క‌మ‌ల్ డిజాస్ట‌ర్ 'థగ్ లైఫ్' వెనుక అంత క‌థ ఉందా?

భారతీయ సినీరంగంలోనే అత్యుత్తమ నటులలో ఒకరిగా.. అద్భుతమైన దార్శనికత కలిగిన దర్శకుడిగా ఉలగనాయగన్ కమల్ హాసన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

Update: 2026-06-15 04:20 GMT

భారతీయ సినీరంగంలోనే అత్యుత్తమ నటులలో ఒకరిగా.. అద్భుతమైన దార్శనికత కలిగిన దర్శకుడిగా ఉలగనాయగన్ కమల్ హాసన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఒక‌ సినిమాలో న‌టిస్తున్నాన‌ని ప్రకటిస్తేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అయితే కమల్ హాసన్ కెరీర్‌లో అత‌డు న‌టించి నిర్మించిన సినిమాలతో పాటు, పట్టాలెక్కకుండా ఆగిపోయిన లేదా అర్ధాంతరంగా నిలిచిపోయిన ప్రాజెక్ట్‌ల గురించి కూడా సినీ వర్గాల్లో అంతే ఆసక్తికరంగా చర్చ జరుగుతుంటుంది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన ఆలోచనలతో ఆయన ప్రారంభించాలనుకున్న కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులు..ర‌క‌ర‌కాల‌ కారణాలతో కార్యరూపం దాల్చకుండానే నిలిచిపోయాయి.

అలా కమల్ హాసన్ మనసులో చాలా కాలంగా ఉండిపోయిన ఒక బలమైన కథాంశం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రమే `థగ్ లైఫ్`. ఫ‌లితం నిరాశ‌ప‌రిచినా కానీ, ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ఆయన గత కొన్నేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిన విష‌యం అంద‌రికీ తెలియ‌క‌పోవ‌చ్చు. థ‌గ్ లైఫ్ ప్ర‌య‌త్నాల‌కు ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే వచ్చింది. చివరకు తన మనసులోని ఆ కోర్ పాయింట్‌ను (కథాంశాన్ని) తన ప్రాణస్నేహితుడు, దిగ్గజ దర్శకుడు మణిరత్నానికి కమల్ అప్పగించారు. అలా వీరిద్దరి కలయికలో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చవిచూడటం తెలిసిందే.

ఈ కథ మూలాలు `తలైవన్ ఇరుక్కిరాన్` అనే టైటిల్‌తో 2000వ దశకం చివరలోనే ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజం రిషి కపూర్, టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ వంటి భారీ తారాగణాన్ని ఎంపిక చేయాలని కమల్ భావించారు. కానీ ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. దీంతో మోహన్‌లాల్, వెంకటేష్ ఇచ్చిన డేట్స్‌ను వాడుకుని కమల్ హాసన్ చక్రి తోలేటి దర్శకత్వంలో `ఉన్నైపోల్ ఒరువన్` (తెలుగులో `ఈనాడు`) అనే సినిమాను నిర్మించారు.

ఆ తర్వాత కూడా కమల్ ఈ ప్రాజెక్ట్‌ను వదిలిపెట్టలేదు. 2012లో ప్రముఖ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాణంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కథానాయికగా ఈ సినిమాను రీలాంచ్ చేయాల‌ని చూసినా అది కుదరలేదు. ఒక దశలో ఈ చిత్రానికి కమల్ హాసనే స్వయంగా దర్శకత్వం వహిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అనంతరం 2015లో ఈ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి దీనిని `తలైవన్ ఇరుక్కిరాన్` పేరుతో తమిళంలో `అమర్ హై` పేరుతో హిందీలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించేందుకు కూడా అంగీకరించారు. కమల్ హాసన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కబోతోందని ప్రకటించారు. అయితే ఒరిజినల్ కథనే మార్చారా లేదా సరికొత్తగా రాసుకున్నారా అనేది స్పష్టం కాకముందే ఈ ప్రయత్నం కూడా కార్యరూపం దాల్చలేదు. ఇలా ఎన్నో పరిణామాల మధ్య నలిగిన కమల్ హాసన్ కలల ప్రాజెక్ట్.. చివరకు మణిరత్నం చేతుల్లోకి వెళ్లి `థగ్ లైఫ్` రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయింద‌ని మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు తెలుసు కానీ, దీనివెన‌క క‌మ‌ల్ హాస‌న్ ద‌శాబ్ధాల చెర‌గ‌ని క‌ల ఉంద‌ని ఎవ‌రికీ తెలీదు. అయితే ఈ ప్రాజెక్టును మ‌ణిర‌త్నానికి ఇవ్వ‌కుండా త‌నే స్వ‌యంగా డైరెక్ట్ చేసి ఉంటే ఫ‌లితం వేరొక‌లా ఉండేదేమో! నిజానికి థ‌గ్ లైఫ్ అనే టైటిల్ కి సంబంధం లేని క‌థ‌తో ఈ సినిమా తీసార‌నే బ్యాడ్ నేమ్ కూడా వ‌చ్చింది. అది రాకుండా జాగ్ర‌త్త ప‌డి ఉండాల్సింది. అంచ‌నాలకు స‌రిప‌డే కంటెంట్ ని ఇవ్వ‌డంలో మ‌ణిర‌త్నం దారుణంగా ఫెయిల‌య్యారు!!

Tags:    

Similar News