ట్రెండీ టాక్: రాముడితో రావణుడి స్నేహమా? ఇదెట్టా!
ఇటీవల `శాన్ డియాగో కామిక్-కాన్` వేదికగా రణబీర్ కపూర్, యష్ ఒకరిపై ఒకరు కురిపించిన ప్రశంసల వర్షం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం `రామాయణం`. వెండితెరపై రాముడిగా రణబీర్ కపూర్, లంకేశ్వరుడైన రావణుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ పరస్పరం ఢీకొట్టబోతున్నారు. కథ ప్రకారం వీరిద్దరి మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉన్నా ఆఫ్ ద స్క్రీన్ మాత్రం ఈ ఇద్దరు స్టార్ హీరోల స్నేహం అభిమానుల్లో చర్చగా మారింది. ఆ ఇద్దరూ ఒకరినొకరు ఆకాశానికెత్తేసుకుంటున్నారు. తెరపై రాముడు వర్సెస్ రావణుడు ఎపిసోడ్స్ కి భిన్నంగా నిజ జీవితంలో మాత్రం అద్భుతమైన పరస్పర అవగాహనతో... గాఢమైన స్నేహ బంధాన్ని చాటుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇటీవల `శాన్ డియాగో కామిక్-కాన్` వేదికగా రణబీర్ కపూర్, యష్ ఒకరిపై ఒకరు కురిపించిన ప్రశంసల వర్షం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. గతంలో పలు ప్రచార వేదికలపైనా ఒకరినొకరు ప్రశంసించుకున్న ఈ ఇద్దరూ వీలున్న ప్రతి వేదికపైనా ఒకరిపై ఒకరు ఇలా అభిమానం కురిపిస్తున్నారు. కామిక్ కాన్ లో రణబీర్ మాట్లాడుతూ.. యష్ రావణాసురుడి పాత్రకి ప్రాణం పోశాడని కొనియాడారు. యష్ నటనలో నిజాయితీ.. అతడిలోని స్వాగ్.. అతడి వ్యక్తిత్వం.. ఆరా కారణంగా రావణాసురుడి పాత్ర జీవం పోసుకుందని చెప్పారు. తాను మొదటినుంచీ యష్ వర్క్‌కి పెద్ద అభిమానినని... రావణుడి వంటి పది తలల రాక్షసుని పాత్రను పండించడానికి యష్ లాంటి అంతర్జాతీయ స్థాయి నటుడు, స్టార్‌డమ్ అత్యంత అవసరమని రణబీర్ స్పష్టం చేశారు.
మరోవైపు యష్ కూడా రణబీర్‌పై ప్రశంసలు కురిపించడంలో వెనక్కి తగ్గలేదు. ``భగవంతుడైన శ్రీరాముడి పాత్రను పోషించడం అంత సులువైన విషయం కాదని... ఆ పాత్ర కోసం రణబీర్ ఎన్నో త్యాగాలు చేసి...తీవ్రమైన అంకితభావంతో పనిచేశాడ``ని యష్ తెలిపారు. ఒక పెద్ద హీరో అయి ఉండి కూడా ఆ పాత్రపై ఎంతో భక్తిశ్రద్ధలతో పనిచేయడం అతడి గొప్పతనమని కొనియాడారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు వెండితెరపై ఒక అత్యంత అందమైన, పవిత్రమైన రాముడిని చూస్తారని యష్ హామీ ఇచ్చారు. ఈ చిత్రానికి యష్ నటుడిగానే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం గమనార్హం.
చిత్రీకరణ విషయానికి వస్తే.. ఈ ఇద్దరు దిగ్గజ నటులు ఇప్పటివరకు తమ కలయికలోని కీలకమైన ఘట్టాల చిత్రీకరణలో పాల్గొనలేదు. రామాయణంలో రాముడు, రావణుల అసలు పోరాటం ముగింపులోనే వస్తుంది కాబట్టి.. ఆ భారీ యుద్ధ సన్నివేశాలను మున్ముందు షూట్ చేయనున్నట్లు రణబీర్ వెల్లడించారు. మేజర్ క్లైమాక్స్ సీన్లు ఇంకా షూట్ చేయకపోయినా.. ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్ - పరస్పర గౌరవం సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ఎపిక్ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 2026 దీపావళికి పార్ట్ 1.. 2027 దీపావళికి పార్ట్ 2 విడుదల కానున్నాయి. ఇటీవల సోనీ పిక్చర్స్ ఈ చిత్ర అంతర్జాతీయ హక్కులను దక్కించుకోవడంతో ట్రైలర్ లాంచ్‌ను గ్లోబల్ లెవెల్లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు వాయిదా వేశారు. ఏదేమైనా.. రాముడు-రావణులుగా రణబీర్, యష్‌ల కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల రూపంలో గొప్ప మ్యాజిక్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.