ఫ్లాప్ వచ్చినా.. త్రివిక్రమ్ మళ్లీ అదే స్టైల్!
అయితే ప్రతి సినిమా ఒకేలా ఆడలేదు. ఖలేజా విడుదల సమయంలో నిరాశపరిచినా.. తర్వాత కల్ట్ సినిమాగా పేరు తెచ్చుకుంది.
సినిమా కథను ప్రేక్షకులకు ఎలా చెప్పాలి.. హీరోను ఎలా చూపించాలి.. డైలాగ్స్ తో సీన్స్ కు ఎలా స్ట్రెంగ్త్ తీసుకురావాలి.. ఆ మూడు విషయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఆయన కెరీర్ ను గమనిస్తే మరో విషయం కూడా కనిపిస్తుంది. హిట్ ఫార్ములాను వెతుక్కోవడం కంటే.. తన స్టోరీ, తన ప్రాసెస్ ను నమ్ముకోవడమే ఆయన స్ట్రెంగ్త్.
దర్శకుడిగా త్రివిక్రమ్ జర్నీ నువ్వే నువ్వేతో మొదలైన విషయం తెలిసిందే. తరుణ్, శ్రియ నటించిన ఆ లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహేశ్ బాబుతో చేసిన అతడు, పవన్ కల్యాణ్ తో చేసిన జల్సా సినిమాలు ఆయన రేంజ్ మరింత పెంచాయి. అతడు థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. టీవీ స్ట్రీమింగ్, రీ రిలీజ్ లతో స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది.
ఇక జులాయితో అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ స్ట్రాంగ్ గా నిలిచింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో వచ్చిన అత్తారింటికి దారేది ఆయన కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ మారింది. అలా వైకుంఠపురములోతో త్రివిక్రమ్ మరో రేంజ్ కు వెళ్లారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా బాక్సాఫీస్ లోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత వీర రాఘవ, నితిన్-సమంతల అ ఆ కూడా కమర్షియల్ గా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. అంటే.. త్రివిక్రమ్ కెరీర్ లో వరుస విజయాలే ఎక్కువగా కనిపిస్తాయి.
అయితే ప్రతి సినిమా ఒకేలా ఆడలేదు. ఖలేజా విడుదల సమయంలో నిరాశపరిచినా.. తర్వాత కల్ట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. అజ్ఞాతవాసి మాత్రం భారీ అంచనాల మధ్య వచ్చి నిరాశపరిచింది. ఇక మహేశ్ బాబుతో చేసిన గుంటూరు కారం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక్కడే త్రివిక్రమ్ కెరీర్ లోని అసలు ఇంట్రెస్టింగ్ విషయం కనిపిస్తుంది. ఒక సినిమా ఫ్లాప్ అయితే వెంటనే తన శైలిని మార్చుకునే దర్శకుడు ఆయన కాదు.
మరోసారి కథ, హీరో, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ ను కలిపి తనదైన శైలిలో సినిమా చేయడానికే ప్రయత్నిస్తారు. ఇప్పుడు వెంకటేశ్ తో చేస్తున్న ఆదర్శ కుటుంబం (AK 47)పై కూడా ఇదే ఆసక్తి ఉంది. ఆ సినిమా విషయంలో మొదటి నుంచి కొన్ని మూవీస్ తో కంపారిజన్స్ వినిపించాయి. కానీ టీజర్ లో ఇప్పటివరకు కనిపించిన కంటెంట్ మాత్రం సినిమా తనదైన వరల్డ్ తో వస్తున్నట్టుగా కనిపించింది.
దీంతో ఇప్పటివరకు ఎన్నోసార్లు తన కథ, డైలాగ్స్, శైలిని నమ్ముకున్న త్రివిక్రమ్.. ఈసారి కూడా అదే నమ్మకంతో సక్సెస్ కొడతారా అనే ప్రశ్న వినిపిస్తోంది. వెంకటేశ్ లాంటి ఫ్యామిలీ హీరో.. త్రివిక్రమ్ మార్క్ కామెడీ.. ఫ్యామిలీ ఎమోషన్స్.. వాటికి యాక్షన్ టచ్.. ఆ కాంబో వర్కౌట్ అయితే మాత్రం.. ఆదర్శ కుటుంబం త్రివిక్రమ్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే సినిమాగా మారే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.