పాప్ ఐకాన్ మడోన్నా బయోపిక్ ర‌ద్దుకు కారణం ఇదే!

త‌న క‌థ‌ను తానే రాసుకుని ద‌ర్శ‌క‌త్వం చేయ‌డానికి సిద్ద‌ప‌డ్డారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ అకస్మాత్తుగా ఆగిపోవడం హాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Update: 2026-06-23 09:10 GMT

ప్రపంచ సంగీత పాప్ రాణి గా వెలిగిన‌ మడోన్నా జీవిత బ‌యెపిక్ పై అంచ‌నాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. సాధారణ అమ్మాయి స్థాయి నుండి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన మ‌డొన్నా ప్రస్థానాన్ని వెండితెరపై చూడాలని ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. యూనివర్సల్ పిక్చర్స్ నిర్మించాల్సిన ప్రతిష్టాత్మక చిత్రం కోసం ఏకంగా మడోన్నా రంగంలోకి దిగారు. త‌న క‌థ‌ను తానే రాసుకుని ద‌ర్శ‌క‌త్వం చేయ‌డానికి సిద్ద‌ప‌డ్డారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ అకస్మాత్తుగా ఆగిపోవడం హాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

బయోపిక్ ఎందుకు రద్దయింది ? అనే విషయాలపై మడోన్నా ఇటీవలే ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలను వెల్లడించారు. తన జీవిత విశేషాలను సినిమాగా మలిచేందుకు రెండేళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశాన‌న్నారు. ఆ తర్వాత మరో రెండేళ్లు యూనివర్సల్ స్టూడియోస్‌తో కలిసి బడ్జెట్, కాస్టింగ్ ప్రక్రియలపై కసరత్తులు చేశానని పేర్కొన్నారు. అయితే చివరకు స్టూడియో యాజమాన్యంతో త‌లెత్తిన‌ విభేదాల వల్లే ప్రాజెక్ట్ అర్ధాంతరంగా నిలిచిపోయిందన్నారు. ప్రాజెక్ట్ రద్దవ్వ‌డానికి ప్రధాన కారణం బడ్జెట్ వివాదమేనని మడోన్నా తెలిపారు.

త‌న క‌థ‌ను రెండు గంటల సినిమాలో చూపించాలంటే భారీ వ్యయం అవసరమవుతుందని భావించారు. అయితే మడోన్నా ఆశించిన స్థాయి నిధులను సమకూర్చడానికి - ఆమె కథలోని భారీతనాన్ని అంగీకరించడానికి యూనివర్సల్ పిక్చర్స్ నిరాకరించింది. మ‌డోన్నా జీవితాన్ని సరైన రీతిలో ఆవిష్కరించడానికి అవసరమైన బడ్జెట్‌ను అర్థం చేసుకోవడంలో సదరు స్టూడియో విఫలమైందని మ‌డోన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు తాను ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించినప్పటికీ స్టూడియో నుండి సరైన మద్దతు లభించలేదని మడోన్నా ఆవేదన వ్యక్తం చేశారు.

బడ్జెట్ తగ్గించడం కోసం సెర్బియా దేశంలో షూటింగ్ జరపడానికి కూడా తాను సిద్ధమయ్యానని.. కానీ స్టూడియో ప్రతినిధులు తన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశార‌న్నారు. `నువ్వు సెర్బియాలో నాలుగు రోజులకు మించి ఉండలేవు` అంటూ స్టూడియో వారు చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయ‌న్నారు. తన జీవితమంతా పోరాటమని...సెర్బియాకు తాను విహారయాత్రకు వెళ్లడం లేదని గట్టిగానే బదులిచ్చినట్లు మ‌డోన్నా గుర్తు చేసుకున్నారు. ఈ కాంబినేష‌న్ బ్రేక్ అయిన త‌ర్వాత‌ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఆమె జీవితాన్ని ఓ వెబ్ సిరీస్‌గా రూపొందించేందుకు ఆసక్తి చూపించింది.

అయితే ఇక్కడా మడోన్నాకు చట్టపరమైన చిక్కు ఎదురైంది. యూనివర్సల్ పిక్చర్స్ కోసం ఆమె స్వయంగా రాసుకున్న స్క్రిప్ట్‌ను తిరిగి ఉపయోగించాలంటే? ఆ స్టూడియో భారీ ధరను డిమాండ్ చేసింది. తాను సొంతంగా రాసిన కథను వేరే వేదికపై వాడుకోవడానికి కూడా హాలీవుడ్ నిర్మాణ సంస్థలు అడ్డుపడటం మ‌డోన్నాను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాప్ పరిశ్రమను దశాబ్దాల పాటు శాసించిన మడోన్నా లాంటి లెజెండరీ ఆర్టిస్ట్ బయోపిక్ ఇలా కార్పొరేట్ నిబంధనలు.. బడ్జెట్ లెక్కల మధ్య నలిగిపోయి ఆగిపోవడం విచారకరం.

Tags:    

Similar News