'కూలీ'తో భయం లేదు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీమా!
ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 'వార్ 2' సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా, హృతిక్ రోషన్ కాలికి గాయం కావడంతో వాయిదా పడుతూ వచ్చింది.;
ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 'వార్ 2' సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా, హృతిక్ రోషన్ కాలికి గాయం కావడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వార్ 2 షూటింగ్ పూర్తి అయిందని, గుమ్మడి కాయ కొట్టేశారు అని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం విడుదలకు సంబంధించిన హడావుడి మొదలైంది. నార్త్ ఇండియాలో మెల్ల మెల్లగా వార్ 2 సినిమా ప్రమోషన్స్‌ను దర్శకుడు అయాన్ ముఖర్జీ, యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ వారు మొదలు పెట్టేందుకు గాను సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. సినిమా విడుదలకు ఇంకా నాలుగు వారాల సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు.
వార్ 2 సినిమాకు పోటీగా అదే రోజున సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న దేశ వ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి. కూలీ సినిమా సౌత్‌లో రూపొందినా సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో నార్త్ ఇండియాలోనూ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఇక వార్ 2 సినిమా హిందీలో రూపొందినా కూడా ఎన్టీఆర్ నటించడం వల్ల తెలుగు, తమిళ్ ఇతర సౌత్ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి వార్ 2 తో పాటు కూలీ సినిమాలు నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో భారీ ఎత్తున విడుదల కావడం కన్ఫర్మ్ అని బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు.
ఈ రెండు సినిమాల్లో ఏది పై చేయి సాధిస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వార్ 2 లో హృతిక్ రోషన్ నటించిన కారణంగా నార్త్ ఇండియాలో ముఖ్యంగా హిందీ సినిమాలు ఆడే రాష్ట్రాల్లో ఎలాంటి ఢోకా లేదు. ఇక ఎన్టీఆర్ ఉన్న కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 ముందు ఏ సినిమా నిలబడే అవకాశం లేదని నందమూరి అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు. వార్ 2 సినిమాతో పోల్చితే కూలీ సినిమా కచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో వెనకపడటం ఖాయం అనే అభిప్రాయంను ఫ్యాన్స్‌తో పాటు, బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో కూలీ సినిమాతో పోల్చితే వార్ 2 సినిమా చాలా వెనుక ఉండే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం.
వార్ 2 సినిమాను తెలుగులో పంపిణీ చేసే బాధ్యతలను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ తీసుకున్న విషయం తెల్సిందే. ఆయన వార్ 2 ను భారీ ఎత్తున విడుదల చేయాలని థియేట్రికల్ ఒప్పిందాలు చేసుకున్నాడు. వార్ 2 సినిమా కంటే ముందు ఆయన నిర్మించిన కింగ్డమ్ సినిమా విడుదల కాబోతుంది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించడం తో తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సడన్‌గా రెండు వారాల గ్యాప్‌తో విడుదల తేదీని ప్రకటించడంతో ప్రమోషన్ కార్యక్రమాలకు ఎక్కువ సమయం లేకుండా పోయింది. అందుకే కింగ్డమ్ యూనిట్ సభ్యులంతా ప్రమోషన్‌తో బిజీ కాబోతున్నారు. ఈ సమయంలో వారు వార్ 2 సినిమా ప్రమోషన్‌ను పక్కన పెడుతున్నట్లు టాక్.
జులై 31న కింగ్డమ్ సినిమా విడుదల కాబోతుంది. అప్పటి వరకు వార్ 2 సినిమా ప్రమోషన్స్‌ను పక్కన పెట్టనున్నారు. ఎప్పుడైతే కింగ్డమ్ సినిమా విడుదల అవుతోందో వెంటనే వార్ 2 సినిమా ప్రమోషన్స్ షురూ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కూలీ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. తమిళ్‌లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాల్లో కూలీ ముందు వార్ 2 నిలవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వార్ 2 సినిమా ఆధిపత్యం క్లీయర్‌గా కనిపించబోతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.