినప్పుడు.. రాజు భాయ్.. ఈ సినిమా ఇండియాలోనే 2000 కోట్ల కలెక్షన్లు సాధిస్తుందని చెప్పాడు`` అంటూ బాక్సాఫీస్ టార్గెట్‌పై హాట్ కామెంట్స్ చేశారు.

గతంలో `యానిమల్` సినిమా ప్రమోషన్ల సమయం నుంచే ఎలాగైతే ఒక మోత మోగిందో.. ఇప్పుడు `టాక్సిక్` సినిమాతో కూడా ఇక్కడి నుంచే గట్టి సౌండ్ వెళ్లాలని దిల్ రాజు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకురాలు గీతు మోహన్‌దాస్, కేవీఎన్ ప్రొడక్షన్స్ , చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. దిల్ రాజు వ్యాఖ్యలు .. 2000 కోట్ల కలెక్షన్ల ప్రస్తావనతో ఇప్పుడు `టాక్సిక్` మూవీపై అంచనాలు మునుపటి కంటే రెట్టింపయ్యాయి.

Tags:    

Similar News