ఇక మెగా మేనల్లుడు 2027లోనేనా?
తొలి సినిమాతోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించి టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన వైష్ణవ్ అటుపై అంచనాలను అందుకోవడంలో కొంత తడబడ్డాడు.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ `ఉప్పెన` తో ఎలాంటి సక్సెస్ చూసాడో? చెప్పాల్సిన పనిలేదు. తొలి సినిమాతోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించి టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన వైష్ణవ్ అటుపై అంచనాలను అందుకోవడంలో కొంత తడబడ్డాడు. ఆ క్రమంలో కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆయన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెష్ణవ్ వెండితెరకు దూరమై మూడేళ్లు దాటిపోవడంతో? అసలు ఆయన ఎందుకు గ్యాప్ తీసుకున్నారనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.
వైష్ణవ్ తేజ్ ఇంత సుదీర్ఘ విరామం తీసుకోవడానికి కారణం సరైన కథ దొరక్కపోవడమే అని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చిన కథలు తన ఇమేజ్‌కి తగ్గట్టుగా లేకపోవడంతో తొందరపడి సినిమాలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారట. ఏదైనా కథను ఎంచుకుంటే? అది ఖచ్చితంగా ప్రేక్షకులని మెప్పించేలా ఉండాలని ప్రయోగాల కంటే కంటెంట్ ప్రధానమైన చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా వైష్ణవ్ తేజ్ అభిమానులకు ఓ ముఖ్యమైన అప్డేట్ అందుతోంది. వైష్ణవ్ తిరిగి మేకప్ వేసుకోవడానికి సిద్ధమ వుతున్నారని అయితే ఆ ప్రాజెక్ట్ 2027లోనే పట్టాలెక్కే అవకాశం ఉందని తెలిసింది. మూడేళ్ల విరామం తర్వాత వైష్ణవ్ తేజ్ రాక కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ గ్యాప్‌ను ఆయన ఖాళీగా గడపకుండా నటనలో మెరుగులు దిద్దుకోవడానికి .. బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు సమాచారం. 2027లో రాబోయే వైష్ణవ్ తేజ్ చిత్రం కెరీర్‌ను మలుపు తిప్పేదిగా ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
కథ ఎంపిక దగ్గర్నుంచి దర్శకుడి వరకు ప్రతి విషయంలోనూ వైష్ణవ్ చాలా స్పష్టతతో ఉన్నారట. వైష్ణవ్ తీసుకుంటున్న సుదీర్ఘ విరామం ఒక రకంగా సరైందేనని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కెరీర్ ప్రారం భంలో వచ్చే ఫ్లాపులు హీరోల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కానీ విరామం తీసుకుని పక్కా ప్లానింగ్‌తో వస్తే మళ్లీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. వైష్ణవ్ తేజ్ తీసుకుంటున్నఈ గ్యాప్ ఒక `సెల్ఫ్-కరెక్షన్` లాంటిది. పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకోవొచ్చు. తనలోని లోపాలను సరిదిద్దుకొవచ్చు. 2027లో పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతున్నారు. మూడేళ్ల నిరీక్షణ తర్వాత వైష్ణవ్ వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని ఆశిద్దాం.