టాప్ స్టోరి: ఆర్థిక అవసరాలు వీళ్ల‌ను స్టార్ల‌ను చేసాయి!

ఒక్కసారి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి... ఇండస్ట్రీలో మంచి స్థాయికి చేరుకున్న తర్వాత ఈ నటీనటులు తమ పాత జ్ఞాపకాలను ఎంతో వినమ్రతతో షేర్ చేస్తూనే ఉంటారు.

Update: 2026-07-24 23:30 GMT

సమకాలీన చిత్ర పరిశ్రమలో అనుకోకుండా నటనలోకి అడుగుపెట్టి... ఆర్థిక అవసరాల కోసం వచ్చిన అవకాశాలను పట్టుకుని స్టార్ హోదాను సాధించిన నటీనటులు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన మొదటి చెక్కు విశేషంలాగే... సినిమా రంగంలో ప‌లువురు న‌టీన‌టుల విష‌యంలో చోటు చేసుకున్న గ‌మ్మ‌త్త‌యిన విషయాలు తెలుసుకుని తీరాలి.

సినీ ప్రపంచం బయట నుంచి చూసేవారికి ఎంతో గ్లామర్‌మ‌యంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి కథ వెనుక గ్లామర్ మాత్రమే ఉండదు.. అనేక ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ అవసరాలు ..అనుకోని పరిస్థితులు దాగి ఉంటాయి. నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల వెల్లడించిన ప్రకారం.. తన మొదటి కన్నడ చిత్రం `గిల్లి`కి లభించిన రూ. 5 లక్షల పారితోషికంతో సొంతంగా ఒక కారు కొనుక్కోవచ్చనే ఆలోచనతోనే ఆ రంగానికి ఓకే చెప్పారు. పాకెట్ మనీ చూసే వయసులో ఆ ఐదు లక్షల రూపాయిల చెక్కు త‌న‌కు ఆర్థికంగా ఎంతో ఆసరా ఇచ్చి.. నటన వైపు అడుగులు వేసేలా చేసింది.

కేవలం రకుల్ మాత్రమే కాదు.. సౌత్ నుంచి నార్త్ వరకు మన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది దిగ్గజాలు ఆర్థిక కష్టాల వల్ల లేదా కుటుంబ బాధ్యతల వల్లే అనుకోకుండా నటన వైపు వచ్చారు. టాలీవుడ్‌లో రజనీకాంత్ వంటి గ్లోబల్ స్టార్ ప్రారంభంలో బస్ కండక్టర్‌గా పనిచేస్తూ.. ఆర్థికంగా నిలదొక్కుకునే క్రమంలోనే నాటకాల నుంచి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తమిళంలో విజయ్ సేతుపతి తన కుటుంబ అప్పులు తీర్చడానికి.. మిడిల్ ఈస్ట్‌లో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేసి... ఆ తర్వాత నటనలోకి వచ్చి నిలదొక్కుకున్న తీరు ఇప్పటికీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

అలాగే బాలీవుడ్‌లో చూస్తే.. నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, పంకజ్ త్రిపాఠి, రజత్‌కపూర్ వంటి ప్రతిభావంతులైన నటులు నగరంలో కనీసం బ్రతకడానికి.. తిండి.. నివాస ఖర్చులను వెళ్లదీసుకోవడానికి వచ్చిన చిన్న చిన్న అవకాశాలనే ఆసరాగా చేసుకున్నారు. షారుఖ్ ఖాన్ కూడా తన ఆరంభ రోజుల్లో చేతిలో తగినంత డబ్బు లేక.. ముంబై నగరంలో ఉపాధి కోసం చిన్నా చితకా రోల్స్- టీవీ సీరియల్స్ చేస్తూనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప్రారంభించిన ఈ ప్రయాణం.. ఆ తర్వాత వారిని కోట్లాది మంది అభిమానించే నటులుగా మార్చింది.

ఒక్కసారి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి... ఇండస్ట్రీలో మంచి స్థాయికి చేరుకున్న తర్వాత ఈ నటీనటులు తమ పాత జ్ఞాపకాలను ఎంతో వినమ్రతతో షేర్ చేస్తూనే ఉంటారు. ఆరంభంలో అవకాశాల కోసం పడిన ఆరాటం, రూమ్‌ రెెంట్లు కట్టలేక పడిన యాతనలు, తిండికి కూడా ఇబ్బంది పడిన రోజులను వారు బహిరంగంగానే వెల్లడిస్తారు. ఈ రకమైన ఓపెన్ టాక్ వల్ల ప్రేక్షకులు వారికి మరింత దగ్గరవ్వడమే కాకుండా.. కష్టపడే తత్వానికి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుందనే నమ్మకాన్ని నేటి యువతకు కలిగిస్తుంది.

సొంతంగా కారు కొనాలనే చిన్న కోరికతో రూ. 5 లక్షల చెక్కును అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ అయినా...కుటుంబ అప్పుల కోసం ఇండస్ట్రీకి వచ్చిన విజయ్ సేతుపతి అయినా.. వీరి ప్రయాణాలు నిరూపించేది ఒకటే. నటన అనేది చాలామందికి కేవలం ఒక కల మాత్రమే కాదు... అది వారి బతుకుదెరువుకు వేసిన బలమైన పునాది. ఆర్థిక అవసరం నుంచి మొదలైన ఆ పయనం... తార‌ల‌ కష్టపడే తత్వం వల్లనే వారిని అద్భుతమైన నటులుగా.. స్టార్‌లుగా తీర్చిదిద్దింది.

Tags:    

Similar News