కీరవాణిని అవమానించారు.. డైరెక్టర్ క్లారిటీ ఇదే!
టాలీవుడ్ లో ఎంత పెద్ద సినిమాకైనా ఒక మ్యూజిక్ డైరెక్టరే పని చేస్తారనే విషయం తెలిసిందే. కానీ బాలీవుడ్ లో మాత్రం ఒకే సినిమాకు వేర్వేరు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయడం చూస్తుంటాం.;
టాలీవుడ్ లో ఎంత పెద్ద సినిమాకైనా ఒక మ్యూజిక్ డైరెక్టరే పని చేస్తారనే విషయం తెలిసిందే. కానీ బాలీవుడ్ లో మాత్రం ఒకే సినిమాకు వేర్వేరు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయడం చూస్తుంటాం. బాలీవుడ్ లో ఎప్పట్నుంచో ఇది కొనసాగుతూనే ఉంది. కానీ సౌత్ కు ఇంకా ఆ ట్రెండ్ రాలేదు. మొన్నామధ్య పుష్ప2 సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతల్ని మేకర్స్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ కు అప్పగిస్తే దేవీ శ్రీ ప్రసాద్ ఎంత ఫీలయ్యారనేది అందరూ చూశాం.
చిరూ కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు
అయితే ఇప్పుడు టాలీవుడ్ లోని ఓ పెద్ద సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు, మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇందులోని స్పెషల్ సాంగ్ కు మాత్రం భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.
కీరవాణిని అవమానించారంటూ కామెంట్స్
ఈ విషయమై రీసెంట్ గా సోషల్ మీడియాలో పెద్ద డిస్కషనే జరిగింది. యూట్యూబ్ ఛానెల్స్ కొన్ని ఆస్కార్ వచ్చిన కీరవాణిని విశ్వంభర మేకర్స్ అవమానించారని థంబ్‌నైల్స్ పెట్టి తమకు తోచింది రాసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో బింబిసార డైరెక్టర్ వశిష్ట స్పందించి క్లారిటీ ఇచ్చారు. కీరవాణి ఇచ్చిన ట్యూన్ నచ్చకపోవడం వల్లే భీమ్స్ ను తీసుకున్నామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వశిష్ట స్పష్టం చేశారు.
కీరవాణి సలహాతోనే..
విశ్వంభర లోని స్పెషల్ సాంగ్ చేయాల్సిన టైమ్ కు కీరవాణి, హరి హర వీరమల్లు బీజీఎంతో బిజీగా ఉన్నారని, అందుకే ఈ స్పెషల్ సాంగ్ ను మరో మ్యూజిక్ డైరెక్టర్ తో చేయిద్దామని సలహా ఇచ్చారని, అదేంటని అడిగితే అందులో తప్పేముందన్నారని, పాటలు వేర్వేరు వాళ్లు రాసినప్పుడు మ్యూజిక్ ఇద్దరు చేయడానికేమైందని అన్నారని, తన మొదటి సినిమా బింబిసారకు కూడా కీరవాణి, చిరంతన్ భట్ తో కలిసి వర్క్ చేసిన విషయాన్ని గుర్తు చేశారని, విశ్వంభర లేటవకూడదనే ఉద్దేశంతోనే భీమ్స్ ను తీసుకున్నామని, ఆ విషయాన్ని మెగాస్టార్ కు చెప్పి ఒప్పించింది కూడా కీరవాణినే అని వశిష్ట చెప్పారు.
స్పెషల్ సాంగ్ రీమిక్స్ కాదు..
అయితే విశ్వంభరలోని స్పెషల్ సాంగ్ చిరంజీవి గత చిత్రాల్లోని ఆట కావాలా పాట కావాలా, రగులుతుంది మొగలిపొద లలో ఏదొక సాంగ్ కు రీమిక్స్ గా రానుందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తుండగా ఆ వార్తలపై కూడా వశిష్ట క్లారిటీ ఇచ్చారు. విశ్వంభరలోని స్పెషల్ సాంగ్ ఏ సాంగ్‌కూ రీమిక్స్ కాదని, అది ఫ్రెష్ సాంగ్ అని చెప్పారు. కాగా ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్, చిరూతో కలిసి కాలు కదిపారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వశిష్ట మరో విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. విశ్వంభర కోసం ముందు అనుష్క, బాలీవుడ్ హీరోయిన్లను అనుకుని ఆ తర్వాత త్రిష ను ఫైనల్ చేసినట్టు తెలిపారు. అందరూ చిరంజీవి సినిమా పండగకు రావాలనుకుంటారని కానీ తాను మాత్రం అలా అనుకోనని, ఆయన సినిమా ఎప్పుడొస్తే అప్పుడే తనకు పండగనుకుంటానని వశిష్ట తెలిపారు. వీఎఫ్ఎక్స్ వర్క్స్ మొత్తం పూర్తయ్యాక ఆ వర్క్ తనకు నచ్చితే అప్పుడు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని కూడా వశిష్ట చెప్పారు.