యష్ 'టాక్సిక్'.. ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?
రాకింగ్ స్టార్ యష్ పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది కేజీఎఫ్ సిరీస్. ఆ సినిమాలతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు.
రాకింగ్ స్టార్ యష్ పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది కేజీఎఫ్ సిరీస్. ఆ సినిమాలతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు. అందుకే ఆయన నుంచి వచ్చే ప్రతి కొత్త ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ కూడా అలాంటి అంచనాల మధ్య రూపుదిద్దుకుంటోంది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేనప్పటికీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ ను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. యష్ సరసన రుక్మిణి వసంత్, తారా సుతారియా యాక్ట్ చేస్తున్నారు. అలాగే హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ, నయనతార వంటి స్టార్ బ్యూటీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఆ సినిమా మొదటి నుంచే హాట్ టాపిక్ గా మారింది.
సినిమా ప్రకటించిన సమయంలో వచ్చిన పోస్టర్లు, కాన్సెప్ట్ వివరాలు అభిమానుల్లో మంచి ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా కేజీఎఫ్ తర్వాత యష్ ఎలాంటి కథను ఎంచుకున్నారనే విషయంపై నేషనల్ వైడ్ గా చర్చ జరిగింది. దీంతో టాక్సిక్ పై మొదటి నుంచే మంచి బజ్ ఏర్పడింది. అయితే ఆ బజ్ ను మేకర్స్ ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారనే అభిప్రాయం ఇప్పుడు కొందరిలో వ్యక్తమవుతోంది.
సాధారణంగా భారీ పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి తరచూ అప్డేట్లు, పోస్టర్లు, వీడియోలు లేదా షూటింగ్ విశేషాలు విడుదల చేస్తుంటారు. దీంతో సినిమా ప్రేక్షకుల దృష్టిలో కంటిన్యూగా ఉంటుంది. కానీ టాక్సిక్ విషయంలో అలాంటి ప్రమోషనల్ యాక్టివిటీ తక్కువగా కనిపించిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సినిమా గురించి కొత్త సమాచారం లేకపోవడం, విడుదల తేదీపై కూడా స్పష్టత లేకపోవడం వల్ల మొదట్లో ఉన్న హైప్ కొంత తగ్గిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ప్రేక్షకుల దృష్టిని నిలబెట్టుకోవడం చాలా కీలకంగా మారింది. వరుస అప్డేట్స్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా చర్చల నుంచి కొంతకాలం దూరమవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే ఇప్పుడు టాక్సిక్ విషయంలో జరిగిందని కొందరు సినీ ప్రియులు చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆ వాదనతో ఎగ్రీ అవ్వడం లేదు.
పెద్ద సినిమాల విషయంలో మేకర్స్ కొన్నిసార్లు కావాలనే సైలెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతారని వారు గుర్తు చేస్తున్నారు. సరైన సమయంలో టీజర్, ట్రైలర్ లేదా గ్లింప్స్ విడుదల చేస్తే మళ్లీ సినిమా ఒక్కసారిగా వార్తల్లోకి వస్తుందని అంటున్నారు. యష్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒక్క అప్డేట్ వచ్చినా సినిమా మళ్లీ ట్రెండింగ్ లోకి వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా యష్ అభిమానులు కూడా సినిమా నుంచి కొత్త అప్డేట్ల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో మేకర్స్ ప్రమోషన్ల స్పీడ్ పెంచుతారా? ప్రస్తుతం తగ్గినట్లు కనిపిస్తున్న బజ్ మళ్లీ పీక్ రేంజ్ కు తీసుకెళ్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అలా టాక్సిక్ పై ఆసక్తి తగ్గలేదుగానీ, ఆ బజ్ ను కొనసాగించే విషయంలో మేకర్స్ మరింత జోష్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.