వారణాసి, రాకా.. కథలో ఈ కనెక్షన్స్
ఒకటి మహేష్ బాబుతో చేస్తున్న టైమ్ ట్రావెల్ అడ్వెంచర్. మరొకటి అల్లు అర్జున్‌తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా.
రాజమౌళి ‘వారణాసి’, అట్లీ ‘రాకా’ కథలు పూర్తిగా వేరు. కానీ ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం చూస్తే రెండింటి జానర్ దగ్గర కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. ఒకటి మహేష్ బాబుతో చేస్తున్న టైమ్ ట్రావెల్ అడ్వెంచర్. మరొకటి అల్లు అర్జున్‌తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా. రెండింటిలోనూ ఇప్పటి ప్రపంచంతో పాటు చాలా పాత కాలాన్ని కథలోకి తీసుకొస్తున్నారు.
‘వారణాసి’ విషయంలో ఈ విషయం ఇప్పటికే క్లియర్ అయింది. కథ వారణాసి నుంచి అంటార్కిటికా, ఆఫ్రికా మీదుగా పాత రోమ్ వరకు వెళ్తుందని రాజమౌళి స్వయంగా చెప్పాడు. మహేష్ కూడా సినిమాలో టైమ్ ట్రావెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. పైగా రామాయణానికి సంబంధించిన భాగం కూడా ఉంది. మహేష్ ఒక ఎపిసోడ్‌లో రాముడిగా కనిపిస్తాడని రాజమౌళి వెల్లడించాడు.
‘రాకా’ దగ్గర కూడా దాదాపు ఇదే తరహా కలయిక కనిపిస్తోంది. కాకపోతే అక్కడి వివరాలు ఇంకా మేకర్స్ అధికారికంగా చెప్పలేదు. ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కథలో ఒక భాగం పురాణ, వేద కాలాన్ని పోలిన ట్రైబల్ ప్రపంచంలో నడుస్తుందట. మరో భాగం ఇప్పటి కాలంలో ఉంటుంది. ఈ రెండు ప్రపంచాలను సైన్స్ ఫిక్షన్ కథతో అట్లీ కలుపుతున్నట్లు సమాచారం.
ఇద్దరు దర్శకులు పాత కాలాన్ని తీసుకుంటున్నా దాన్ని పూర్తి పురాణ సినిమాగా మాత్రం చేయడం లేదు. ‘వారణాసి’లో రామాయణం, టైమ్ ట్రావెల్, ప్రకృతి విపత్తులు, ప్రపంచ ప్రయాణం అన్నీ ఒకే కథలో ఉన్నాయి. ‘రాకా’లో పురాణ కాలం, ట్రైబల్ సెటప్‌తో పాటు కొత్త జీవులు, వేర్వేరు జాతులు కూడా ఉంటాయని టాక్.
ఇక్కడ మరో తేడా కూడా ఉంది. ‘వారణాసి’ ఒక్క సినిమాగానే వస్తుందని రాజమౌళి ఇప్పటికే చెప్పాడు. ఎంత పెద్ద కథ అయినా రెండో భాగం ఉండదని క్లారిటీ ఇచ్చాడు. ‘రాకా’ మాత్రం రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే దీనిపై అట్లీ టీమ్ ఇంకా ప్రకటన చేయలేదు. ఇలా రాబోతున్న రెండు భారీ స్టార్ సినిమాల్లో పురాణాన్ని డైరెక్ట్ గా పాత కాలంలోనే వదిలేయకుండా కొత్త జానర్లతో కలుపుతున్నారు. మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.