బ్ర‌హ్మ‌గిరి కేవ్స్‌తో 'వృష‌క‌ర్మ' క‌నెక్ష‌న్.. జ‌ర్న‌లిస్టుల‌కు టీమ్ చెప్పిన ర‌హ‌స్యాలు!

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `వృషకర్మ` ఆరంభం నుంచే సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను రేకెత్తించింది.

Update: 2026-10-25 06:09 GMT

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `వృషకర్మ` ఆరంభం నుంచే సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను రేకెత్తించింది.`విరూపాక్ష` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించిన‌ కార్తీక్ దండు దర్శకత్వం వ‌హిస్తుండ‌టం, బివిఎస్ఎన్ ప్రసాద్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండ‌ట‌మే ఈ హైప్ న‌కు కార‌ణం. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, `లాపతా లేడీస్`' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇటీవల మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యంత నిజరూప గుహ (కేవ్) సెట్‌ను సందర్శించేందుకు ఆహ్వానించారు. మేకర్స్ ప్రతి వివరంలోనూ చూపించిన శ్రద్ధ.. భారీత‌నంలోని దార్శనికతను చూసి మీడియా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ గుహ‌లు ఎంతో అద్భుతంగా ఉన్నాయ‌ని సీనియ‌ర్ సినీజ‌ర్న‌లిస్టులు కితాబిచ్చారు.

ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ దండు మాట్లాడుతూ.. అందరినీ `వృషకర్మ` ప్రపంచంలోకి ఆహ్వానించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసేలా ఈ చిత్రంలో భారీ సీక్వెన్స్‌లు ఉంటాయని, ఎలాంటి టీజర్ విడుదల చేయకముందే ఈ సినిమా కోసం చేసిన పరిశోధన.. నిర్మించిన భారీతనాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నానని తెలిపారు. ఈ కేవ్ సీక్వెన్స్ - క్లైమాక్స్ ఘట్టాలను అత్యంత భారీ క్యాన్వాస్‌పై మలిచామని.. అయితే ప్రతి సన్నివేశాన్ని కథకు అనుగుణంగా ఎంతో సహజంగా తీర్చిదిద్దామని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులకు ఇది ఒక నమ్మశక్యం కాని గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బ్ర‌హ్మ గిరి కేవ్స్ అనే పేరు ఎలా వ‌చ్చిందో వివ‌రిస్తూ.. ``అర‌కులో బొర్రా గుహ‌లు ఉన్నాయి. వేర్వేరు చోట్ల గుహ‌ల‌కు పేర్లు ఉంటాయి. అయితే ఈ సినిమా కోసం `బ్ర‌హ్మ‌గిరి కేవ్స్` అనే పేరును తాము ఎంపిక చేసుకున్నామ‌ని, ఆ పేరుతో గుహ‌లు ఏవీ లేవ‌``ని కూడా తెలిపారు.

హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. దర్శకుడు కార్తీక్ దండు చెప్పిన కథ, ఆయన ఆలోచనలోని సత్తా తనకు ఎంతగానో నచ్చాయని పేర్కొన్నారు. దర్శకుడు ఏకంగా ఏడు గంటల పాటు ప్రతి విషయాన్ని సవివరంగా నరేట్ చేశారని.. అత‌డి విజ‌న్‌.. ప్యాషన్ తనను ఈ ప్రయాణం వైపు నడిపించాయని చెప్పారు. ఈ సినిమా కోసం సెట్స్ నిర్మించి షూటింగ్ ప్రారంభించడానికి ముందు మూడు నెలల పాటు సరైన పరిశోధన చేశామని.. వర్క్‌షాప్‌లు.. స్క్రిప్టింగ్ సెషన్లను తాను ఎంతో ఆస్వాధించానని తెలిపారు.

ఈ చిత్రం గురించి మరింతగా చెప్తూ.. ``సరైన నిష్పత్తిలో ప్రతి అంశాన్ని రాసుకుని తెరకెక్కించిన ఒక అరుదైన విజువల్ స్పెక్టాకిల్ ఇది. ఇలాంటి విపరీతమైన ప్యాషన్ ఉన్న టీమ్‌తో పనిచేస్తూ, రియలిస్టిక్ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు నటులుగా మమ్మల్ని మేము మరింతగా ప్రూవ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. `వృషకర్మ` ఖచ్చితంగా నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్‌గా నిలవడమే కాకుండా అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే నమ్మకం నాకు ఉంది`` అని నాగచైతన్య నమ్మకాన్ని వ్యక్తం చేశారు. త‌న కెరీర్ లో అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందించిన తండేల్ సినిమాని మించిన బ‌డ్జెట్ ఈ వృష‌క‌ర్మ చిత్రం కోసం కేటాయించార‌ని కూడా నాగ‌చైత‌న్య జ‌ర్న‌లిస్టుల‌కు ధృవీక‌రించారు. నిరంత‌రం బిజీ లైఫ్ తో గ‌డిపే జ‌ర్న‌లిస్టుల‌ను బివిఎస్ఎన్ బృందం ఇలా ఆట‌విడుపుగా గుహ‌ల‌లోకి ఆహ్వానించ‌డం.. అక్క‌డ స‌ర‌దాగా వారితో చిట్ చాట్ చేసిన వీడియో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. డిసెంబ‌ర్ 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా విడుద‌ల‌కు సిద్ధ‌మవుతున్న ఈ చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించాల‌ని జ‌ర్న‌లిస్టులు విష్ చేసారు.


Full View


Tags:    

Similar News