కింగ్ 100 గ్లింప్స్.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!
| కష్టాన్ని నమ్మే వ్యక్తిగా ఝాన్సీ రాణిని చూపించినప్పటికీ ఆమె రాజకీయ ప్రయాణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది బయటపెట్టలేదు.
నాగార్జున వందో సినిమా అనగానే అభిమానులలో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే 'కింగ్ 100' విషయంలో దర్శకుడు రా. కార్తీక్ కాస్త బిన్నమైన ప్రయోగం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నాగార్జున పాత్రను లక్కున్నోడిగా పరిచయం చేసిన మేకర్స్ ఇప్పుడు టబు క్యారెక్టర్‌ను బయటపెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీరిద్దరి మధ్య గత సినిమాల్లో కనిపించిన ఆ కెమిస్ట్రీకి ఈసారి చోటు లేదు అనిపిస్తోంది. పైగా ఒకరంటే మరొకరికి పడని పరిస్థితుల్లో కథ నడవబోతున్నట్లు హింట్ ఇచ్చారు.
టబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌లో ఆమెను మహానటి ఝాన్సీ రాణిగా పరిచయం చేశారు. ప్రపంచంలో కష్టాన్ని నమ్మేవాళ్లు, అదృష్టాన్ని నమ్మేవాళ్లు రెండు రకాలుగా ఉంటారని చెబుతూ తనకు అదృష్టమంటేనే అసహ్యమని ఆమె అంటారు. రాజకీయాల్లో పెద్ద స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఉన్న పాత్రగా టబు కనిపించబోతున్నారు. ఆమె చుట్టూ అభిమానులు, అనుచరులు ఉండేలా ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు.
ఇక్కడే నాగార్జున పాత్రతో ఆసక్తికరమైన కాంట్రాస్ట్ కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో విడుదల చేసిన గ్లింప్స్‌లో నాగ్‌ను అదృష్టం బాగా కలిసొచ్చే వ్యక్తిగా చూపించారు. ఇప్పుడు అదృష్టాన్ని అస్సలు నమ్మని ఝాన్సీ రాణిని తీసుకొచ్చారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ వ్యక్తిగతమైనదే కాకుండా వారి ఆలోచనల కారణంగా కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నేపథ్యం ఈ సంఘర్షణలో ఎంతవరకు ఉంటుందనేది చూడాలి.
నాగార్జున, టబు కలిసి నటించి దాదాపు 28 ఏళ్లవుతోంది. 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడా మా ఆవిడే' సినిమాల్లో వీరి కాంబినేషన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి కోడిని ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తీసుకొస్తున్నప్పుడు రెగ్యులర్ లవ్ ట్రాక్ పెట్టకుండా ప్రత్యర్థులుగా చూపించడం దర్శకుడు ఎంచుకున్న కొత్త రూట్. పైగా ఇద్దరూ సీనియర్ నటులు కావడంతో వారి మధ్య వచ్చే సన్నివేశాలకు మంచి స్కోప్ ఉంటుంది.
మరోవైపు టబు పాత్రను పరిచయం చేసిన విధానం కూడా నాగార్జున క్యారెక్టర్‌కు భిన్నంగా ఉంది. కష్టాన్ని నమ్మే వ్యక్తిగా ఝాన్సీ రాణిని చూపించినప్పటికీ ఆమె రాజకీయ ప్రయాణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది బయటపెట్టలేదు. అలాగే నాగ్ అదృష్టవంతుడు కావడానికి కథలో ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా అనే క్లారిటీ కూడా ఇంకా లేదు. ఈ రెండు అంశాల చుట్టూనే కథలో మలుపులు ఉండే అవకాశం కనిపిస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 24న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఇప్పటికే నాగార్జున, టబు పాత్రలను విడివిడిగా పరిచయం చేసిన మేకర్స్ ఇద్దరూ ఒకే సన్నివేశంలో ఎదురుపడితే ఎలా ఉంటుందనే విషయాన్ని మాత్రం దాచిపెట్టారు. ముఖ్యంగా ఝాన్సీ రాణి రాజకీయ ఆశయాలకు నాగ్ పాత్ర ఎలా అడ్డుపడుతుందనేది తదుపరి ప్రమోషనల్ కంటెంట్‌లో బయటపడే అవకాశం ఉంది.