డాడీ-సన్ గా డార్లింగ్ రెండవ సారి!
లార్జ్-ద్యాన్-లైఫ్ పాత్రలకు.. పవర్‌ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్ రెబల్ స్టార్ ప్రభాస్.
లార్జ్-ద్యాన్-లైఫ్ పాత్రలకు.. పవర్‌ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్ రెబల్ స్టార్ ప్రభాస్. `బాహుబలి` చిత్రంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా తండ్రీకొడుకుల ద్విపాత్రాభినయంలో ప్రభాస్ నటన, పండించిన ఎమోషన్స్ ఏ రేంజ్ లో పండాయో? తెలిసిందే. ఆ ప్రయోగం టాలీవుడ్ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది. తాజాగా అదే మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేయడానికి డార్లింగ్ సిద్ధమవుతున్నారనే వార్త భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ `సలార్: శౌర్యాంగ పర్వం` (సలార్ 2) లో ప్రభాస్ మరోసారి తండ్రీకొడుకులుగా డబుల్ యాక్షన్‌తో అలరించబోతున్నారనే క్రేజీ అప్‌డేట్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మొదటి భాగం `సలార్: సీజ్‌ఫైర్ ` లో ప్రభాస్ కొడుకు దేవా పాత్రలోనే కనిపించి థియేటర్లలో మాస్ పూనకాలు తెప్పించారు. ఖాన్సార్ సామ్రాజ్యంలో తన స్నేహితుడు వరదరాజ మన్నార్ కోసం ప్రాణాలైనా ఇచ్చే క్యారెక్టర్‌లో, వయోలెంట్ మెషిన్‌గా ప్రభాస్ కనబరిచిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే మొదటి భాగం ముగింపులో దేవా అసలు సిసలైన శౌర్యాంగ వంశ వారసుడనే ట్విస్ట్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ కథపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రెండవ భాగంలో దేవా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో పాటు, శౌర్యాంగ వంశానికి మూలపురుషుడైన అతని తండ్రి ధారా పాత్రను కూడా కథలోకి ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సీక్వెల్‌లో ప్రభాస్ చేయబోయే తండ్రి `ధారా` పాత్ర అత్యంత పవర్‌ఫుల్ గా, రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఉండబోతుందని సమాచారం. ఖాన్సార్ సామ్రాజ్య స్థాపనలో.. దాని వెనుక ఉన్న రాజకీయాలలోను శౌర్యాంగ వంశానికి జరిగిన అన్యాయాన్ని.. దానికి ధారా ఏ విధంగా ప్రతిఘటించాడనే అంశాలను ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా స్క్రీన్‌పై ఆవిష్కరించనున్నారుట. మొదటి భాగంలో కేవలం కొడుకుగా శాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు విరుచుకుపడే దేవాను చూసాం. కానీ రెండో భాగంలో తండ్రి ధారా పాత్రలో ప్రభాస్ వింటేజ్ రగ్గడ్ అండ్ మాస్ లుక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని ఇండస్ట్రీ టాక్. తండ్రి పాత్ర చుట్టూ తిరిగే ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని తెలుస్తోంది.
కథాంశం పరంగా చూస్తే తండ్రి సామ్రాజ్యాన్ని - కోల్పోయిన శౌర్యాంగ వంశ గౌరవాన్ని కొడుకైన దేవా ఎలా తిరిగి తెచ్చుకున్నాడు? ఖాన్సార్ సింహాసనాన్ని ఎలా దక్కించుకున్నాడు? అనే కోణంలో బాక్సాఫీస్ లెక్కలను మార్చేందుకు మేకర్స్ స్క్రిప్ట్‌ను పకడ్బందీగా రెడీ చేశారుట. తండ్రి, కొడుకుల మధ్య ఉండే సెంటిమెంట్‌తో పాటు వారిద్దరి యాక్షన్ పంథా కూడా సినిమాలో హైలైట్‌గా నిలవనుందంటున్నారు. `బాహుబలి`లో తండ్రీకొడుకుల ఎమోషన్ ఏ విధంగానైతే వర్కవుట్ అయి సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందో? అదే తరహాలో `సలార్ 2`లో కూడా శౌర్యాంగ వంశానికి సంబంధించిన సెంటిమెంట్ అండ్ రివెంజ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని భావిస్తున్నారు.