వెంకీని తెలుగు స్టార్స్ గుర్తించ‌డం లేదా?

ఇప్ప‌టికైనా మ‌న తెలుగు డైరెక్ట‌ర్ టాలెంట్‌ని గుర్తించి తెలుగు హీరోలు అవ‌కాశాలు ఇవ్వాల‌ని కోరుతున్నారు.;

Update: 2025-05-18 00:30 GMT

మ‌ధుర శ్రీ‌ధ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ చేసిన మూవీ 'స్నేహ గీతం'. ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు వెంకీ అట్లూరి. ఈ మూవీతో పాటు 'ఇట్స్ మై ల‌వ్‌స్టోరీ'కి డైలాగ్స్ రాసిన వెంకీ ఆ త‌రువాత 'కేరింత‌'కు రైట‌ర్‌గా వ‌ర్క్ చేశాడు. ఆ అనుభ‌వంతో హీరో కావాలానే ఆలోచ‌న‌ని ప‌క్క‌న పెట్టి ద‌ర్శ‌కుడిగా కెరీర్ మొద‌లు పెట్టాడు. తొలిసారి చేసిన 'తొలి ప్రేమ‌' స‌క్సెస్ కావ‌డంతో ఇక డైరెక్ట‌ర్‌గా కొన‌సాగాల‌ని ఫిక్స్ అయ్యాడు. మిస్ట‌ర్ మ‌జ్ను, రంగ్ దే' సినిమాల‌తో ఫ‌ర‌వాలేదు అనిపించాడు.

కానీ ధ‌నుష్‌తో రెండు భాష‌ల్లో చేసిన 'సార్‌' వెంకీకి ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక రీసెంట్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్‌తో చేసిన 'ల‌క్కీ భాస్క‌ర్' ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని అందించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌లు ప్ర‌శంస‌లు అందుకునేలా చేసింది. రూ.50 కోట్ల‌కు మించిన బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో అంద‌రి దృష్టి ఇప్పుడు వెంకీ అట్లూరిపై ప‌డింది. అయితే ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత వెంకీ అట్లూరి తెలుగు స్టార్‌తో సినిమా చేస్తాడ‌ని అంతా భావించారు.

కానీ అంద‌రి అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేస్తూ వెంకీ అట్లూరి త‌మిళ స్టార్ సూర్య‌తో సినిమాకు రెడీ అయి షాక్ ఇచ్చాడు. దీంతో వెంకీ అట్లూరిపై ఇండ‌స్ట్రీలో ఓ చ‌ర్చ మొద‌లైంది. మొన్న ధ‌నుష్‌, నిన్న దుల్క‌ర్‌.. ఇప్పుడు సూర్య‌.. తెలుగు డైరెక్ట‌ర్‌కు తెలుగు స్టార్లు అవ‌కాశం ఇవ్వ‌డం లేదా? లేక వెంకీ అట్లూరినే త‌న కంఫ‌ర్ట్‌ కోసం, త‌ను అనుకున్న క‌థ‌ని అనుకున్న‌ట్టుగా తెర‌పైకి తీసుకురావ‌డం కోసం త‌మిళ, మ‌ల‌యాళ హీరోల‌ని ఎంచుకుంటున్నాడా? అనే సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికైనా మ‌న తెలుగు డైరెక్ట‌ర్ టాలెంట్‌ని గుర్తించి తెలుగు హీరోలు అవ‌కాశాలు ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇదిలా ఉంటే వెంకీ అట్లూరి త్వ‌ర‌లో హీరో సూర్య‌తో ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుడుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించ‌నున్నారు. ఈ నెలలోనే లాంఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. ఇందులోని కీల‌క అతిథి పాత్ర కోసం రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని సంప్ర‌దించార‌ని, సూర్య ప్రాజెక్ట్ కావ‌డంతో న‌టించాడినికి విజ‌య్ కూడా ఓకే చెప్పాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News