పెళ్లి, విడాకులు.. త్రిష ఏం చెప్పిందంటే?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో 2016లో త్రిష ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనిదిగా తెలుస్తోంది.;

Update: 2026-03-11 09:43 GMT

కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ తో సీనియర్ హీరోయిన్ త్రిష రిలేషన్‌ షిప్‌ లో ఉన్నారనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. త్రిషకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో త్రిష పెళ్లి, విడాకులు వంటి విషయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన తీరు ప్రస్తుతం నెటిజన్ల మధ్య చర్చకు దారితీస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో 2016లో త్రిష ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనిదిగా తెలుస్తోంది. అందులో ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నాకు డివోర్స్‌ పై నమ్మకం లేదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే, ఆ బంధం డివోర్స్ వరకు వెళ్లకూడదని భావిస్తాను. ఎందుకంటే నా చుట్టూ ఉన్న చాలా మంది పెళ్లైన వారు సంతోషంగా లేరు" అని తెలిపారు.

"చాలా మంది తమ పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం ఇష్టం లేని సంబంధాల్లోనే కలిసి జీవిస్తున్నారు" అని త్రిష చెప్పినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆమె ఇంకా మాట్లాడుతూ, “నాకు అలాంటి పెళ్లి అవసరం లేదు. జీవితాంతం సంతోషంగా ఉండే సరైన భాగస్వామి దొరికితే నేను పెళ్లి చేసుకుంటా. అలాంటి వ్యక్తి దొరకకపోయినా నాకు బాధ ఉండదు. సరైన వ్యక్తి కోసం ఎంతకాలమైనా ఎదురుచూడగలను" అని తెలిపారు.

ఆ వ్యాఖ్యలు అప్పట్లో పెద్దగా చర్చకు రాకపోయినా, ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం విజయ్ వ్యక్తిగత జీవితం, ఆయనకు సంబంధించిన విడాకుల వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో త్రిష పాత వీడియోలను మళ్లీ బయటకు తీస్తున్నారు నెటిజన్లు. ఇష్టం లేని వ్యక్తితో కలిసి జీవించడం కంటే సరైన వ్యక్తి కోసం ఎదురుచూడడం మంచిదనే ఆలోచన కరెక్ట్ అంటూ కొందరు నెటిజన్లు త్రిష వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

మరోవైపు మరికొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. ఇక త్రిష వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే.. 2015లో చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో త్రిష పెళ్లి వార్తలు అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలల్లోనే ఆ పెళ్లి రద్దయింది. అప్పుడు ఆ నిశ్చితార్థం ఎందుకు రద్దయిందనే విషయంపై అనేక ఊహాగానాలు వినిపించాయి.

ముఖ్యంగా త్రిష సినిమాల్లో కొనసాగాలనే నిర్ణయంపై ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే దీనిపై త్రిష లేదా వరుణ్ మణియన్ అధికారికంగా పెద్దగా స్పందించలేదు. ప్రస్తుతం విజయ్‌ తో త్రిష రిలేషన్ షిప్ రూమర్ల నేపథ్యంలో ఆ పాత నిశ్చితార్థం విషయాన్ని కూడా నెటిజన్లు మళ్లీ ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా.. కొందరు త్రిష వ్యక్తిగత నిర్ణయాలు గౌరవించాలని అంటుండగా, మరికొందరు మాత్రం చర్చలు కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News