రంగులు రంగులు గీతం : జానకి రాముల బంధం.. సాంప్రదాయానికి రెహ్మాన్ శైలి
నమిత్ మల్హోత్రా నిర్మాణంలో, నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `రామాయణం` నుంచి తాజాగా విడుదలైన మూడో పాట `రంగులు రంగులే (రంగులు రంగులే మంగళ భరితమే జానకి రాముల బంధమే)` సోషల్ మీడియాలో దూసుకెళుతోంది.
నమిత్ మల్హోత్రా నిర్మాణంలో, నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `రామాయణం` నుంచి తాజాగా విడుదలైన మూడో పాట `రంగులు రంగులే (రంగులు రంగులే మంగళ భరితమే జానకి రాముల బంధమే)` సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. 2026 దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఈ మెలోడీ పాట ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తోంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ గీతానికి తెలుగులో రాకేందు మౌళి సాహిత్యం అందించగా.. రాఘవ్ కౌశిక్ - వైశాలి సామంత్ తమ ఆలపనతో హృదయాలను హత్తుకునేలా పాడారు.
ఈ పాట ముఖ్యంగా శ్రీరాముడు (రణ్‌బీర్ కపూర్), సీతాదేవి (సాయి పల్లవి) ల మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని, వారి ప్రేమ ప్రయాణాన్ని అత్యంత సుందరంగా ఆవిష్కరించింది. స్వయంవరంలో శ్రీరాముడు శివుని విల్లును ఎత్తే అద్భుతమైన సన్నివేశం నుంచి.. సీతాదేవిని వరించే ఘట్టం.. పెళ్లి, అయోధ్యా నగరం.. అరణ్యవాసం వరకు వారి మధ్య ఉన్న అనురాగాన్ని ఈ పాటలో ప్రదర్శించారు. `నుదుట తిలకం.. సౌభాగ్యం..` అంటూ సాగే సాహిత్యం కాబోయే భార్యాభర్తల బంధం ప్రాముఖ్యతను, సాంప్రదాయ సౌందర్యాన్ని ఎంతో చక్కగా వర్ణించింది.
విజువల్స్ పరంగా ఈ పాట ఎంతో భారీతనంతో.. నభూతో న భవిష్యతి అన్నట్లుగా తీర్చిదిద్దారు. కోట ప్రాంగణం, అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో పాటు పాత్రల కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తున్నాయి. రాకుమారుడిగా శ్రీరాముడి చిరునవ్వు, సీతాదేవి ఆహ్లాదకరమైన చూపులు, నవ్వులు ప్రేక్షకులను పరవశింపజేస్తున్నాయి. పాటలోని ప్రశాంతమైన వాతావరణం, నిర్మాణ విలువలు రామాయణ ఇతిహాసానికి తగినట్లుగా ఎంతో పర్‌ఫెక్ట్‌గా కుదిరాయని నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఈ పాటలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవిల రూపం అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ముఖ్యంగా సీతమ్మ పాత్రలో సాయి పల్లవి కనిపించిన తీరు.. ఆమె ముఖంలోని దైవత్వంతో కూడిన పవిత్రత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రణ్‌బీర్ కపూర్ - సాయి పల్లవిల మధ్య కుదిరిన ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో స్వచ్ఛంగా, చూడముచ్చటగా ఉందంటూ నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
టి-సిరీస్ వేదికగా విడుదలైన ఈ పాట కామెంట్ సెక్షన్‌లో భారతీయులంతా ఐక్యంగా స్పందిస్తుండటం విశేషం. ఇది కేవలం ప్రాంతీయ చిత్రం మాత్రమే కాదని.. భారతీయ సినిమా గర్వించదగ్గ గొప్ప దృశ్యకావ్యమని ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. `బాహుబలి`,`ఆర్ఆర్ఆర్`, `కల్కి 2898 ఏడి` చిత్రాల తరహాలోనే ఈ `రామాయణం` చిత్రం కూడా భారతీయ సినిమా సరిహద్దులను చెరిపేస్తూ ప్రపంచ స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.