పాప్ కార్న్ మాత్రమేనా? రెమ్యునరేషన్స్ సంగతేంటి మరి?
ఆయన కామెంట్స్ పై అభిమానులు, సినీ ప్రేక్షకులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా టికెట్ ధరలు, థియేటర్లలో పాప్ కార్న్ రేట్లు, స్టార్ హీరోల రెమ్యునరేషన్లపై సోషల్ మీడియాలో మరోసారి పెద్ద చర్చ మొదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల పెద్ది సినిమా పోస్ట్ ప్రమోషన్లలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆయన కామెంట్స్ పై అభిమానులు, సినీ ప్రేక్షకులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒక కార్యక్రమంలో మాట్లాడిన రామ్ చరణ్.. ఇండియాలో సినిమా ఇప్పటికీ చాలా చీప్ ఎంటర్టైన్మెంట్ మీడియం అని అన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి థియేటర్ లో సినిమా చూడటం స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని పేర్కొన్నారు. అయితే థియేటర్లలో పాప్ కార్న్, ఇతర ఫుడ్ ఐటెమ్స్ ధరలు తగ్గితే ప్రేక్షకులకు కంఫర్ట్ గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
ముఖ్యంగా టికెట్ ధరలు పెరిగిన సమయంలో సినిమా చీప్ ఎంటర్టైన్మెంట్ అనే కామెంట్ ప్రేక్షకుల్లో కొందరికి అంతగా నచ్చలేదనే అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పెద్ద సినిమాల విడుదల సమయంలో స్పెషల్ పర్మిషన్స్ తో టికెట్ రేట్లు పెంచడం కామన్ అయిపోయింది. తొలి వారం, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోల పేరుతో ప్రేక్షకులు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఒక ఫ్యామిలీ థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చు అవుతుందని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఇక్కడే మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పాప్ కార్న్ రేట్లు తగ్గాలనే సజెషన్ సరైనదే కానీ, సినిమాల బడ్జెట్ పెంచుతున్న స్టార్ హీరోల రెమ్యునరేషన్లపై చర్చ జరగాలని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పలువురు స్టార్ హీరోలు వందల కోట్ల రూపాయల పారితోషికాలు తీసుకుంటున్నారనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి.
దీంతో ప్రొడక్షన్ కాస్ట్ భారీగా పెరుగుతోందని, ఆ భారం చివరికి టికెట్ రేట్ల రూపంలో ప్రేక్షకులపైనే పడుతోందని కామెంట్లు కనిపిస్తున్నాయి. మరోవైపు, సినిమా విజయానికి కంటెంట్ మెయిన్ ఎలిమెంట్ అని పలువురు సినీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కథ స్ట్రాంగ్ గా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, అతి భారీ బడ్జెట్ లు లేదా హై రెమ్యునరేషన్లు అవసరం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. బడ్జెట్ కంట్రోల్ లో ఉంటే టికెట్ ధరల పెంపు అవసరం కూడా తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది.
అయితే కొందరు మాత్రం స్టార్ హీరోల మార్కెట్ వల్లే ఓపెనింగ్స్ వస్తాయని, నిర్మాతలకు ముందుగానే బిజినెస్ జరిగే అవకాశం కలుగుతుందని చెబుతున్నారు. అందుకే రెమ్యునరేషన్ అంశాన్ని పూర్తిగా తప్పుబట్టలేమని వారి వాదన. ఏదేమైనా రామ్ చరణ్ చేసిన పాప్ కార్న్ కామెంట్ చిన్న చర్చగా మొదలై.. ఇప్పుడు సినిమా ఖర్చులు, టికెట్ ధరలు, స్టార్ హీరోల రెమ్యునరేషన్లు, బడ్జెట్ కంట్రోల్ వంటి అంశాల వరకు చేరింది. ఆడియన్స్ పాకెట్ పై భారం తగ్గాలంటే అసలు మారాల్సింది ఎక్కడ? అనే ప్రశ్నను మరోసారి ఇండస్ట్రీ ముందుంచింది. పాప్ కార్న్ మాత్రమే కాదు.. రెమ్యునరేషన్స్ సంగతేంటన్న ప్రశ్నకు సమాధానం కోసం ఇప్పుడు చాలామంది ఎదురుచూస్తున్నారు.