రావిపూడిని వదలని చిరు

పదేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ‘ఖైదీ నంబర్ 150’ మంచి ఫలితాన్నే ఇచ్చింది.

Update: 2026-08-22 16:34 GMT

పదేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ‘ఖైదీ నంబర్ 150’ మంచి ఫలితాన్నే ఇచ్చింది. కానీ ఆ తర్వాత కెరీర్ అంత ఆశాజనకంగా సాగలేదు. మధ్యలో ‘వాల్తేరు వీరయ్య’తో మంచి విజయాన్నందుకున్నప్పటికీ.. ‘భోళా శంకర్’ ఆయన్ని బాగా కిందికి లాగేసింది. తర్వాత రావాల్సిన ‘విశ్వంభర’ చుట్టూ నెగెటివిటీ ముసురుకోవడంతో ఇక చిరు మళ్లీ పుంజుకోవడం కష్టమే అనుకుంటున్న టైంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఆయన కెరీర్‌కు ఎక్కడ లేని ఊపునిచ్చింది.

ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం విశేషం. ఈ చిత్రంలో వింటేజ్ చిరును బయటికి తీసుకొచ్చి బాక్సాఫీస్ దగ్గర అద్భుతం చేశాడు అనిల్ రావిపూడి. ఆ సినిమా తాలూకు స్టైల్, ఫ్లేవర్‌ను తన కొత్త సినిమా ‘కాకా’కు కూడా చిరు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు నటిస్తున్న చిత్రమిది.

కానీ ఈ రోజు రిలీజైన టైటిల్ గ్లింప్స్ చూస్తే.. అందులో ‘వాల్తేరు వీరయ్య’ ఛాయల కంటే.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫ్లేవరే కనిపించింది. చిరు లుక్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ తరహలోనే సింపుల్‌గా, కొంచెం క్లాస్‌గా కనిపించింది. ఇక ఈ గ్లింప్స్‌ బీజీఎం చూసిన వాళ్లకు అనిల్ రావిపూడి స్టైలే గుర్తుకు వచ్చి ఉంటే ఆశ్చర్యం లేదు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫస్ట్ గ్లింప్స్‌కు ‘రౌడీ అల్లుడు’లోని ‘లవ్లీ మై హీరో’ థీమ్ మ్యూజిక్‌ను ఉపయోగించారు అనిల్, భీమ్స్.

ఇప్పుడు ‘కాకా’ గ్లింప్స్‌లో తమన్ నుంచి ‘గ్యాంగ్ లీడర్’లోని ‘చికి చికి చేలం’ పాట థీమ్‌తో బీజీఎం చేయించుకున్నాడు బాబీ. తన నుంచి బెస్ట్ రాబట్టుకుని, బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్‌ను చిరు తర్వాతి సినిమాకు కూడా ఫాలో అయిపోతున్నాడా.. ‘కాకా’ను జనాల్లోకి తీసుకెళ్లే విషయంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ స్ట్రాటజీనే ఫాలో అయిపోతున్నాడా అనే అభిప్రాయం కలుగుతోంది. ఈ చిత్రం కూడా తన చివరి సినిమా తరహాలోనే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుండడం గమనార్హం.

Tags:    

Similar News