జూ.ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి బాలకృష్ణ చప్పట్లు.. వీడియో చూశారా?

నందమూరి కుటుంబం అనగానే తెలుగు ప్రేక్షకుల మనసులో ముందుగా గుర్తొచ్చే పేరు సీనియర్ ఎన్టీఆర్.;

Update: 2026-01-12 04:30 GMT

నందమూరి కుటుంబం అనగానే తెలుగు ప్రేక్షకుల మనసులో ముందుగా గుర్తొచ్చే పేరు సీనియర్ ఎన్టీఆర్. ఆయన తర్వాత ఆ కుటుంబానికి అసలైన వారసుడిగా నిలిచిన నటుడు నందమూరి బాలకృష్ణ. అదే కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా వచ్చినా, బాలయ్య తర్వాత అంతటి స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని అభిమానులు భావిస్తారు.

అందుకే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి కనిపిస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎప్పుడూ ఆశగా ఎదురు చూస్తుంటారు. అయితే బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ నందమూరి అభిమానులకు రెండు కళ్లలాంటివాళ్లు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అనుబంధం సరిగ్గా లేదన్న వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. దానికి తగ్గట్టుగానే చాలా రోజుల పాటు ఇద్దరూ ఒకే వేదికపై కలిసి కనిపించలేదు. దీంతో అభిమానుల్లో అనేక అనుమానాలు మొదలయ్యాయి.

అయితే అవన్నీ కేవలం ప్రచారమేనని కొందరు చెబుతుండగా.. మరికొందరు నిజమేనని అంటుంటారు. ఏదేమైనా గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ఈవెంట్‌ తో పాటు మరికొన్ని కార్యక్రమాలకు బాలకృష్ణ హాజరై వేదికపై మాట్లాడారు. అలాగే బాలకృష్ణ సినిమాల కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి సందడి చేశారు. ఈ సందర్భాల్లో ఇద్దరి మధ్య ఆత్మీయత స్పష్టంగా కనిపించింది.

ఇప్పుడు వారిద్దరి మధ్య అనుబంధాన్ని చూపించే ఓ త్రో బ్యాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. కొన్నేళ్ల క్రితం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఆ కార్యక్రమానికి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తన బ్లాక్‌ బస్టర్ సినిమా యమదొంగలోని యముడి గెటప్‌ తో స్టేజ్‌ పైకి వచ్చారు.

స్టేజ్‌ పైకి రాగానే తారక్ తన ట్రేడ్‌ మార్క్ “ఏమంటివి ఏమంటివి…” డైలాగ్ చెప్పడంతో హాల్ మొత్తం చప్పట్లు, ఈలలతో మార్మోగిపోయింది. ఒక్కసారి కాదు, మరోసారి కూడా అదే డైలాగ్‌ చెబుతూ ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ఆ సమయంలో అక్కడ ఉన్న సెలబ్రిటీలంతా తారక్ డైలాగ్ డెలివరీ ఆస్వాదించారు. ముఖ్యంగా బాలకృష్ణ, ఎన్టీఆర్ ప్రదర్శనను ఎంతో ఎంజాయ్ చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

తారక్ డైలాగ్ చెబుతున్నంతసేపు బాలయ్య చిరునవ్వుతో చూస్తూ, చివర్లో చప్పట్లు కొడుతూ ఆయనను ప్రోత్సహించారు. బాలకృష్ణ ఆనందంగా నవ్వుతూ చప్పట్లు కొట్టిన దృశ్యాలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది. నందమూరి అభిమానుల్లో మళ్లీ జోష్ నింపుతోంది. దీంతో వారంతా సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రెండ్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆ వీడియో చూసేయండి..




Tags:    

Similar News