కోలీవుడ్‌లో కొనసాగుతోన్న లీడర్‌షిప్ కొరత!

కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించే బ‌ల‌మైన ఇద్దరు మాస్ స్టార్లు వేర్వేరు దారుల్లో పయ నిస్తున్నారు.

Update: 2026-07-23 19:30 GMT

ప్ర‌స్తుతం కోలీవుడ్ చిత్ర పరిశ్రమను లీడర్‌షిప్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏ సినిమా పరిశ్రమకైనా? దశాబ్దాలుగా బాక్సాఫీస్ భారాన్ని మోసే స్టార్లు కీలకం. అయితే ప్రస్తుత తమిళ సినిమా రంగంలో అగ్ర హీరోల ప్రాధాన్యతలు మారుతుండటం.. తర్వాతి తరం నుంచి ఆ స్థాయి మాస్ అప్పీల్ కలిగిన స్టార్లు ముందుకు రాకపోవడం పరిశ్రమ ఉనికిపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. తమిళ సినిమాకు దశాబ్దాలుగా వెన్నెముకగా నిలిచిన సీనియర్ హీరోల తరం క్రమక్రమంగా కెరీర్ వేగాన్ని మారుస్తోంది. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించే బ‌ల‌మైన ఇద్దరు మాస్ స్టార్లు వేర్వేరు దారుల్లో పయ నిస్తున్నారు.

ద‌ళ‌ప‌తి విజయ్ ముఖ్య‌మంత్రి అవ్వ‌డం.. సినీ కెరీర్‌కు సంపూర్ణంగా గుడ్‌బై చెప్పడం పరిశ్రమకు తీరని లోటుగా మారింది. త‌ల అజిత్ కుమార్ సినిమాలు త‌గ్గించి మోటార్ రేసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో సినిమాల మధ్య వ్యవధి గణనీయంగా పెరిగింది. ఈ పరిణామాలు కోలీవుడ్ బాక్సాఫీస్ సమీకరణాలను పూర్తిగా తలకిందులు చేస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ హీరో కమలహాసన్ వంటి లెజెండరీ నటులు వయస్సును లెక్కచేయ కుండా వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా? వారి ఒంటరి పోరాటం ఇండస్ట్రీకి శాశ్వత పరిష్కారం కాదు.

సీనియర్లు బాధ్యతను భుజాన వేసుకుంటున్నా? కోలీవుడ్ వాణిజ్య పరిధిని దేశవ్యాప్తంగా విస్తరించడానికి ... ఏటా స్థిరమైన భారీ వసూళ్లను సాధించడానికి యువ .. మధ్యతరహా స్టార్లు అత్యవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దిమందిపైనే పరిశ్రమ మొత్తం ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. మధ్య తరహా హీరోల విషయానికి వస్తే సూర్య మినహా తర్వాతి జనరేషన్‌లో బలమైన నంబర్ గేమ్ .. పాన్-ఇండియా స్థాయి క్రేజ్ కనిపించడం లేదనేది సుస్పష్టం. సూర్య విభిన్న కథా చిత్రాలతో మార్కెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారీ కమర్షియల్ మాస్ అప్పీల్ పరంగా బాక్సాఫీస్‌ను శాసించే స్థాయికి మిగతా హీరోలు పూర్తిగా ఎదగ లేకపోతున్నారు.

శివ కార్తికేయన్ వంటి నటులు క్రమంగా ఎదుగుతున్నా? రజనీ-విజయ్ స్థాయి మాస్ క్రౌడ్ పుల్లర్ ఖాళీని భర్తీ చేయడానికి వారికి ఇంకా సమయం పడుతుంది. ఇతర పరిశ్రమలతో పోలిక చేస్తే? కోలీవుడ్ వెనుకబడిపోవడానికి లీడర్‌షిప్ కొరత కొంత‌ ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి యువ స్టార్లు పాన్-ఇండియా మార్కెట్‌ను ఏలుతుండగా.. శాండల్‌వుడ్ ..మాలీవుడ్ కూడా గ్లోబల్ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. కానీ కోలీవుడ్ మాత్రం తమ స్టార్ హీరోల నిర్ణయాలపైనే ఎక్కువగా ఆధారపడి కొత్త తరం మాస్ లీడర్లను తీర్చిది ద్దడంలో కొంత వెనుకబడిందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

కోలీవుడ్ పూర్వ వైభవాన్ని అందుకోవాలంటే? తర్వాతి తరానికి చెందిన నటులు నటనకే పరిమితం కాకుండా, బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల మార్కెట్‌ను సృష్టించగల మాస్ స్టార్లుగా అవతరించాల్సిన అవసరం ఉంది. లేదంటే పాన్-ఇండియా చిత్రాల హవా న‌డుస్తోన్న తరుణంలో తమిళ చిత్ర పరిశ్రమ ప్రత్యేక గుర్తింపును కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.

Tags:    

Similar News