ఆగస్టు 22 వస్తే స్కూల్ ఎగ్గొట్టే మెగా హీరో గురించి తెలుసా?
ఆయనకు విషయం అర్థమై వెంటనే నన్ను పెదనాన్న (చిరంజీవి) గారి ఇంటికి పంపించేసేవారు`` అని సరదాగా గుర్తుచేసుకున్నారు.
నేచురల్‌గా ఏ స్కూల్ పిల్లాడు అయినా స్కూల్ ఎగ్గొట్టాడు అంటే కచ్ఛితంగా సినిమాలు చూడటానికి లేదా ఫ్రెండ్స్ తో షికార్లు చేయడానికి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రముఖ హీరో ఆగస్టు 22 వస్తే నేషనల్ హలీడే లా ఫీలై ఆ రోజు స్కూల్ ఎగ్గొట్టేసేవాడు. పైగా తన డాడీకి చెప్పి మరీ ఎగ్గొట్టేవాడిని అని బహిరంగ వేదికపైనే చెప్పాడు. ఇంతకీ ఎవరా హీరో? ఎందుకు ఆ డేట్ వస్తే స్కూల్ ఎగ్గొట్టేవాడు? అంటే.. వివరాల్లోకి వెళ్లాలి.
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కుటుంబంలో నటుడిగా నిరూపించుకుని, సైలెంట్ గా విజయాలు అందుకుంటూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రేసులో ముందు వరుసలోనే ఉన్నాడు. ఇటీవల జరిగిన ఒక వేడుకలో వరుణ్ తేజ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేస్తూ ఒక సీక్రెట్ ని ఓపెనయ్యాడు. వరుణ్ మాట్లాడుతూ..`` చిన్నప్పటి నుంచి నాకు ఆగస్ట్ 22 అంటే ఒక నేషనల్ హాలిడే లాంటిది. అసలు ఆ రోజు స్కూల్‌కి వెళ్లేవాడిని కాదు. ఉదయమే మా నాన్న (నాగబాబు) దగ్గరికి వెళ్లి కాలర్ ఎగరేసి ``నేను ఈరోజు స్కూల్‌కి వెళ్లట్లేదు`` అని చెప్పేవాడిని. ఆయనకు విషయం అర్థమై వెంటనే నన్ను పెదనాన్న (చిరంజీవి) గారి ఇంటికి పంపించేసేవారు`` అని సరదాగా గుర్తుచేసుకున్నారు. చిన్నతనం నుంచే చిరంజీవి అంటే వరుణ్‌కు ఎంతటి అభిమానమో ఈ మాటలతో స్పష్టమైంది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన చిత్రం `కొరియన్ కనకరాజు` బ్లాక్ బస్టర్ వైబ్స్ మెగా కుటుంబంలో జోష్ ని నింపాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మించిన ఈ హారర్ కామిడీ చిత్రం ఇటీవల థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ-``ఈ ఆగస్టు నాకు మరింత స్పెషల్. ఒకవైపు `కొరియన్ కనకరాజు` సినిమా సక్సెస్.. మరోవైపు ఆగస్టు 22న పెదనాన్న పుట్టినరోజు రాబోతుండటం చాలా ఆనందంగా ఉంది. అభిమానులందరి తరఫునా పెదనాన్నకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు`` అని తెలిపారు. అంతేకాకుండా, పెదనాన్న, బాబాయ్, అమ్మానాన్నల కళ్లల్లో ఎప్పుడూ గౌరవం, ఆనందం చూడటమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా విజయంపై స్పందిస్తూ.. ``ఈ సినిమా చూసిన వెంటనే ఎప్పుడు వేడుక పెడతారా... దీని గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలని ఉత్సాహంగా అనిపించింది. వరుణ్ నన్ను వేడుకకు రావాలని అడగ్గానే తప్పకుండా వస్తానని చెప్పాను. మనకు ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు తలవంచి ధన్యవాదాలు తెలియజేయడం మన బాధ్యత. ఇలాంటి విజయాలను అందరితో కలిసి జరుపుకోవాలి`` అని చిత్ర యూనిట్‌ను అభినందించారు. వరుణ్ క్రమశిక్షణ, నటనపై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక బాక్సాఫీస్ వసూళ్ల విషయానికి వస్తే.. `కొరియన్ కనకరాజు` థియేటర్లలో సంచలన విజయ సాధించింది. వినూత్నమైన కాన్సెప్ట్... వరుణ్ తేజ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్... సత్య కామెడీ టైమింగ్... తమన్ సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజైన ఫస్ట్ వీకెండ్‌లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 20.8 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, దాదాపు 97 శాతం పైగా బ్రేక్ ఈవెన్ రికవరీని పూర్తి చేసుకుంది. తొలి మూడు రోజుల్లోనే భారతదేశంలో 13.20 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టగా... వరల్డ్ వైడ్‌గా గ్రాస్ చూస్తే 20 కోట్లకు పైగా రాబట్టి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుణ్ తేజ్‌కు ఈ సినిమా మంచి కంబ్యాక్ హిట్ అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.