ది ఇండియా స్టోరీ: చందమామ మనసులు గెలుచుకున్నా కానీ..!
ప్రస్తుత సమాజంలో మనం తింటున్న ఆహారం ఎంతటి విషతుల్యంగా మారుతుందో ఎత్తిచూపే ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన.. హృదయాన్ని కదిలించే సామాజిక కథాంశంతో తెరకెక్కిన చిత్రం `ది ఇండియా స్టోరీ`.
ప్రస్తుత సమాజంలో మనం తింటున్న ఆహారం ఎంతటి విషతుల్యంగా మారుతుందో ఎత్తిచూపే ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన.. హృదయాన్ని కదిలించే సామాజిక కథాంశంతో తెరకెక్కిన చిత్రం `ది ఇండియా స్టోరీ`. కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఆన్ లైన్ లో బిగ్ డిబేట్ రన్ అవుతోంది. వివాదాలతో ప్రచారం కొట్టేసిన చిత్రాలలో ఇది ఒకటి. ఎట్టకేలకు సినిమా విడుదలైంది.. అయితే ఇందులో కంటెంట్ గొప్పదే అయినా కానీ.. స్లో నేరేషన్ దర్శకత్వ వైఫల్యం గురించే ఎక్కువ చర్చ సాగుతోంది. ఆహార పదార్థాలలో క్రిమిసంహారకాలు, రసాయనాల కాలుష్యం కారణంగా క్యాన్సర్‌తో చిన్నారి చనిపోతే.. దానికి వ్యవస్థనే నిలదీసే తండ్రి పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక మంచి ఆశయంతో.. అత్యంత సున్నితమైన అంశాన్ని కథాంశంగా ఎంచుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేయడంలో సఫలమైనా.. కొన్ని బలహీనతల వల్ల పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమాలో అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం `చందమామ` కాజల్ అగర్వాల్ నటననే! న్యాయవాది అర్చన పాత్రలో కాజల్ అద్భుతంగా ఒదిగిపోయింది. ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్న లాయర్‌గా ప్రథమార్ధంలో సినిమాకి ప్రధాన ప్రాణవాయువులా నిలిచింది. కోర్టులో వాదనలు వినిపించేటప్పుడు కాజల్ చూపించిన నటన, పలికించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయి. గ్లామరస్ పాత్రలకే కాకుండా... ఇలాంటి బాధ్యతాయుతమైన, సీరియస్ రోల్స్‌ను కూడా చాలా ప్రామాణికంగా పోషించగలనని కాజల్ మరోసారి నిరూపించుకుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా మారింది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే... కాజల్ అగర్వాల్‌తో పాటు శ్రేయస్ తల్పడే తన పాత్రలో జీవించారు. ప్రథమార్ధంలో పాత్ర పరిమితంగా ఉన్నా.. ద్వితీయార్ధంలో వచ్చే కీలక సన్నివేశాలలో గుండెల్ని కదిలించే నటనతో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు. బాలనటి త్రిష శారద కష్టమైన పాత్రను చాలా నైపుణ్యంగా పోషించింది. మురళి శర్మ, మనీష్ వాధ్వాలు తమ అనుభవంతో నమ్మదగిన ప్రదర్శన ఇచ్చారు. ముఖ్యంగా కల్తీ పాలు, ఆహారం గురించి తెలిసినప్పుడు మురళి శర్మ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ సమాజంలోని దారుణమైన పరిస్థితికి అద్దం పడతాయి.
సాంకేతిక విభాగాల పరంగా చూస్తే.. సాగర్ షిండే ఎంచుకున్న కథాంశం చాలా శక్తివంతమైనది. నేటి సమాజానికి అత్యంత అవసరమైనది. అయితే దానికి తగ్గట్టుగా స్క్రీన్‌ప్లే రాయడంలో ఆయన విఫలమయ్యారు. కోర్టు డ్రామా అంటే ప్రేక్షకుల్లో ఒకలాంటి ఉత్కంఠ.. చప్పట్లు కొట్టేలాంటి డైలాగులు ఉండాలి... కానీ ఇందులో అటువంటి బలమైన ఘట్టాలు లోపించాయి. ప్రతిపక్ష లాయర్ బలమైన వాదనలు వినిపించినా.. కేవలం లాయర్ అర్చన ఎత్తిన పాయింట్లను డిఫెండ్ చేసుకోవడానికే పరిమితమయ్యాడు కానీ... ఎదురుదాడి చేసే బలమైన సాక్షులను కోర్టు ముందుకు తీసుకురాకపోవడం కథనంలో లోపంగా కనిపిస్తుంది.
కాజల్ అగర్వాల్ తన పవర్‌ఫుల్ నటనతో మరోసారి అందరి మనసులను గెలుచుకున్నా... బలహీనమైన దర్శకత్వం.. నీరసమైన కోర్టు సన్నివేశాల వల్ల `ది ఇండియా స్టోరీ` ప్రభావం తగ్గిపోయింది. సామాజిక స్పృహ కలిగించే పాయింట్ ఉన్నా.. డ్రామా సరిగ్గా పండకపోవడం.. ఎలాంటి ప్రచారం లేకుండా థియేటర్లలోకి రావడం వల్ల ఈ సినిమాపై మార్కెట్‌లో సానుకూలమైన మౌత్ టాక్ ఏదీ రాకపోవడం నిరాశపరుస్తోంది.