ఆర్సీ 17 అక్టోబర్ టూ-2028!
అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.
`రంగస్థలం` హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో 'ఆర్సీ 17' లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాజెక్ట్ పై అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఇంకా ప్రాజెక్ట్ పట్టాలెక్కుండానే ఈ రేంజ్లో హైప్ వస్తుందంటే? సెట్స్ కెళ్లిన తర్వాత ఇంకే రేంజ్ లో హైలైట్ అవుతుందో చెప్పా ల్సిన పనిలేదు. దీంతో ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా? అని ప్రేక్షకాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది.
అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే 2028 నాటికి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సుకుమార్ పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సుకుమార్ ప్రతీ చిత్రం విజన్, మేకింగ్ పరంగా సరికొత్త ప్రమాణాలను నెల కొల్పుతుంది. `పుష్ప` ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మాష్టారు రామ్ చరణ్‌తో చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమా విషయంలో ఏమాత్రం తొందర పడకుండా అడుగేస్తున్నారు. కథాంశం, గ్రాఫిక్స్, ప్రీ-ప్రొడక్షన్ వర్క్ , నటీనటుల గెటప్‌లకు సంబంధించి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందించడానికి కసరత్తు చేస్తున్నారు.
సాధారణంగా సుకుమార్ సినిమాల షూటింగ్- పోస్ట్-ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుందనే పేరుంది. ఈ క్రమంలో అక్టోబర్‌లో లాంచ్ చేసి 2028లో విడుదల చేసేలా కేటాయించడం పక్కా వ్యూహానికి నిదర్శనం. దాదాపు రెండేళ్ల పాటు సాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియ ద్వారా అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకుండా అత్యుత్తమ విజువల్ వండర్‌ను అందించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన `రంగస్థలం` టాలీవుడ్ రికార్డులను తిరగరాసి చరణ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది.
అందులో చిట్టిబాబు పాత్రలో చరణ్ విశ్వరూపం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మళ్లీ ఇప్పుడు మ్యాజికల్ కాంబో రిపీట్ అవ్వడంతో భిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రస్టిక్ ఎమోషనల్ కథలను తెరకెక్కిం చడంలో దిట్ట అయిన సుకుమార్ ఈసారి చరణ్‌ను ఎలాంటి విభిన్నమైన పాత్రలో ఆవిష్కరిస్తారని ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తుంది.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ కాంబినేషన్ లో వచ్చే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీత ప్రియులను ఊపేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.