దళపతి విజయ్‌పై హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు
అందుకే ఇప్పుడు విశాల్ తన సహ నటుడు- స్నేహితుడు దళపతి విజయ్ రాజకీయ ఆరంగేట్రంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.;
దళపతి విజయ్ తో సమాంతరంగా కెరీర్ సాగిస్తున్నాడు స్టార్ హీరో విశాల్. కోలీవుడ్ లో అత్యంత కీలకమైన ఫిలింఛాంబర్, నడిగర సంఘం రాజకీయాల్లో అతడు తలమునకలుగా ఉన్నాడు. అలాగే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడంలోను సిద్ధహస్తుడు. రాజకీయాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అతడు ఎంతో కొంత ప్రభావం చూపుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
అందుకే ఇప్పుడు విశాల్ తన సహ నటుడు- స్నేహితుడు దళపతి విజయ్ రాజకీయ ఆరంగేట్రంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ స్థాపించిన `తమిళగ వెట్రి కళగం` (టీవీకే) పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో విశాల్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తాజా ఇంటర్వ్యూలో అతడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. ``సినిమా రంగం వేరు, రాజకీయం వేరు. సినిమాల్లో మనం ఒక స్క్రిప్ట్ ప్రకారం నటిస్తాం. కానీ రాజకీయాల్లో ప్రజల జీవితాలతో నేరుగా సంబంధం ఉంటుంది. ఇది చాలా బాధ్యతతో, సవాల్‌తో కూడున పని. విజయ్ ఈ నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమైనది!`` అని విశాల్ వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో ఎవరైనా సవాళ్లు ఎదుర్కోవాలని విశాల్ అన్నారు. ఇప్పటికే పాతుకుపోయిన డీఎంకే, ఏఐఏడీఎంకే (ఏఐఏడిఎంకే) వంటి పార్టీలతో తలపడటం అంత సులభం కాదని విశాల్ అభిప్రాయపడ్డారు. అయితే కష్టే ఫలి! అన్న తీరుగా చాలా కష్టపడాలని కూడా విశాల్ సూచించారు. విజయ్‌కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.. కానీ ఆ అభిమానం ఓట్లుగా మారాలంటే క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడాలని పేర్కొన్నారు.
తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని గతంలోనే ప్రకటించిన విశాల్, సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. నేను ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. విజయ్ మార్గాన్ని గమనిస్తున్నానని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా సంకేతాలిచ్చారు.
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. అందుకే దళపతి పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి తన రాజకీయ పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. విజయ్ ఇప్పటికే తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించేందుకు కసరత్తులు మొదలుపెట్టారని కథనాలొచ్చాయి.
ప్రస్తుతం విజయ్ తన చివరి చిత్రం దళపతి 69 షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అలాగే విశాల్ తన స్వీయ దర్శకత్వంలో వస్తున్న `తుప్పరివాలన్ 2` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలోనే విజయ్ రాజకీయాల గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ విశాల్ రాజకీయాల్లోకి వస్తే, విజయ్ పార్టీలో చేరే అవకాశం లేకపోలేదు. అతడు గెలిచే పార్టీ ఏదో సర్వే చేసి అటు వైపు మొగ్గు చూపవచ్చని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి.