'దురంధర్-యానిమల్' పై నెగెటివ్ సమీక్షలు చదవలేదా విఘ్నేషా?
తన తాజా చిత్రం `లవ్ ఇన్సూరెన్స్ కొంపనీ` (ఎల్.ఐ.కే) ఎందుకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయిందో దర్శకుడు విఘ్నేష్ శివన్ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.
సోషల్ మీడియా - డిజిటల్ యుగంలో ఈరోజు ఏ సినిమా విడుదలైనా ప్రారంభంలో నెగెటివ్ టాక్ రావడం అనేది చాలా సహజమైన విషయంగా మారిపోయింది. కేవలం మీడియాలో వచ్చే ప్రతికూల సమీక్షల పైనే ఒక సినిమా పూర్తి ఫలితం ఆధారపడి ఉండదని ఇటీవలి కాలంలో చాలా చిత్రాలు నిరూపించాయి. ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచింది `దురంధర్` చిత్రం. ప్రారంభంలో ఈ సినిమాకు ప్రాంతీయ భాషల్లో ఆశించిన సమీక్షలు రాలేదు. పైగా ఇందులో చూపించిన రక్తపాతం, హింసపై సోషల్ మీడియాలో బోలెడంత నెగెటివ్ ప్రచారం సాగింది. అయినా ఆ తర్వాత నెమ్మదిగా నిలకడైన వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద నిలబడింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన తర్వాత.. ఒకప్పుడు నెగెటివ్ కామెంట్లు చేసిన వారే ఈ సినిమాలో కంటెంట్ మ్యాటర్ బలంగా ఉంది గనుకనే ప్రజలు హిట్ చేశారంటూ ప్రశంసించడం మొదలుపెట్టారు.
ఇంతకుముందు బ్లాక్‌బస్టర్ హిట్ `యానిమల్` సినిమా విషయంలోనూ సరిగ్గా ఇదే తరహా వాతావరణం కనిపించింది. ఆ చిత్రం విడుదలైన కొత్తలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను నేరుగా టార్గెట్ చేస్తూ.. సినిమాలో విపరీతమైన హింస, రక్తపాతం - స్త్రీ వివక్ష ఉందంటూ చాలా మంది తీవ్రంగా విమర్శించారు. కానీ ఆ విమర్శలన్నింటికీ `యానిమల్` సాధించిన రికార్డు స్థాయి కలెక్షన్లే సమాధానంగా మారాయి. అయితే దురంధర్, యానిమల్ వంటి సినిమాలు నెగెటివ్ టాక్‌ను తట్టుకుని నిలబడినట్లుగా.. తన తాజా చిత్రం `లవ్ ఇన్సూరెన్స్ కొంపనీ` (ఎల్.ఐ.కే) ఎందుకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయిందో దర్శకుడు విఘ్నేష్ శివన్ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.
తన సినిమాకు వచ్చిన ప్రారంభ నెగెటివ్ సమీక్షలే దెబ్బ కొట్టాయని ఆవేదన చెందుతున్న విఘ్నేష్.. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆ చిత్రానికి గొప్ప ఆదరణ దక్కుతుండటంతో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతున్నారు. కానీ నేటి రోజుల్లో ప్రతి సినిమాకు ప్రారంభంలో నెగెటివ్ సమీక్షలు తప్పడం లేదనే వాస్తవాన్ని ఆయన గ్రహించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కిరికీ మిశ్రమ స్పందనలు సహజంగా మారాయి. తొలి వీకెండ్ తర్వాతా నిలబెట్టేంత కంటెంట్ కేవలం సినిమాలో ఉండాలి.. అప్పుడే జనం థియేటర్లకు వస్తున్నారు.
ఇండస్ట్రీలోని పలు అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే దర్శకుడు విఘ్నేష్ శివన్.. ప్రదీప్ రంగనాథన్, ఎస్‌జే సూర్య, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో తాను తెరకెక్కించిన `లవ్ ఇన్సూరెన్స్ కొంపెనీ` (ఎల్‌ఐకే) బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోవడంపై ఇన్‌స్టా స్టోరీలో ఒక సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేసారు. దాదాపు 190 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం థియేటర్లలో కేవలం రూ.66 కోట్లు మాత్రమే వసూలు చేసి నిరాశపరిచింది. 10 ఏప్రిల్ 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చిన తర్వాత ఊహించని విధంగా వీక్షకుల నుండి అద్భుతమైన సానుకూల స్పందనను సొంతం చేసుకుంటోంది. ఆన్‌లైన్‌లో ఉన్న నెగెటివిటీ కారణంగానే తాము ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయామని ఇప్పుడు ఓటీటీలో చూశాక చాలా బాధపడుతున్నామని చెప్తూ ఎంతో మంది తనకు మెసేజ్‌లు పంపుతున్నారని విఘ్నేష్ తన నోట్‌లో పేర్కొన్నారు.
ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు నెగెటివ్ రివ్యూలను తట్టుకుని నిలబడగలవు... కానీ మరికొన్ని తట్టుకోలేవు. సినిమా రంగానికి చెందిన తోటి సహచరులు, పరిశ్రమలోని ప్రముఖులు - ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ నుండి సరైన మద్దతు లభించకపోవడం కూడా ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చేసి..సినిమా విజయాన్ని దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ మేధస్సును లేదా గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి రాసే కొన్ని సమీక్షలు.. ఒక సినిమాను కేవలం విమర్శించడమే కాకుండా.. ప్రేక్షకులను థియేటర్లకు వెళ్లకుండా అడ్డుకుంటాయని.. తద్వారా ఎంతో మంది దర్శకుల ఆశలను, ఆకాంక్షలను ఇవి దెబ్బతీస్తాయని విఘ్నేష్ తీవ్రంగా విమర్శించారు.
ఈ చిత్ర నిర్మాణంలో - విడుదల సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత బాక్సాఫీస్ వద్ద వచ్చిన ఇలాంటి ఫలితం తనను తీవ్రంగా నిరాశపరిచిందని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు. మంచి ఓపెనింగ్ వీకెండ్ సాధించిన తర్వాత కూడా సినిమాపై నెగెటివ్ సమీక్షల కారణంగా అంతే వేగంగా పడిపోవడం తనను బాధించిందని.. అంతఃకరణ శుద్ధితో తీసే తమిళ సినిమాలపై ప్రేక్షకులు కాస్త కరుణ చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక సినిమా విజయం దాని ఇంటర్నల్ క్వాలిటీ కంటే బయటి కారణాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని ఒక ప్రముఖ దర్శకుడు చెప్పిన మాటలను విఘ్నేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే చాలా నెగెటివిటీ ని ఎదుర్కొన్నా `యానిమల్` లాంటి సినిమా ఎందుకు విజయం సాధించిందో విఘ్నేష్ విశ్లేషించుకోవాల్సి ఉంది. కేవలం నెగెటివ్ సమీక్షలే కారణం కాకపోవచ్చు.. ఇంకా కంటెంట్ మ్యాటర్ లో ఏవైనా లోపాలున్నాయేమో విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఇక ఓటీటీ రిజల్ట్ కి పెద్ద తెర రిజల్ట్ ని ముడి పెట్టడం సరికాదేమో!