ఏం కావాలన్నా ఇస్తా.. చైల్డ్ ఆర్టిస్ట్‌కు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్
'మసూద' ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన కొత్త సినిమా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా నేడు (నవంబర్ 7) థియేటర్లలోకి వస్తోంది.;
'మసూద' ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన కొత్త సినిమా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా నేడు (నవంబర్ 7) థియేటర్లలోకి వస్తోంది. అయితే, రిలీజ్‌కు ముందే మేకర్స్ వేసిన స్పెషల్ ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా అంతా నవ్వులే నవ్వులని చూసిన వారు చెబుతున్నారు. కానీ, ఈ ప్రీమియర్ షోలో సినిమా కంటే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన సందడే ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.
ఈ సినిమాలో '90s' వెబ్ సిరీస్‌తో సంచలనం సృష్టించిన చైల్డ్ యాక్టర్ రోహన్ కీలకపాత్ర పోషించాడు. ప్రీమియర్ షో తర్వాత మైక్ అందుకున్న రోహన్, తన ఎనర్జీతో స్టేజ్‌ను ఊపేశాడు. సినిమా చూసిన ప్రేక్షకులను "ఎలా ఉంది సినిమా?" అని అడుగుతూ, టీమ్‌లోని హీరో తిరువీర్, హీరోయిన్ టీనా అక్కకు, తన తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పాడు. కానీ అసలు మ్యాటర్ ఆ తర్వాతే మొదలైంది.
రోహన్ నేరుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. "విజయ్ దేవరకొండ అన్న.. నువ్వు ఇది చూస్తున్నావని నాకు తెలుసు. నేను టీజర్ రిలీజ్‌లోనే చెప్పా. మళ్లీ చెబుతున్నా. మా మొత్తం టీమ్‌కి 'రౌడీ' షర్టులు రెడీగా పెట్టుకో. టీమ్ పీడబ్ల్యూఎస్ (ప్రీ వెడ్డింగ్ షో) ఈజ్ కమింగ్ టు యు" అంటూ హంగామా చేశాడు.
ఈ బుడ్డోడి ఛాలెంజ్‌కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిదా అయిపోయాడు. వెంటనే ట్విట్టర్ (X) వేదికగా స్పందించాడు. రోహన్ వీడియోను షేర్ చేస్తూ, "ఒరేయ్..." అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చాడు. "రోహన్.. నీకు ఏం కావాలన్నా ఇస్తాను. '90s' (సిరీస్) చూసినప్పటి నుంచి నేను నీకు ఫ్యాన్‌ని అయిపోయాను. నిన్ను త్వరలోనే కలుస్తాను మై బాయ్" అని ట్వీట్ చేశాడు.
విజయ్ దేవరకొండ ఇచ్చిన ఈ రిప్లై ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతేకాదు, 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' టీమ్ మొత్తానికి కూడా విజయ్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఒక చిన్న సినిమా టీమ్‌కు, ముఖ్యంగా ఆ టీమ్‌లోని చైల్డ్ ఆర్టిస్ట్‌కు విజయ్ లాంటి స్టార్ హీరో సపోర్ట్ ఇవ్వడం, పైగా "నేను నీకు ఫ్యాన్" అని చెప్పడం చాలా పెద్ద విషయం. ప్రీమియర్ షోలో రోహన్ చేసిన ఈ సందడి, దానికి విజయ్ ఇచ్చిన రిప్లై.. ఈ రెండు ఇప్పుడు సినిమాకు పాజిటివ్ బజ్‌ను తెచ్చిపెట్టాయి.