రివ్యూలు Vs మౌత్ టాక్.. తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ రాజుకున్న హాట్ డిబేట్!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వడ్డే నవీన్, రివ్యూలు సినిమాలను చంపలేవని, ప్రేక్షకుల నుంచి వచ్చే మౌత్ టాక్‌నే అసలైన రాజు అని స్పష్టం చేశారు.
సినిమా రిలీజైన తర్వాత దాని సక్సెస్ గా నిర్ణయించేది ఏమిటి? విమర్శకుల రివ్యూలా, ఆడియన్స్ రెస్పాన్సా? ఈ చర్చ గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో తరచూ వినిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని సినిమాలు నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ భారీ విజయాలు సాధిస్తుండగా, మరికొన్ని పాజిటివ్ సమీక్షలు అందుకున్నా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతున్నాయి. ఇలాంటి టైమ్ లో నటుడు వడ్డే నవీన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ అంశాన్ని చర్చనీయాంశంగా మార్చాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వడ్డే నవీన్, రివ్యూలు సినిమాలను చంపలేవని, ప్రేక్షకుల నుంచి వచ్చే మౌత్ టాక్‌నే అసలైన రాజు అని స్పష్టం చేశారు. ఒక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే, దాని కంటెంట్ బలంగా ఉంటే ఎలాంటి నెగెటివ్ రివ్యూలు కూడా ఆ సినిమా విజయాన్ని అడ్డుకోలేవని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చి తమ అనుభవాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారానే ఒక సినిమా గురించి నిజమైన ప్రచారం జరుగుతుందని చెప్పారు. సోషల్ మీడియా, యూట్యూబ్ రివ్యూల ప్రభావం ఉన్నప్పటికీ, చివరికి ప్రేక్షకుడి అనుభవమే సినిమాను నిలబెడుతుందనే అభిప్రాయాన్ని వెల్లడించారు.
అయితే వడ్డే నవీన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు నేటి డిజిటల్ యుగంలో రివ్యూల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేమని చెబుతున్నారు. చాలా మంది ప్రేక్షకులు ఇప్పటికీ సినిమా చూడాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే ముందు రివ్యూలను పరిశీలిస్తారని, లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ఒక ప్రముఖ రివ్యూయర్ అభిప్రాయం వేలాది మందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని, పర్సనల్ గా వారికి సినిమా నచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ముందుగానే వచ్చిన రివ్యూల కారణంగా థియేటర్‌కు వెళ్లకుండా ఉంటున్నారని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు.
మరోవైపు కొందరు సినీ నిర్మాతలకు కూడా సూచనలు చేస్తున్నారు. రివ్యూయర్లను టార్గెట్ చేయడం వల్ల ప్రయోజనం లేదని, వారికి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు ఉందని.. నిర్మాతలు, దర్శకులు తమ శక్తినంతా మంచి సినిమా తీయడంపైనే పెట్టాలని, అప్పుడు కఠినమైన క్రిటిక్ కూడా ఆ సినిమాను ప్రశంసించక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం మౌత్ టాక్ కూడా ప్రేక్షకుల నుంచే వస్తుందని, వందమంది సినిమా చూస్తే వంద రకాల అభిప్రాయాలు ఉంటాయని, అదే పరిణామం చెందుతూ ఇప్పుడు యూట్యూబ్ రివ్యూల రూపంలో కనిపిస్తోందని, మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారంటూ స్పందిస్తున్నారు.
మొత్తానికి వడ్డే నవీన్ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న రివ్యూలు వర్సెస్ మౌత్ టాక్ చర్చను మరోసారి ముందుకు తెచ్చాయి. రివ్యూల ప్రభావం ఉందా లేదా అన్నది పక్కన పెడితే, చివరికి ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్‌నే సినిమాకు అసలైన బలం అనే విషయంపై మాత్రం చాలా మంది ఏకీభవిస్తున్నారు. బలమైన కథ, ఆకట్టుకునే కథనం, వినోదాత్మక అనుభవం ఉంటే ప్రేక్షకులే ఆ సినిమాకు అతిపెద్ద ప్రచారకర్తలుగా మారతారని సినీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.