ఫ్యాన్స్ తిడుతున్నారన్న వశిష్ఠ

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదలైనపుడే భారీ అంచనాలు రేకెత్తించి, బంపర్ క్రేజ్ తెచ్చుకున్న సినిమా.. విశ్వంభర.

Update: 2026-08-22 16:33 GMT

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదలైనపుడే భారీ అంచనాలు రేకెత్తించి, బంపర్ క్రేజ్ తెచ్చుకున్న సినిమా.. విశ్వంభర. ‘బింబిసార’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ఠతో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా ఫాంటసీ కథతో చిరు సినిమాను మొదలుపెట్టడంతో దీనికి మొదట్లో మామూలు హైప్ రాలేదు. కానీ ఈ సినిమా టీజర్ లాంచ్ అయ్యాక ఆ హైప్ అంతా కరిగిపోయింది. అందులో విజువల్స్, గ్రాఫిక్స్ తేలిపోవడంతో సినిమా మీద విపరీతమైన నెగెటివిటీ ముసురుకుంది. దీంతో పాత కంటెంట్ అంతా పక్కన పెట్టి.. వీఎఫెక్స్, విజువల్స్ మీద మళ్లీ వర్క్ చేయడం మొదలుపెట్టడంతో సినిమా బాగా ఆలస్యం అయింది. కానీ ఆ ఆలస్యం మరీ శ్రుతి మించడం, ఎంతకీ ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సినిమాకు బజ్ కూడా అంతకంతకూ తగ్గిపోతోంది.

ఈసారి చిరు పుట్టిన రోజుకైనా ‘విశ్వంభర’ అప్‌డేట్ ఉంటుందేమో అని ఆశిస్తే.. అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు. దీంతో ‘విశ్వంభర’ టీం మీద మెగాభిమానుల్లో అసంతృప్తి మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ మెగా అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశాడు. శుక్రవారం జరిగిన చిరు పుట్టిన రోజు వేడుకలకు వశిష్ఠ కూడా ఒక అతిథిగా వచ్చాడు. చిరు గురించి నాలుగు మాటలు మాట్లాడాక అభిమానులు కోరుకున్నట్లే ‘విశ్వంభర’ ప్రస్తావన తెచ్చాడు వశిష్ఠ. ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో తనను తిడుతున్న విషయాన్ని ఓపెన్‌గా ఒప్పుకుంటూనే.. ఈ సినిమా లేటైనా సరే బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతుంటూ ఆశాజనకమైన మాట చెప్పాడు వశిష్ఠ. ‘‘ఇక్కడున్న చాలామంది అభిమానులు నా మీద కోపంగా ఉన్నారు. చాలామంది నన్ను తిడుతున్నారు. చాలామంది పొగుడుతున్నారు. చాలామంది ట్విట్టర్లో ఏసుకుంటున్నారు. వాళ్లందరికీ ఒకటే సమాధానం ఏంటంటే.. రాసిపెట్టుకోండి. బల్లగుద్ది చెబుతున్నా. విశ్వంభర లేటుగా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోద్ది’’ అని చెప్పి ముగించిన వశిష్ఠ.. రిలీజ్ డేట్ గురించి మాత్రం ఏమీ అప్‌డేట్ ఇవ్వలేదు.

Tags:    

Similar News