చరణ్ కోసం దేశభక్తి -జాతీయ సమగ్రతపై స్క్రిప్ట్?
ఇటీవలి కాలంలో దేశభక్తి- జాతీయ సమగ్రతపై సినిమాల వెల్లువ మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇటీవలి కాలంలో దేశభక్తి- జాతీయ సమగ్రతపై సినిమాల వెల్లువ మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తోంది. దురంధర్- దురంధర్ 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత అందరి ఆసక్తి ఇటువైపు కూడా మళ్లింది. సల్మాన్ ఖాన్ టైగర్ కాన్సెప్ట్ సినిమాలు చాలా వరకూ తీవ్రవాదాన్ని డీల్ చేస్తూ దేశభక్తిని ఎలివేట్ చేస్తే, దానికి మించి ఆదిత్యాధర్ `దురంధర్` సబ్జెక్ట్ ని మరో లెవల్ కి తీసుకుని వెళ్లారు గనుకనే ఈ స్థాయి విజయం సాధ్యమైంది. దురంధర్ ఫ్రాంఛైజీ నుంచి రెండు సినిమాలు ఏకంగా 3000 కోట్లు వసూలు చేయడం అనేది భారతీయ సినిమా హిస్టరీలో ఒక సంచలనం. అంతకుముందు కనీవినీ ఎరుగని ఒక కొత్త స్పైని చూపించడంలో ధర్ పెద్ద సక్సెసయ్యారు గనుకనే ఇంతటి ఆదరణ.
దురంధర్ సక్సెస్ చాలా విషయాలను సినీపరిశ్రమలకు నేర్పించింది. భారతదేశం గొప్పదనాన్ని, ఇక్కడి ప్రతిభను పనితనాన్ని ఎలివేట్ చేస్తూ, దేశం కోసం ఎలాంటి సాహసాలకు అయినా సిద్ధమయ్యే దేశభక్తులైన వీరుల కథలను తెరపైకి తీసుకు వస్తే కచ్ఛితంగా ప్రజలు ఆదరిస్తారని నిరూపణ అయింది.
ఇంతకుముందు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో దేశభక్తిని కూడా ఇన్ బిల్ట్ చేసారు గనుకనే దానికి పాన్ ఇండియాలో అంతటి రీచ్ వచ్చిందని కూడా విశ్లేషించవచ్చు. తాజాగా రిపబ్లిక్ టీవీ కాన్ క్లేవ్ లో మాట్లాడిన రామ్ చరణ్ ఇండియా ఫస్ట్ అనే నినాదం గురించి, జాతీయ సమగ్రత గురించి ప్రస్థావించడం ఆసక్తిని కలిగించింది. ఈ తరహా సినిమాల వెల్లువ అవసరమని చరణ్ అన్నారు. ``ఇండయా ఫస్ట్` వంటి జాతీయ సమగ్రత చాలా చాలా ముఖ్యం. అలాంటి కథలే దేశాన్ని ఒక్క తాటిపైకి తీసుకురాగలవు. దురంధర్ విజయమే అందుకు నిదర్శనం. ఇలాంటి మరిన్ని సినిమాలు రావాల``ని రామ్ చరణ్ ఆకాంక్షించారు.
ఒక పెద్ద వేదికపై చరణ్ సూచనను అతడి ఫేవరెట్ దర్శకులు గమనించే ఉంటారు. బహుశా దురంధర్ లాంటిది కాకపోయినా.. ఒక యూనిక్ కాన్సెప్ట్ తో నిజ ఘటనల ఆధారంగా దేశభక్తిని ఇన్ బిల్ట్ చేసే ఒక కథాంశాన్ని చరణ్ కోసం అందించే దర్శకరచయితలు ఎవరైనా ఉన్నారా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. చరణ్ సూచనను స్వీకరించి మునుముందు ఎవరైనా ఒక అద్భుతమైన స్క్రిప్టుతో వస్తారేమో చూడాలి.
చరణ్ కెరీర్ బెస్ట్ చిత్రాలలో ధృవ ఒకటి. ఒక నిజాయితీగల ఐపిఎస్ అధికారిగా అద్భుతంగా నటించాడు. ఇక శారీరకంగా ఎంతటి కఠోర శిక్షణకైనా తాను సిద్ధంగా ఉన్నానని నిరూపిస్తూ `పెద్ది` చిత్రంలో మేకోవర్ కూడా చూపించాడు. అందుకే అతడిని ఒక ఎన్.ఐ.ఏ అధికారిగా లేదా వీర జవాన్ గా లేదా దేశం కోసం ఎంతకైనా తెగించే ఒక స్పైగా చూపిస్తే అది అభిమానులకే పెద్ద పండుగలా ఉంటుంది. ఇక దేశభక్తి అనే యూనివర్శల్ కాన్సెప్ట్ తో చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ ప్రయోగాలు చేస్తే అది పెద్ద విజయం సాధిస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. మారుతున్న ట్రెండ్ కనుగుణంగా మన దర్శకనిర్మాతలు చరణ్ ఇచ్చిన ఈ సూచనను అనుసరిస్తారేమో చూడాలి.
చరణ్ తదుపరి సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటి? అన్నది వేచి చూడాలి. పుష్ప లాంటి సీరియస్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్లు అందుకున్న సుకుమార్ నెక్స్ట్ స్క్రిప్ట్ ఎలా ఉండబోతోంది? చరణ్ ని `రంగస్థలం` చిట్టిబాబు కంటే భిన్నంగా ఎలా చూపిస్తారో వేచి చూడాలి.