ఫౌజీ.. మైత్రీ మాటల్లో ఈ ట్విస్ట్ ఏంటి?
పెద్ద హీరో సినిమా అంటే ఫ్యాన్స్‌కు హైప్ పెంచే మాటలు చెప్పడం ఈ మధ్య మామూలైపోయింది. కానీ ఒక్కోసారి అదే మాటలు సినిమా మీద అనవసరమైన భారాన్ని పెంచినట్లే.
పెద్ద హీరో సినిమా అంటే ఫ్యాన్స్‌కు హైప్ పెంచే మాటలు చెప్పడం ఈ మధ్య మామూలైపోయింది. కానీ ఒక్కోసారి అదే మాటలు సినిమా మీద అనవసరమైన భారాన్ని పెంచినట్లే. ముందుగా భారీ అంచనాలు క్రియేట్ చేసి, రిలీజ్ దగ్గరకు వచ్చాక వాటిని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభాస్ కొత్త సినిమా విషయంలో మైత్రీ నిర్మాత మాట్లాడుతున్న తీరు చూస్తే ఇదే పాయింట్ గుర్తుకొస్తోంది. ఈ మధ్య ఆయన ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ను కలిపి చూస్తే అసలు కథ అర్థమవుతుంది.
'ఫౌజీ'ని మొదట డిసెంబర్లో తీసుకురావాలనుకున్నారు. షూటింగ్, ఇతర పనులు మిగిలిపోవడంతో ఆ ప్లాన్ మారింది. అప్పట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కెరీర్లో గుర్తుండిపోయే స్థాయి సినిమా అవుతుందని చెప్పారు. వాయిదా వేసినా ప్రేక్షకులు జీవితాంతం గుర్తుపెట్టుకునే అవుట్‌పుట్ ఇస్తామనే నమ్మకం వ్యక్తం చేశారు. ప్రభాస్ మార్కెట్, హను రాఘవపూడి తీసుకుంటున్న పీరియడ్ బ్యాక్‌డ్రాప్ కారణంగా ఆ మాటలు అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచాయి.
కానీ బర్త్‌డే గ్లింప్స్‌కు ముందు అదే రవిశంకర్ మరో రకంగా మాట్లాడారు. 'బాహుబలి' తరహా సినిమా అనుకుని రావొద్దని, 'ఫౌజీ' కథ, ప్రభాస్ పాత్ర వేరుగా ఉంటాయని చెప్పారు. భారీ సినిమా కాబట్టి భారీ యుద్ధాలే ఉంటాయని ఊహించే ఆడియన్స్‌ను ముందుగానే సిద్ధం చేస్తున్నట్లుంది. టీజర్లోనూ రెగ్యులర్ మాస్ ఎలివేషన్స్ కంటే రెండో ప్రపంచ యుద్ధం, గూఢచర్యం, నేతాజీ నేపథ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
ఇక్కడ దర్శకుడు హను రాఘవపూడి స్టైల్ కూడా ముఖ్యం. 'సీతారామం'లో ప్రేమకథను మిలిటరీ నేపథ్యంలో నడిపించిన ఆయన ఈసారి ప్రభాస్‌తో పెద్ద కాన్వాస్ ఎంచుకున్నారు. టీజర్లో చూపించిన కాలం, దేశాలు, పాత్రల్ని తెరపై నమ్మించేలా చూపించాలంటే సెట్స్‌తో పాటు వీఎఫ్ఎక్స్ పనులు పక్కాగా ఉండాలి. హీరో ఇంట్రడక్షన్ కంటే కథ జరిగే ప్రపంచాన్ని ముందుగా చూపించడం కూడా రెగ్యులర్ ప్రభాస్ సినిమాల ప్రమోషన్‌కు భిన్నంగా ఉంది.
ఇంతలో నిర్మాత మరో హామీ ఇచ్చారు. మార్చి 19న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా వస్తుందని, నెల ముందే రిలీజ్ ఏర్పాట్లు మొదలుపెడతామని చెప్పేశారు. అంటే ఒకవైపు అంచనాలను కథకు తగ్గట్లు మార్చే ప్రయత్నం, మరోవైపు డేట్ విషయంలో వెనక్కి తగ్గబోమనే ధీమా. డిసెంబర్ నుంచి వాయిదా పడిన సినిమాకు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం మామూలు పని కాదు. ముఖ్యంగా మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు టైమ్ లిమిట్ పడుతుంది.
మైత్రీ దగ్గర ప్రభాస్ సినిమా ఒక్కటే లేదు. ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'డ్రాగన్' కూడా ఆ సంస్థ చేతుల్లోనే ఉంది. దాని రిలీజ్ డేట్ విషయంలోనూ మాట నిలబెట్టుకుంటామని రవిశంకర్ చెప్పారు. రెండు భారీ సినిమాల డేట్లు ముందుగా లాక్ కావడం వల్ల థియేటర్ల ఒప్పందాలు చేసుకునే బయ్యర్లకు, అదే సీజన్లో ప్లాన్ చేసుకునే చిన్న నిర్మాతలకు కొంత క్లారిటీ వస్తుంది.