375 కోట్లతో రికార్డ్ బ్రేకింగ్ పబ్లిసిటీ.. ఇండియన్ సినిమాల టాప్ -10 ప్రచార బడ్జెట్లు
భారతీయ చిత్రసీమలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కే పాన్-ఇండియా సినిమాలకు ప్రచారం అనేది బాక్సాఫీస్ విజయాన్ని శాసించే అత్యంత కీలకమైన అంశంగా మారింది.
భారతీయ చిత్రసీమలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కే పాన్-ఇండియా సినిమాలకు ప్రచారం అనేది బాక్సాఫీస్ విజయాన్ని శాసించే అత్యంత కీలకమైన అంశంగా మారింది. సాధారణంగా మన దేశంలో అత్యంత భారీ చిత్రాలకు ప్రమోషన్ల కోసం 20 కోట్ల నుండి 60 కోట్ల వరకు ఖర్చు చేయడం పరిపాటి. అయితే నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రామాయణం` చిత్రం ఈ సాంప్రదాయ అంచనాలను పూర్తిగా తిరగరాస్తూ... అంతర్జాతీయ ప్రచారం కోసం ఏకంగా 375 కోట్ల మార్కెటింగ్ బడ్జెట్‌ను కేటాయించి ఇండియన్ సినీ చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరతీసింది.
ఈ భారీ ప్రచార బడ్జెట్‌లో సింహభాగం అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ అయిన సోనీ పిక్చర్స్ బాధ్యత వహిస్తుండటం విశేషం. కేవలం గ్లోబల్ ప్రమోషన్ల కోసమే సోనీ సంస్థ 235 కోట్లను పెట్టుబడిగా పెడుతుండగా.. చిత్ర నిర్మాతలు అదనంగా మరో 140 కోట్లను జోడిస్తున్నారు. దీంతో పాటు దేశీయంగా.. ఇతర అంతర్జాతీయ వేదికలపై చేసే ప్రచారాన్ని కలుపుకుని మొత్తం పబ్లిసిటీ బడ్జెట్ 375 కోట్ల రేంజును మార్కును తాకింది. శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) వంటి ప్రపంచ స్థాయి ఈవెంట్లలో ప్రదర్శించడం ద్వారా ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నారు.
`రామాయణం` కంటే ముందు భారతీయ సినిమాల ప్రచార బడ్జెట్లను పరిశీలిస్తే.. ప్రభాస్ నటించిన `కల్కి 2898 ఏడి` చిత్రం 80 - 100 కోట్ల మార్కెటింగ్ ప్రచార వ్యయంతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా బుజ్జి రోబోట్ కార్ ఈవెంట్లు.. గ్లోబల్ టూర్లను నిర్వహించారు. ఇక మూడవ స్థానంలో నిలిచిన ఎస్.ఎస్. రాజమౌళి RRR చిత్రం ఆస్కార్ క్యాంపెయిన్, జపాన్ ప్రమోషన్లు .. ప్రపంచవ్యాప్త పర్యటనల కోసం 70 - 80 కోట్లను ప్రచారం కోసం వెచ్చించింది.
ఈ క్రమంలోనే `బాహుబలి 2: ది కన్క్లూజన్` 50 - 60 కోట్లతో వర్చువల్ రియాలిటీ (వీఆర్) గేమింగ్, బుక్స్ ద్వారా ప్రచారం నిర్వహిస్తే...రజనీకాంత్ 2.0 చిత్రం 50 - 55 కోట్లతో దుబాయ్ ఆడియో లాంచ్.... హాట్ ఎయిర్ బెలూన్స్ వంటి వినూత్న ప్రచార శైలిని ఎంచుకుంది. షారుఖ్ ఖాన్ `జవాన్` (40-50 కోట్లు) బుర్జ్ ఖలీఫాపై ట్రైలర్ లాంచ్‌తో సంచలనం సృష్టిస్తే...కేజీఎఫ్: చాప్టర్ 2 (35-40 కోట్లు), సాహో (30-35 కోట్లు), పఠాన్ (30-35 కోట్లు), `బ్రహ్మాస్త్ర: పార్ట్ 1` (25-30 కోట్లు) తో టాప్-10 ప్రచార బడ్జెట్ కలిగిన చిత్రాలుగా నిలిచాయి.
కేవలం సినిమా మేకింగ్ మాత్రమే కాకుండా... అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకట్టుకోవడానికి హాలీవుడ్ స్టూడియోలతో భాగస్వామ్యం వహిస్తూ వందల కోట్ల ప్రచార బడ్జెట్లను కేటాయించడం ఇండియన్ సినిమా గ్లోబల్ రీచ్‌ను సూచిస్తోంది. ప్రచార వ్యయం వందల కోట్లకు చేరడం అనేది ఒక రకంగా బాక్సాఫీస్ ఓపెనింగ్స్‌ను గ్యారెంటీ గా మార్చుకుంటూ.. హాలీవుడ్ స్థాయిలో ఇండియన్ కంటెంట్‌ను నిలబెట్టడానికి నిర్మాతలు వేస్తున్న పెద్ద అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.