`చావా` దర్శకుడి `ఈత` టీజర్: నర్తకిగా శ్రద్ధా లుక్‌కి ఫిదా
ఒక నిజ ఘటనను అద్భుతమైన సినిమాటిక్ బ్రిలియన్సీతో వెండితెరపై ఆవిష్కరిస్తే, అది నిజంగా ప్రజల్ని రంజింపజేస్తుందనడానికి ఇటీవల ఎన్నో సినిమాలు ఉన్నాయి.
ఒక నిజ ఘటనను అద్భుతమైన సినిమాటిక్ బ్రిలియన్సీతో వెండితెరపై ఆవిష్కరిస్తే, అది నిజంగా ప్రజల్ని రంజింపజేస్తుందనడానికి ఇటీవల ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అదే తరహాలో నిజ ఘటనల ఆధారంగా ఒక నర్తకి జీవితంపై తీస్తున్న సినిమా బాలీవుడ్ లో చర్చగా మారింది. ఈ చిత్రాన్ని స్త్రీ2, చావా లాంటి భారీ చిత్రాల్ని అందించిన దినేష్ విజన్ తన బ్యానర్ లో నిర్మిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చావా లాంటి బ్లాక్ బస్టర్ కి దర్శకత్వం వహించిన లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది.
విఠాభాయి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజాగా విడుదలైన టీజర్ లో విఠాభాయి నృత్యం కోసం పడిగాపులు పడే ఆ కాలాన్ని విజువలైజ్ చేసిన తీరు ఎంతో మనోహరంగా, అద్భుతంగా ఉంది. స్టేజీపై ఎంతమంది నర్తకులు ఉన్నా.. ఈత కోసం వేచి చూస్తున్నారు అంతా. అసలింతకీ ఎవరా ఈత? ఆమె కథేమిటన్నది తెరపైనే చూడాల్సి ఉంటుంది. వేదికపై పెర్ఫామెన్స్ కోసం సిద్ధమైన విఠాభాయి స్టేజీ వెనక ఒంటరిగా బిడ్డను ప్రసవించే సన్నివేశాన్ని చూపించడం నిజంగా ఎమోషన్ కి గురి చేస్తోంది. కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా.. లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని ఒక క్లాసిక్ గా మలుస్తున్నారని టీజర్ చెబుతోంది.
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావణి జానపద నృత్యకారిణి, గాయని అయిన విఠాబాయి నారాయణగావ్‌కర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. `స్త్రీ 2` అఖండ విజయం తర్వాత శ్రద్ధా కపూర్ నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
విడుదలైన ఈ టీజర్ ప్రారంభంలోనే ఉద్వేగాన్ని రేకెత్తించే సన్నివేశాన్ని చూపించారు. వేలాది మంది ప్రేక్షకులు ఒక బహిరంగ వేదిక వద్ద జానపద నృత్య ప్రదర్శనను చూడటానికి గుమిగూడతారు. వారంతా `ఈత` ప్రదర్శన ఇవ్వాలంటూ గట్టిగా డిమాండ్ చేస్తుండగా.. స్టేజీ వెనక ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనతో అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆమె మరెవరో కాదు.. గొప్ప ప్రజాదరణ పొందిన నృత్యకారిణి ఈత (శ్రద్ధా కపూర్). కాన్పు అయిన వెంటనే కనీసం విశ్రాంతి కూడా తీసుకోకుండా ఈత నేరుగా వేదికపైకి వచ్చి తన నృత్య ప్రదర్శనను కొనసాగించే హీదయాన్ని కదిలించే సంచలన దృశ్యాన్ని టీజర్‌లో ఆవిష్కరించారు.
ఆ తర్వాత శ్రద్ధా కపూర్ తన నృత్య నైపుణ్యంతో, అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకులను ఏ విధంగా మంత్రముగ్ధులను చేసిందో చాలా చక్కగా చూపించారు. సినిమా కథాంశాన్ని ఎక్కువగా బయటపెట్టకుండా కేవలం ప్రధాన పాత్ర తీవ్రతను, వైవిధ్యాన్ని మాత్రమే మేకర్స్ ఈ టీజర్‌లో ఎలివేట్ చేశారు. విఠాబాయి నారాయణగావ్‌కర్ జీవితంలో 1940 నుండి 1990 మధ్య కాలంలో జరిగిన కీలక ఘట్టాలను, ఎదుర్కొన్న సామాజిక వివక్షను, కళపై సదరు నర్తకికి ఉన్న అంకితభావాన్ని ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి చూపించబోతున్నారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రణ్‌దీప్ హుడా, మహ్మద్ జీషాన్ అయూబ్, అనంత్ జోషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాడక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్, మడాక్ ఫిల్మ్స్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో సహజత్వానికి, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తారనే భావన ఉంది. మహారాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పేలా ఈ చిత్రాన్ని మడాక్ ఫిలింస్ నిర్మిస్తోందని సమాచారం.
ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఈ టీజర్ వైరల్‌గా మారింది. గర్భిణీగా శ్రద్ధా కపూర్ చూపించిన నటన, లావణి నృత్యకారిణిగా మేకోవర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రద్ధా కపూర్ కెరీర్‌లోనే ఇది అత్యంత కఠినమైన, వైవిధ్యమైన పాత్రగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రక్షాబంధన్ కానుకగా ఆగస్టు 28 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.