పూజకు త్రివిక్రమ్ మరో ఛాన్స్.. కానీ..

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- హీరోయిన్ పూజా హెగ్డే కాంబినేషన్ టాలీవుడ్‌ లో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.;

Update: 2026-03-26 17:01 GMT

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- హీరోయిన్ పూజా హెగ్డే కాంబినేషన్ టాలీవుడ్‌ లో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ కాంబోలో వచ్చిన సినిమాలు కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా, ఆడియన్స్‌ కు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా అందించాయి. ఇప్పుడు మళ్లీ ఆ కాంబినేషన్ గురించి వార్తలు రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే మొదటిసారి నటించిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ లభించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన అల వైకుంఠపురంలో భారీ విజయాన్ని సాధించింది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో పాటు, పూజకు స్టార్ హీరోయిన్‌ గా మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆమె గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆ రెండు విజయాలతో త్రివిక్రమ్- పూజా కాంబినేషన్‌ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తర్వాత కొన్ని ప్రాజెక్టుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో మళ్లీ కలిసి పని చేసే అవకాశం రాలేదు. గుంటూరు కారం సినిమాలో మొదట పూజనే హీరోయిన్‌ గా ఎంపికైనప్పటికీ, తర్వాత ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.

అలా ఛాన్సులు రాకపోవడంతో పూజా టాలీవుడ్‌ లో కొంత గ్యాప్ తీసుకున్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో మళ్లీ త్రివిక్రమ్ సినిమాతో ఆమె పేరు వినిపించడం విశేషంగా మారింది. ప్రస్తుతం త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న‘ఆదర్శ కుటుంబం చిత్రంలో హీరోగా వెంకటేష్ నటిస్తున్నారు. హీరోయిన్‌ గా శ్రీనిధి శెట్టి యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పూజను త్రివిక్రమ్ రంగంలోకి దింపనున్నారని వినికిడి.

అయితే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌ గా కాకుండా స్పెషల్ సాంగ్‌ లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే, ఇది త్రివిక్రమ్- పూజా కాంబినేషన్‌ లో కొత్త యాంగిల్ గా చెప్పుకోవచ్చు. గతంలో పూజా చేసిన స్పెషల్ సాంగ్స్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రంగస్థలంలో చేసిన జిగేల్ రాణి పాట ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ఎఫ్ 3లో చేసిన మాస్ సాంగ్ కూడా ప్రేక్షకులను అలరించింది.

త్రివిక్రమ్ కూడా తన సినిమాల్లో కొందరు హీరోయిన్లను రిపీట్ చేయడం కొత్త విషయం కాదు. గతంలో ఇలియానా, సమంత రూత్ ప్రభుతో పలుమార్లు పని చేశారు. అదే తరహాలో పూజాను కూడా మళ్లీ తన సినిమాలో భాగం చేయాలని చూస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇక ఆదర్శ కుటుంబం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌ కు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ వచ్చే అవకాశముంది. మరి పూజ నిజంగా ఆ సినిమాలో భాగమవుతుందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News