స్టార్ హీరో సినిమాకు సెన్సార్ కష్టాలు!
అయితే ఊహించని విధంగా ఈ చిత్రం సెన్సార్ బోర్డు అడ్డంకులను ఎదుర్కొంటూ విడుదల ఆలస్యమయ్యే పరిస్థితులు అంతకంతకు కనిపిస్తున్నాయి.
దళపతి విజయ్ చివరి చిత్రం `జననాయగన్` చుట్టూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో దీనిపై అటు అభిమానుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి. అయితే ఊహించని విధంగా ఈ చిత్రం సెన్సార్ బోర్డు అడ్డంకులను ఎదుర్కొంటూ విడుదల ఆలస్యమయ్యే పరిస్థితులు అంతకంతకు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో కొన్ని సున్నితమైన సన్నివేశాలే ఈ వివాదానికి ప్రధాన కారణమైనట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా దేశ రక్షణకు సంబంధించిన ఆర్మీ సీన్లు - సమాజంలో మతపరమైన అంశాలకు సంబంధించిన దృశ్యాలపై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఒక స్టార్ హీరో- అందునా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నటిస్తున్న చిత్రం కావడం వల్ల ఈ సన్నివేశాలు ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు తీసుకెళ్తాయనే కోణంలో అధికారులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రాథమిక పరిశీలనలో తలెత్తిన విభేదాల కారణంగా సినిమాను తుది నిర్ణయం కోసం రివైజింగ్ కమిటీకి బదిలీ చేశారు. అక్కడ సుదీర్ఘ చర్చలు, అవసరమైన మార్పుల అనంతరం కమిటీ సభ్యుల నుంచి చిత్రానికి క్లియరెన్స్ లభించింది.
దీనితో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుందని భావించే లోపే వ్యవహారం మరో మలుపు తిరిగి కొత్త చిక్కుల్లో పడింది. రివైజింగ్ కమిటీ ఆమోదం తెలిపినప్పటికీ `జననాయగన్` ఫైల్ ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర సెన్సార్ బోర్డు వద్ద పెండింగ్‌లో ఉండటం సినీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. జాతీయ స్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక .. విధానపరమైన అడ్డంకుల వల్ల సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. ఢిల్లీ బోర్డు తుది నిర్ణయంపైనే సినిమా భవితవ్యం ఆధారపడి ఉండటంతో సస్పెన్స్ మరింత ముదిరింది.
సెన్సార్ వివాదం ఇలాగే కొనసాగితే నిర్మాతలపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఢిల్లీ సెన్సార్ బోర్డు నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోతే బిజినెస్ పరంగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని నిర్మాత యోచిస్తున్నారు. సినిమా విడుదల మరింత ఆలస్యమైతే లేదా నిలిచిపోతే డిస్ట్రిబ్యూటర్లకు వారు పెట్టిన పెట్టుబడులను పూర్తిగా వెనక్కి ఇచ్చేయాలనే కీలక నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్లు సమాచారం. సినిమాలు- రాజకీయాలు ముడిపడి ఉన్న తమిళనాడులో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యతను సంతరిం చుకుంది.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ చివరి చిత్రం కావడం వల్ల దీనిపై వ్యాపారపరంగా వందల కోట్ల రూపాయల మార్కెట్ ఆధారపడి ఉంది. సెన్సార్ అడ్డంకులు త్వరలోనే తొలగిపోయి `జననాయగన్` థియేటర్లలోకి వస్తుందా? లేక రాజకీయ సమీకరణాల మధ్య సస్పెన్స్ ఇలాగే కొనసాగుతుందా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.