విశ్వంభరకు దారి దొరికినట్లేనా?

ఇప్పుడిక ‘విశ్వంభర’ను అనుకున్న డేటుకే రిలీజ్ చేయడానికి అవకాశం దక్కింది. జులై 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏ అడ్డంకులూ లేనట్లే.;

Update: 2026-05-02 14:30 GMT

ఎప్పుడో మూడేళ్ల ముందు మొదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేకపోయింది. ఇదిగో అదిగో అంటూనే ఏళ్లు గడిచిపోయాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ కంటే ముందు రిలీజ్ కావాల్సిన సినిమాను.. ఆ సినిమా వచ్చిన ఆరు నెలల తర్వాత కూడా రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. చివరగా ప్రకటించినట్లు వేసవి రిలీజ్ సాధ్య పడలేదు. తర్వాత అనుకున్న కొత్త డేట్ జులై 10. ఈ మేరకు అనౌన్స్‌మెంట్ ఇద్దామనుకునేలోపే ‘పెద్ది’ అడ్డం పడింది.

ఆ సినిమాను ఏప్రిల్ 30 నుంచి వాయిదా వేసిన చిత్ర బృందం.. ఒక దశలో జూన్ 25ను కొత్త డేట్‌గా ఎంచుకుంది. ఐతే రామ్ చరణ్ సినిమా రిలీజైన రెండు వారాల్లో చిరు చిత్రాన్ని విడుదల చేయడం కష్టం కాబట్టి.. విశ్వంభరను ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు తీసుకెళ్దామనే ఆలోచన చేశారు మేకర్స్. ఆ దిశగా చర్చలు జరుగుతుండగానే అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. జూన్ 4 నుంచి ‘టాక్సిక్’ వాయిదా పడడం.. ఆ డేట్‌నే ‘పెద్ది’ తీసుకోవడంతో కథ సుఖాంతం అయినట్లయింది.

ఇప్పుడిక ‘విశ్వంభర’ను అనుకున్న డేటుకే రిలీజ్ చేయడానికి అవకాశం దక్కింది. జులై 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏ అడ్డంకులూ లేనట్లే. కానీ సినిమా అప్పటికి రెడీ అవుతుందా అన్నదే చూడాలి. ఏడాది కిందటే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కానీ విజువల్ ఎఫెక్ట్స్ మీద మళ్లీ పని చేయడం, పూర్తి సంతృప్తి వచ్చే వరకు రాజీ పడకూడదని నిర్ణయించుకోవడంతోనే సినిమా ఇంత ఆలస్యం అవుతోంది.

మరి ఆ పని పూర్తయిందా, టీం శాటిస్ఫై అయిందా అన్నదే తెలియాల్సి ఉంది. కంటెంట్ రెడీ అయితే మాత్రం జులై 10కి మించిన మంచి డేట్ ఇంకొకటి ఉండదు. ప్రస్తుతానికి జులైలో ఇంకే పెద్ద సినిమాలు విడుదలయ్యే అవకాశం లేదు. ఇండిపెండెన్స్ డే వీకెండ్ అంటే పోటీ తప్పదు. కాబట్టి ఇంద్ర, మగధీర లాంటి మెగా బ్లాక్ బస్టర్లు వచ్చిన జులై నెలలోనే ‘విశ్వంభర’ను కూడా రిలీజ్ చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ దిశగా నిర్ణయం తీసుకుని ప్రకటన చేసే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News