బాలీవుడ్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్టేనా?
ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అని భారీగా ప్రాచరం చేశారు. సౌత్ సినిమాలపై చిన్న చూపు చూశారు.;
ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అని భారీగా ప్రాచరం చేశారు. సౌత్ సినిమాలపై చిన్న చూపు చూశారు. కానీ ట్రెండ్ మారింది. ఇప్పుడు మన టైమ్ నడుస్తోంది. ఎక్కడ చూసినా దక్షిణాది సినిమానే హాట్ టాపిక్ అవుతోంది. ఇండియన్ సినిమా అంటే ఇప్పుడు సౌత్ సినిమానే అని ప్రపంచ దేశాల్లో మారుమోగుతోంది. ఇదిలా ఉంటే ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే మేమేనని మీసం మెలేసిన బాలీవుడ్ ఇప్పుడు కోరలు పీకిన పిల్లిలా మారింది. బాక్సాఫీస్‌ని గడగడలాడించిన షాన్‌లు సైతం ఫ్లాపుల కారణంగా సైలెంట్ అయిపోయారు.
కరోనా తరువాత నుంచి బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. ప్రేక్షకులు బాలీవుడ్ స్టార్స్ ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద ఆదరించడం లేదు. దీంతో బాలీవుడ్ సినిమా భారీ నష్టాలని చవిచూడాల్సి వస్తోంది. షారుక్ ఖాన్ `పఠాన్`, `జవాన్` సినిమాలతో బాలీవుడ్ పుంజుకున్నా అది కంటిన్యూ కాలేకపోయింది. దీంతో మళ్లీ బాలీవుడ్ పూర్వకలని సంతరించుకోవాలని అంతా ఆశగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో విక్కీ కౌశల్ `ఛావా`తో అదరగొట్టి బాలీవుడ్ లో కొత్త జోష్‌ని తీసుకొచ్చాడు.
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ వీరోచిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. దీంతో బాలీవుడ్ వర్గాల్లో కొత్త జోష్ మొదలైంది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మంచి జోష్ మీదున్న బాలీవుడ్ స్టార్స్ కొత్త కథలతో ప్రేక్షకుల్ని పలకరించడం మొదలు పెట్టారు. సన్నిడియోల్ `జాట్`తో, అజయ్ దేవగన్ `రైడ్ 2`తో, అక్షయ్ కుమార్ `కేసరి 2`లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూడు సినిమాలు మంచి టాక్‌ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడం విశేషం.
ముగ్గురు సీనియర్ హీరోలు నటించిన ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో నిలకడగా రన్నవుతుండటం బాలీవుడ్‌కు శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. రానున్న కొత్త సినిమాలు కూడా ఇదే పంథాని అనుసరించి సరికొత్త కథలతో ముందుకొస్తే త్వరలోనే బాలీవుడ్ మునుపటి వైభవాన్ని దక్కించుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలో విక్కీ కౌషల్ పీరియాడ్ డ్రామా `మహావతార్`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
నాగ సాధువుగా విక్కీ కౌశల్ నటిస్తున్న ఈ మూవీ బాలీవుడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది. దీన్ని `ఛావా` ప్రొడ్యూసర్ దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది క్రిస్మస్‌కు విడుదల చేయాలని నిర్మాత దినేష్ విజన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాల్ని తారా స్థాయిరి చేర్చింది.