నాగీ-విజయ్.. లక్కీ ఛార్మ్‌ తో సోలో మూవీ పడితే..

కాగా, విజయ్ దేవరకొండ బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా చిన్న పాత్రలకు ఓకే చెప్పడం వెనుక వైజయంతి మూవీస్‌ పై ఉన్న రిస్పెక్ట్, నాగ్ అశ్విన్‌ తో ఉన్న స్నేహమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Update: 2026-06-14 06:06 GMT

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు నాగ్ అశ్విన్ మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎప్పటినుంచో చర్చ జరుగుతూనే ఉంది. ఒకరు పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగితే, మరొకరు తనదైన ఇమేజ్‌ తో యూత్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆ ఇద్దరి కాంబోలో కనిపిస్తున్న ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే విజయ్ ను నాగ్ అశ్విన్ తన ప్రతి ప్రాజెక్ట్‌ లోకి తీసుకోవడం.

ఇటీవల రిలీజైన సింగ్ గీతం మూవీ ఆ చర్చను మరింత పెంచింది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇందులో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి లీడ్ రోల్స్ లో నటించారు. అయితే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన అంశం విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ క్యామియో.

సినిమాలో ఆయన కనిపించేది కేవలం రెండు మూడు నిమిషాలే అయినప్పటికీ, థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ మాత్రం కంప్లీట్ రేంజ్ హీరో ఎంట్రీకి ఏమాత్రం తగ్గలేదు. విజయ్ స్క్రీన్ పై కనిపించగానే విజిల్స్, కేకలతో అభిమానులు సందడి చేశారు. దీంతో నాగ్ అశ్విన్‌ కు విజయ్ దేవరకొండ నిజంగానే లక్కీ ఛార్మ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

అయితే ఆ రిలేషన్ ఇప్పుడే మొదలైనది కాదు. నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమైన ఎవడే సుబ్రమణ్యం మూవీలో విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత మహానటిలో చిన్నదైనా గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు. కల్కి 2898 ఏడీలో అర్జునుడిగా ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. నాగ్ అశ్విన్ ప్రొడక్షన్ లో భాగమైన జాతిరత్నాలులోనూ విజయ్ స్పెషల్ రోల్ చేశారు. ఇప్పుడు సింగ్ గీతంతో మరోసారి సెంటిమెంట్ కొనసాగింది.

కాగా, విజయ్ దేవరకొండ బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా చిన్న పాత్రలకు ఓకే చెప్పడం వెనుక వైజయంతి మూవీస్‌ పై ఉన్న రిస్పెక్ట్, నాగ్ అశ్విన్‌ తో ఉన్న స్నేహమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కల్కి 2 షూటింగ్ పనుల్లో నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నారు. ఫస్ట్ పార్ట్ లో అర్జునుడి పాత్రతో మెప్పించిన విజయ్, సీక్వెల్‌ లో మరింత రన్ టమ్ తో కనిపిస్తారనే అంచనాలు ఉన్నాయి. అయితే అందరి దృష్టి ఇప్పుడు మరో అంశంపై పడింది.

ఇప్పటి వరకు క్యామియోలు, స్పెషల్ రోల్స్ లో ఆ కాంబో ప్రేక్షకులను అలరించింది. కానీ విజయ్ ను కంప్లీట్ సోలో హీరోగా పెట్టి నాగ్ అశ్విన్ ఓ సినిమా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందనే చర్చ జోరందుకుంది. కథల సెలక్షన్ లో ఫ్రెష్ నెస్, ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే నాగ్ దర్శకత్వం.. విజయ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే మరో స్పెషల్ మూవీ రావడం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

సెంటిమెంట్‌ గా మొదలైన ఆ జర్నీ ఫ్యూచర్ లో కంప్లీట్ హీరో- దర్శకుడి కాంబోగా మారుతుందా? నాగీ- విజయ్ కలిసి ఓ సోలో సినిమా చేస్తారా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్.. టాలీవుడ్‌ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్రియేటివ్ బాండింగ్స్‌ లో ఒకటిగా మారింది.

Tags:    

Similar News