అల్లు అర్జున్ ఛాతీ మీద డైలాగులు రాసుకుని చదివిన నటుడు.. ఎవరంటే..!
కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.;
కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ నటించగా..ఆయన తండ్రి పాత్రలో మలయాళ సినీ నటుడు జయరాం కనిపించారు. జయరాం చేసిన పాత్ర ఈ సినిమాలో బాగా హైలైట్ గా నిలిచింది. ఆయన నటనను ప్రేక్షకులు మాత్రమే కాదు.. విమర్శకులు కూడా బాగా ప్రశంసించారు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జయరాం.. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సరదా సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ తనకు తెలుగు భాష పూర్తిగా రాదని చెప్పారు. డైలాగ్‌లను ఎంతగా చదివినా, ఎంత ప్రాక్టీస్ చేసినా షూటింగ్ సమయంలో అవి గుర్తుండేవి కావని.. దీంతో చివరికి ఓ కొత్త మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
జయరాం మాట్లాడుతూ..డైలాగ్‌లను చిన్న కాగితాలపై రాసుకుని, అవి అల్లు అర్జున్ నుదుటి మీద, ఛాతీ మీద అంటించేవాడినని తెలిపారు. ఆ డైలాగ్‌లను చూసుకుంటూ తాను తన సన్నివేశాలను పూర్తి చేసేవాడినని నవ్వుతూ చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియలో అల్లు అర్జున్ పూర్తి సహకారం అందించారని, ఒక్కసారి కూడా ఇబ్బంది పెట్టలేదని జయరాం చెప్పారు. సహనటుడిగా అల్లు అర్జున్ తనను చాలా గౌరవంగా చూసుకున్నారని అన్నారు.
“నాకు తెలుగు రాదు. ఎంత చదివినా డైలాగ్‌లు గుర్తుండేవి కావు. చివరికి అల్లు అర్జున్ నుదుటి మీద, ఛాతీ మీద డైలాగ్‌లు అంటించి వాటిని చూసుకుంటూ చెప్పేవాడిని” అని జయరాం తెలిపారు.
అంతేకాకుండా జయరాం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమాకి ముందు ఈ నటుడు చాలా లావుగా ఉండేవారు. ఈ సినిమా కోసం కేవలం రెండు నెలల్లోనే దాదాపు 12 కిలోల బరువు తగ్గినట్లు ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతకుముందు చేసిన కొన్ని మలయాళ సినిమాల కోసం బరువు పెరగాల్సి వచ్చిందని, అందువల్ల ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టలేకపోయానని..అల్లు అర్జున్ సినిమాలో అవకాశం వచ్చిన తర్వాత మాత్రం క్రమశిక్షణతో ఫిట్‌నెస్‌ను మొదలుపెట్టానని జయరాం చెప్పారు. వెయిట్ ట్రైనింగ్ చేయకుండా కేవలం కార్డియోతోనే రెండు నెలల్లో 12 కిలోలు తగ్గగలిగానని చెప్పారు.
ఈ సినిమాలో జయరాంకి భార్యగా టబు నటించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో.. పాటు వీళ్ళిద్దరి పాత్రలు కూడా ఎంతో ముఖ్యంగా నిలిచాయి. అంతేకాకుండా త్రివిక్రమ్ కి అత్తారింటి దారేది తరువాత అంతటి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఈ సినిమా అందించింది.