జంగిల్‌లో చిక్కుకున్న 20 మంది స్టార్లు!
బాలీవుడ్ లో `హౌస్ ఫుల్ 5` తరవాత మరో భారీ ఫ్రాంఛైజీ చిత్రం `వెల్ కం టు ది జంగిల్` (వెల్ కమ్ 3) గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.;
బాలీవుడ్ లో `హౌస్ ఫుల్ 5` తరవాత మరో భారీ ఫ్రాంఛైజీ చిత్రం `వెల్ కం టు ది జంగిల్` (వెల్ కమ్ 3) గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్, సునీల్ శెట్టి, దిశా పటాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవీనా టాండన్, లారా దత్తా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి ఫిరోజ్ నదియాద్‌వాలా సమర్పకుడు.
అయితే ఈ సినిమా చిత్రీకరణ నత్తనడకన సాగడంతో అభిమానులు చాలా కాలంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల రెండు మూడు షెడ్యూళ్లను రద్దు చేయడంతో అసలు ఈ సినిమా పూర్తవుతుందా లేదా? అనే సందిగ్ధత నెలకొంది. బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ఊహించని విధంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని తెలుస్తోంది. పెద్ద స్టార్ల కాల్షీట్ల సర్ధుబాటు కష్టంగా మారింది. చెల్లింపులు సరిగా లేవు. ఫలితంగా షూటింగ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పటివరకు మూడు షెడ్యూల్‌లు రద్దు చేసారని, దీనితో నటీనటులు ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతోందో అర్థం కాని గందరగోళం ఉన్నారని చెబుతున్నారు. 60 శాతం షూటింగ్ పూర్తయిందని, ఇంకా 40 శాతం పూర్తి చేయాల్సి ఉందని సమాచారం. పెండింగ్‌లో ఉన్న షూటింగ్ గురించి స్పష్టత లేదని కథనాలొస్తున్నాయి.
మరింత లోతుగా వివరాల్లోకి వెళితే, నటీనటులు, టెక్నీషియన్లకు బకాయిలు చెల్లించకపోవడంతో ఇది మధ్యలో ఆగిపోయింది. 15 మందికి పైగా అగ్ర తారలు ఇందులో నటిస్తున్నారు. కాంబినేషన్ డేట్లను పొందడం చాలా పెద్ద శ్రమతో కూడుకున్నది. ప్రారంభంలో ప్రతి నటుడు ఉత్సాహంగా ఉన్నారు. కానీ షూట్ రద్దు చేయడం కారణంగా ఇతర షెడ్యూళ్లను మ్యానేజ్ చేయడం సమస్యగా మారింది. నటీనటుల తేదీలను వేరొక సినిమాకి ఇచ్చి ఉంటే వాటిని సర్ధుబాటు చేయాల్సి ఉంటుంది. అక్షయ్ కుమార్ సహా ఇతర స్టార్ల డేట్లను సర్ధుబాటు చేయాల్సి ఉంటుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అహ్మద్ ఖాన్- నదియాద్ వాలా ద్వయం దీనికి పరిష్కారం కనుగొని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి సవ్యంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.