శ్రీరాముడిగా నటించడానికి భయపడ్డ ఆ ఇద్దరు స్టార్లు

భారతీయ పురాణేతిహాసాలలో శ్రీరాముడి పాత్ర అత్యంత పవిత్రమైనది.. ప్రశాంతతో కూడుకున్న అభినివేశం ఉన్న‌ది.

Update: 2026-07-25 04:02 GMT

భారతీయ పురాణేతిహాసాలలో శ్రీరాముడి పాత్ర అత్యంత పవిత్రమైనది.. ప్రశాంతతో కూడుకున్న అభినివేశం ఉన్న‌ది. కోట్లాదిమంది ప్రజలు దేవుడిగా పూజించే ఆ పాత్రలో నటించడం ఏ నటుడికైనా ఎంతో గర్వకారణమైనా... అంతే స్థాయిలో బాధ్యత, భయం కూడా వెంటాడతాయి. ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అందుకే నితీష్ తివారీ `రామాయణం` చిత్రంలో శ్రీరాముడి పాత్రను పోషిస్తున్న రణ్‌బీర్ కపూర్.. ఆ పాత్ర వైశిష్ట్యాన్ని తలచుకుని మొదట్లో చాలా భయపడ్డారు. ఆ భయం, అభద్రతాభావం నుంచే ర‌ణ‌బీర్ అత్యంత కఠినమైన రెండేళ్ల సుదీర్ఘ ప్రిపరేషన్‌ను ప్రారంభించారు.

ఈ పాత్ర కోసం రణ్‌బీర్ కపూర్ శారీరక మార్పుల కంటే శ్రీరాముని తత్వాన్ని, పురాణ‌పురుషుడి లోతైన జీవిత పాఠాలను అర్థం చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం కోసం రెండేళ్ల పాటు యోగా, ధ్యానం సాధన చేశారు. ఇందుకోసం `సువీర్` అనే ఆధ్యాత్మిక గురువుతో కలిసి గంటల తరబడి సమయం గడుపుతూ మనస్సును ప్రశాంతత వైపు మళ్లించారు. అంతేకాకుండా... ఎన్నో రామాయణ గ్రంథాలను క్షుణ్ణంగా చదివి... ర‌క‌ర‌కాల‌ వర్షన్ల వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాలను తెలుసుకోవడానికి పలువురు పండితులను కలిశారు. రాముడి సౌమ్యతను ప్రదర్శించడమే ఈ నటుడి అసలైన సాధనగా మారింది.

గతంలో కూడా రామానంద్ సాగర్ ప్రతిష్టాత్మక `రామాయణ్` సీరియల్ (1987)లో శ్రీరాముడిగా నటించిన అరుణ్ గోవిల్ కూడా మొదట్లో తీవ్రమైన ఒత్తిడిని, భయాన్ని ఎదుర్కొన్నారు. పైగా ఆయన మొదటిసారి ఆడిషన్ ఇచ్చినప్పుడు ``రాముడి పాత్రకు సరిపోయే తేజస్సు, ప్రశాంతత నీ ముఖంలో కనిపించడం లేదు`` అని రామానంద్ సాగర్ ఆయనను తిరస్కరించారు. ఆ తర్వాత అరుణ్ గోవిల్ సిద్ధమైన విధానం ఇప్పటి నటుల మాదిరిగా జిమ్ లేదా కఠినమైన యోగా సాధన రూపంలో కాకుండా పూర్తిగా ఆధ్యాత్మికంగా, మానసికంగా జరిగింది. అద్దం ముందు నిలబడి తన నవ్వులో నిష్కల్మషమైన సాత్వికత వచ్చేలా సాధన చేసి.. చివరికి ఆ పాత్రను దక్కించుకోవడమే కాక శ్రీరాముడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

క్రమంగా ఈ ఇద్దరు నటుల ప్రయాణం గమనిస్తే... రాముడి పాత్రను పోషించడం అనేది సాధారణ నటుల‌కు సాధ్య‌మ‌య్యేది కాదని స్పష్టమవుతుంది. యుగాలైనా మారినా... తెరపై రాముడిగా మెప్పించాలంటే కేవలం డైలాగులు చెప్పడం సరిపోదు. ఆ పాత్రలోని శాంతం, ధర్మం, తేజస్సు నటుడి అంతరంగం నుంచి రావాలి. అరుణ్ గోవిల్ తన జీవనశైలిని, ముఖ కవళికలను మార్చుకుని ఆ పాత్రకు ప్రాణం పోస్తే, రణ్‌బీర్ కపూర్ ధ్యానం, యోగా , ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆ పాత్రలోని లోతును ఆవాహన చేసుకునే ప్రయత్నం చేశారు. భయంతో మొదలైన వీరి ప్రయాణం క్రమశిక్షణతో కూడిన సాధన వైపు సాగడం విశేషం.

సాధారణంగా రెగ్యులర్ సామాజిక కాన్సెప్టులలో నటించే నటీనటులు ఉన్నట్టుండి పౌరాణిక, జానపద లేదా హిస్టారికల్ కథాంశాలలో నటించాలంటే భారీ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అభినయం విషయానికి వస్తే.. ఆధునిక పాత్రల్లో ఉండే చంచలత్వం వదిలి ప్రశాంతత, గంభీరత పాటించాలి. ఆహార్యం పరంగా పాతకాలపు రాజసం.. పౌరాణిక దుస్తులు.. ఆభరణాలకు తగ్గట్టుగా శరీరాకృతిని మలచుకోవాలి. ఇక సంభాషణల పరంగా గ్రాంథిక లేదా స్వచ్ఛమైన భాషా ఉచ్ఛారణపై పట్టు సాధించాలి. కంటి భాష, నడక, శరీర భాషలో దైవత్వం లేదా రాచరికం ఉట్టిపడేలా ప్రత్యేకమైన శిక్షణ తీసుకోవడం ఎంతైనా అవసరం.

Tags:    

Similar News