ఫాంటసీ హిట్లు ఉన్నా.. స్టార్ల దగ్గరే అసలు టెన్షన్

తెలుగు సినిమాలో ఫాంటసీ కథలకు ఇప్పుడు మార్కెట్ బాగానే ఉంది. ‘బింబిసార’తో కళ్యాణ్ రామ్ హిట్ అందుకున్నాడు.

Update: 2026-08-25 18:30 GMT

తెలుగు సినిమాలో ఫాంటసీ కథలకు ఇప్పుడు మార్కెట్ బాగానే ఉంది. ‘బింబిసార’తో కళ్యాణ్ రామ్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘కార్తికేయ 2’ మైథాలజీ టచ్ ఉన్న అడ్వెంచర్‌గా పెద్ద స్థాయికి వెళ్లింది. ‘హనుమాన్’ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్ అయింది. గత ఏడాది వచ్చిన ‘మిరాయ్’ కూడా ఫాంటసీ యాక్షన్‌తో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకుంది. అంటే ప్రేక్షకులు ఈ ప్రపంచాలను చూడటం మానేయలేదు.

కానీ పెద్ద స్టార్ వచ్చేసరికి లెక్క అంత ఈజీగా కనిపించడం లేదు. దీనికి ‘రాజాసాబ్’ ఉదాహరణ. ప్రభాస్‌ను హారర్, ఫాంటసీ ప్రపంచంలో పెట్టిన ఈ సినిమా ఈ ఏడాది భారీ ఓపెనింగ్‌తో మొదలైంది. వరల్డ్ వైడ్ తొలి రోజే వంద కోట్ల మార్క్ దాటినా, ఆ తర్వాత నెగెటివ్ టాక్‌తో స్పీడ్ పూర్తిగా తగ్గిపోయింది. భారీ స్టార్ పవర్ మొదటి రోజు వరకు తీసుకెళ్లగలిగింది కానీ ఫాంటసీ వరల్డ్ ప్రేక్షకుడిని పట్టుకోలేకపోయింది.

నిజానికి తెలుగు ఆడియన్స్ కి ఇది కొత్త జానర్ కూడా కాదు. ఎన్టీఆర్ కాలంలో ‘పాతాళ భైరవి’, ఏఎన్నార్ ‘కీలుగుర్రం’, ఇద్దరూ కలిసి చేసిన ‘మాయాబజార్’ వరకు ఫాంటసీ కథలు అప్పటి స్టార్ సినిమాల్లో భాగంగానే ఉండేవి. తర్వాత చిరంజీవికి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, బాలకృష్ణకు ‘భైరవద్వీపం’, ఎన్టీఆర్‌కు ‘యమదొంగ’, రామ్ చరణ్‌కు ‘మగధీర’ పెద్ద మార్కెట్ ను ఇచ్చాయి. అంటే స్టార్ హీరో + ఫాంటసీ ఫార్ములా మన దగ్గర గతంలో చాలాసార్లు పనిచేసింది.

అదే సమయంలో దెబ్బ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. చిరంజీవి ‘అంజి’ అప్పట్లో భారీ విజువల్ ప్రయోగమే అయినా కమర్షియల్‌గా అనుకున్న స్థాయికి వెళ్లలేదు. ఎన్టీఆర్ ‘శక్తి’ కూడా భారీ సెటప్‌తో వచ్చి డిజాస్టర్ అయింది. ఈమధ్య ‘రాజాసాబ్’ కూడా ఆ జాబితాలో చేరింది. ఇలాంటి సినిమాల్లో హీరో ఇమేజ్ ఒక్కటే సరిపోదు. ఆ ఫాంటసీ ప్రపంచం, అందులోని రూల్స్, విజువల్స్, ఎమోషన్ అన్నీ ప్రేక్షకుడికి నమ్మేలా ఉండాలి.

ఇప్పుడు ‘విశ్వంభర’ ముందు ఉన్న సమస్య కూడా అక్కడే. మొదటి టీజర్‌లోని వీఎఫ్ఎక్స్‌పై భారీగా విమర్శలు వచ్చాయి. తర్వాత విడుదల చేసిన గ్లింప్స్‌లో విజువల్స్ మెరుగయ్యాయని రెస్పాన్స్ వచ్చినా, మొదటి ఇంప్రెషన్ పూర్తిగా మారిపోయిందని చెప్పలేం. పైగా సినిమా చాలా కాలంగా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండటం, రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా లాక్ కాకపోవడంతో ప్రమోషనల్ మోమెంటమ్ కూడా కొనసాగలేదు. నిర్మాతలు కూడా మొదటి టీజర్ రెస్పాన్స్ తర్వాత వీఎఫ్ఎక్స్‌పై మళ్లీ పని చేస్తున్నట్లు చెప్పారు.

ఇక్కడ వశిష్టకు మాత్రం ఒక అడ్వాంటేజ్ ఉంది. అతని మొదటి సినిమా ‘బింబిసార’ కూడా ఫాంటసీ జోన్‌లోనే వచ్చి హిట్ అయింది. కానీ అక్కడ కళ్యాణ్ రామ్‌తో చేసిన స్కేల్ వేరు. ఇప్పుడు చిరంజీవి, భారీ బడ్జెట్, పెద్ద వీఎఫ్ఎక్స్ ప్రపంచం అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. హనుమాన్, మిరాయ్ తర్వాత ఫాంటసీ కథలు పనిచేస్తాయని ఇప్పటికే ప్రూవ్ అయింది. ‘రాజాసాబ్’ తర్వాత పెద్ద స్టార్‌తో కూడా అదే చేయగలమని చూపించాల్సిన సినిమా మాత్రం ఇప్పుడు ‘విశ్వంభరే'.

Tags:    

Similar News