యాక్షన్ కింగ్‌తో విశ్వక్ లొల్లి క్లియరైనట్టేనా?
సౌత్ లో అర్జున్ యాక్షన్ కింగ్ గా గుర్తింపు పొందారు. ఆయన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.;
సౌత్ లో అర్జున్ యాక్షన్ కింగ్ గా గుర్తింపు పొందారు. ఆయన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కన్నడంలో కెరీర్ ప్రారంభించి, తమిళంలో స్థిరపడి, తెలుగులోను అతడు అనువాద చిత్రాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇటీవల అర్జున్ కుటుంబం నుంచి కొందరు స్టార్లు పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఓ వైపు కథానాయికగా ప్రయత్నిస్తుండగా, మరోవైపు అతడి కజిన్ ధ్రువ సర్జా ఇప్పటికే భారీ యక్షన్ చిత్రాల కథానాయకుడిగా మెప్పిస్తున్నాడు. అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించిన విషాద వార్త ఇంతకుముందు కలచి వేసింది.
ఇదిలా ఉంటే అర్జున్ ప్రస్తుతం దర్శకుడిగా తన కుమార్తె, కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు చేస్తున్నారు. సొంత నిర్మాణ సంస్థను ఎస్టాబ్లిష్ చేసేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. కానీ అతడికి ఇటీవల ఆశించిన బ్లాక్ బస్టర్లు రావడం లేదు. ఇప్పుడు తన కుమార్తె ఐశ్వర్య ప్రధాన పాత్రలో సీతా పనయం అనే సినిమాని తెరకెక్కించారు అర్జున్. ఇందులో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సోదరుని కుమారుడు నిరంజన్ కథానాయకుడిగా నటించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో పలు భాషల్లో విడుదలకు సిద్ధం చేసారు అర్జున్.
ఆసక్తికరంగా ఈ చిత్రంలో కథానాయకుడిగా విశ్వక్ సేన్ నటించాల్సింది. కానీ అతడు అర్జున్ సర్జాతో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అర్థాంతరంగా వైదొలిగాడు. విభేధాలు వచ్చిన తర్వాత విశ్వక్- అర్జున్ ఒకరిపై ఒకరు నెపం మోపుతూ అప్పట్లో మీడియాలో హైలైట్ అయింది. ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. అదంతా గతం అనుకుంటే, ఇప్పుడు విడుదలకు వస్తున్న సీతా పయనం ఆఫర్ ని విశ్వక్ వదులుకుని తప్పు చేసాడా? అతడు పాన్ ఇండియా ఆఫర్ నే వదులుకున్నాడు! అంటూ సోషల్ మీడియాల్లో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది విశ్వక్ వదిలేసుకున్న ప్రాజెక్టు అనుకోవాలా? లేక అర్జున్ మరో కొత్త స్క్రిప్టుతో చిత్రీకరణకు వెళ్లారా? అన్నది తెలియాల్సి ఉంది. లైలా లాంటి ఫ్లాప్ చిత్రంలో నటించిన విశ్వక్ ప్రస్తుతం కల్ట్ అనే మూవీలో నటిస్తున్నాడు. నిజ జీవిత ఘటనలతో రూపొందుతున్న ఈ మూవీతో అతడు సత్తా చాటాల్సి ఉంది. ఒక పాన్ ఇండియా ఆఫర్ వదులుకున్న తర్వాత అతడు కచ్ఛితంగా తానేంటో నిరూపించాల్సి ఉంటుంది.