30 కోట్ల మోసం కేసు.. సెంట్ర‌ల్ జైలుకు ద‌ర్శ‌కుడి భార్య‌?

బాలీవుడ్ ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ భ‌ట్ క‌ష్ట‌కాలాన్ని ఎదుర్కొంటున్నారు.;

Update: 2025-12-17 04:34 GMT

బాలీవుడ్ ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ భ‌ట్ క‌ష్ట‌కాలాన్ని ఎదుర్కొంటున్నారు. లాభ‌దాయ‌క‌మైన సినిమా తీస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి విక్ర‌మ్ అత‌డి భార్య‌ త‌న‌ను 30 కోట్ల మేర మోసం చేసార‌ని ఆరోపిస్తూ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త పోలీసుల‌ను ఆశ్ర‌యించగా ఈ క‌సు ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితులు విక్ర‌మ్ భ‌ట్, అత‌డి భార్య శ్వేతాంబ‌రిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతుండ‌గా ఉదయపూర్‌ కోర్టు శ్వేతాంబరిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. వారి న్యాయవాది వైద్య కారణాలపై మధ్యంతర బెయిల్ కోరిన తర్వాత మంగళవారం కోర్టు ఈ ఉత్తర్వు జారీ చేసిందని హిందూస్తాన్ టైమ్స్ త‌న క‌థ‌నంలో పేర్కొంది.

విక్ర‌మ్ భార్య తాత్కాలిక ఉప‌శ‌మ‌నం కోరుతూ ద‌ర‌ఖాస్తు చేసుకోగా, దీనిని కోర్టు తిర‌స్క‌రించింది. కోర్టు సెషన్ ముగిసేలోపు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆ ఇద్దరూ వైద్య చికిత్స పొందడానికి స్వల్ప కాలానికి విడుదలవుతారు.. కానీ కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించి జ్యుడీషియల్ కస్టడీని ఆదేశించింది. ఈ ప‌రిణామంతో వారిని ఉదయపూర్‌లోని సెంట్రల్ జైలుకు పంపుతున్నామ‌ని పోలీసులు తెలిపారు.

విక్రమ్ భట్, అతడి భార్యను డిసెంబర్ 7న ముంబైలో అరెస్టు చేసి ఉదయపూర్‌కు తీసుకువచ్చారు. డిసెంబర్ 8న వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత డిసెంబర్ 9న వారిని ఏడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.

వారిపై ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త, ఇందిరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, ఉదయపూర్‌కు చెందిన వ్యాపారవేత్త డాక్టర్ అజయ్ ముర్దియాను రూ. 30 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో విక్రమ్ భ‌ట్‌, అత‌డి భార్య స‌హా మరో ఆరుగురు నిందితులపై అభియోగాలు మోపారు.

నిలిచిపోయిన బయోపిక్

పోలీసుల వివ‌రాల‌ ప్రకారం.. ఈ కేసు ఒక బ‌యోపిక్ సినిమాతో ముడి ప‌డిన‌ది. ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్ యజమాని ముర్దియా తన దివంగత భార్యపై బయోపిక్ తీయాలనుకున్నాడు. ఆ త‌ర్వాత విక్ర‌మ్ భ‌ట్, అత‌డి భార్య‌ను సంప్ర‌దించాడు. తనకు రూ. 200 కోట్ల సంపాదన హామీ ఇస్తూ, భ‌ట్ బ‌యోపిక్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించారు. కానీ ఆశించిన‌ది ఏదీ జరగలేదు. ఆ తర్వాత ముర్దియా ఉదయపూర్‌లోని భోపాల్‌పురా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా పోలీసులు ఆర్థిక నేరాల‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. నవంబర్ 17న ఎఫ్‌ఐఆర్ దాఖ‌లైంది. సినిమా వ్యాపారంలో లాభాల పేరుతో తప్పుడు హామీలు ఇచ్చి రూ. 30 కోట్లకు పైగా నిధులను కాజేశారని బాధితుడు ఆరోపించాడు. నిందితులు నకిలీ బిల్లుల సృష్టించి త‌న‌ను మోసం చేసార‌ని పోలీసుల‌కు వివ‌రించాడు. ప్ర‌స్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

Tags:    

Similar News