టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ రిస్క్ గేమ్!

బడ్జెట్ పరిమితులు దాటిపోవడం, ప్రొడక్షన్ దశలో జరిగే ఆలస్యాలు, భారీ అంచనాల ఒత్తిడి వంటి అనేక ప్రతికూలతలను యంగ్ మేకర్స్ ఎదుర్కొనవలసి వస్తోంది.

Update: 2026-07-24 22:30 GMT

ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్ యువ దర్శకుల ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు క‌నిపిస్తున్నాయి. ఒకప్పుడు ఒకటి ..రెండు విజయాలు సాధించిన దర్శకులు తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఎలాంటి నష్టాలకు తావులేని సేఫ్ గేమ్‌ను ఎంచుకునేవారు. చిన్న బడ్జెట్‌లు, పరిమితమైన కాస్టింగ్‌తో బాక్సాఫీస్ వద్ద సురక్షితమైన ప్రయోగాలు చేయడానికి మొగ్గు చూపేవేవారు. కానీ ప్రస్తుత ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పాత లెక్కలన్నీ పక్కన పెట్టి సరికొత్త బాటలో పయనిస్తున్నారు.

ఈ మార్పునకు ప్రధాన కారణం గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా మార్కెట్ విస్తరించడమే. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు చూపిన బాట‌లో యంగ్ డైరెక్ట‌ర్లు న‌డిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చిన్న ఆలోచనలతో సరిపెట్టుకోవడం లేదు. బడ్జెట్ ..భారీ కాస్టింగ్ విషయాలలో మునుపటి సినిమాలను పూర్తిగా మించిపోయేలా అసాధారణ రిస్క్‌లు చేయడానికి తెగిస్తున్నారు. స్థానిక మార్కెట్‌పైనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ కాన్వాస్‌పై చిత్రాలను రూపొందించేందుకు అడుగులు వేస్తున్నారు.

ఇందులో భాగంగా యువ దర్శకులు కంఫర్ట్ జోన్‌ను పూర్తిగా వదిలేస్తున్నారు. రొటీన్ లవ్‌స్టోరీలు .. చిన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల నుంచి బయటపడి సైన్స్ ఫిక్షన్, మైథాలజీ, హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాలు .. డిస్టోపియన్ బ్యాక్‌డ్రాప్ కథలను ఎంచుకుంటున్నారు. మూడేళ్ల కెరీర్ అనుభవం ఉన్న దర్శకులు సైతం వందల కోట్ల బడ్జెట్ ప్రాజెక్టులను సులభంగా డీల్ చేస్తున్నారు. తమ విజన్ ప్రేక్షకులకు సరిగ్గా చేరవేయడం కోసం సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌ను ఆవిష్క‌రించే ఆలోచ‌చ‌న‌ల‌తో క‌దులుతున్నారు.

అయితే ఈ రిస్క్ గేమ్‌లో భారీ విజయాలతో పాటు సవాళ్లు కూడా ఎదురవుతుంటాయి. బడ్జెట్ పరిమితులు దాటిపోవడం, ప్రొడక్షన్ దశలో జరిగే ఆలస్యాలు, భారీ అంచనాల ఒత్తిడి వంటి అనేక ప్రతికూలతలను యంగ్ మేకర్స్ ఎదుర్కొనవలసి వస్తోంది. ఒక్క సినిమా తేడా కొట్టినా? నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉన్నా? దర్శకులు మాత్రం వెనకడుగు వేయకుండా గట్టి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ప్రతిభను నిరూపించుకోవడానికి ఇంతకంటే సరైన సమయం రాదని భావించి రిస్కే విజయానికి సోపానంగా మలుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ సాహసోపేతమైన అడుగుల ఫలితంగానే టాలీవుడ్ ప్రాంతీయ పరిధులను దాటి పాన్-ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. అగ్ర హీరోల కోసం ఎదురు చూడకుండా యువ హీరోలతో .. కొత్త కాంబినేషన్లతోనే బిగ్-బడ్జెట్ అడ్వెంచర్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ తో తెలుగు పరిశ్రమకు సరికొత్త సాంకేతిక నిపుణులు, విభిన్నమైన కథాంశాలు పరిచయమవుతున్నాయి. ప్రేక్షకులు కూడా రొటీన్ సినిమాలను పక్కన పెట్టి వైవిధ్య భరితమైన ప్రయత్నాలకే బ్రహ్మరథం పడుతున్నారు.

యంగ్ డైరెక్టర్స్ ఆడుతున్న రిస్క్ గేమ్ వారి వ్యక్తిగత కెరీర్‌ను మాత్రమే కాకుండా మొత్తం చలనచిత్ర పరిశ్రమ దిశను మార్చేస్తోందనడంలో సందేహం లేదు. సేఫ్ జోన్‌లో ఉండిపోతే వచ్చే చిన్న విజయాల కంటే? రిస్క్ తీసుకుని సాధించే చారిత్రాత్మక విజయమే అసలైన లక్ష్యంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో టాలీవుడ్ గ్లోబల్ బాక్సాఫీస్‌ను ఏలడానికి యువ దర్శకుల తెగింపే ప్రధాన బలంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News