అగ్ర నిర్మాత‌పై అలిగిన త్రిష‌?

టాలీవుడ్‌లో తిరుగులేని బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించి.. ప్రస్తుతం ద‌ర్శ‌కుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అగ్ర నిర్మాత ఎమ్‌ఎస్ రాజు.

Update: 2026-05-22 04:08 GMT

టాలీవుడ్‌లో తిరుగులేని బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించి.. ప్రస్తుతం ద‌ర్శ‌కుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అగ్ర నిర్మాత ఎమ్‌ఎస్ రాజు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం `అగధ` త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఆయన తన సుదీర్ఘ సినీ ప్రయాణంలోని ఎన్నో ఆసక్తికరమైన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిషతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని.. ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సరదా సంఘటనను తాజాగా గుర్తు చేసుకున్నారు.

ఎమ్‌ఎస్ రాజు నిర్మాణంలో సిద్ధార్థ్- త్రిష కాంబినేషన్‌లో వచ్చిన `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత అదే బ్యానర్‌లో సిద్ధార్థ్ హీరోగా `ఆట` సినిమాను ప్రకటించినప్పుడు అందులో హీరోయిన్‌గా తనను తీసుకోలేదని త్రిష తీవ్రంగా అలిగిందట. ఆ సినిమా కోసం త్రిష ఎమ్‌ఎస్ రాజుకు ఫోన్ల మీద ఫోన్లు చేసి.. తానే స్వయంగా షూటింగ్‌కు వచ్చేస్తున్నానని కూడా చెప్పిందట. కానీ అప్పటికే ఆ పాత్ర కోసం ఇలియానాను ఎంపిక చేసి షూటింగ్ కూడా ప్రారంభించడంతో ఎమ్‌ఎస్ రాజు కాస్త ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.

తాము అప్పటికే రాజమండ్రి గోదావరి నది మధ్యలో బోటుపై షూటింగ్ చేస్తున్నామని.., ఇప్పుడు చిత్రీకరణ ఆపడం సాధ్యం కాదని నచ్చజెప్పిన తర్వాతే త్రిష తన ప్రయాణాన్ని ఆపుకుందని ఎమ్‌ఎస్ రాజు వివరించారు. ఆ రోజు సాయంత్రం షూటింగ్ ముగిసిన తర్వాత త్రిష ఎక్కడ ఫీలయ్యిందో అని ఆయనే తిరిగి ఫోన్ చేసి, ``నీతో షూటింగ్ జరిగినంత కంఫర్ట్‌గా ఎవరితోనూ అవ్వదమ్మా`` అని అనగా.. త్రిష నవ్వుతూ ``అవును కదా.. మీరు ఇబ్బంది పడుతున్నారు కదా! మీకు అలాగే అవ్వాలి`` అంటూ సరదాగా ఆటపట్టించిందని ఆయన గుర్తుచేసుకున్నారు. తాము సెట్స్‌లో నటీనటులను ఎప్పుడూ తమ సొంత పిల్లల్లాగే చూసుకుంటామని.. అందుకే తమ మధ్య అంతటి బలమైన బంధం ఉంటుందని ఎమ్‌ఎస్ రాజు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

అగ‌ధ - ఒక‌ వైవిధ్యమైన ప్రయోగం

ద‌ర్శ‌కుడిగా వైవిధ్య‌మైన రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ల‌ను అందించిన‌ ఎమ్‌ఎస్ రాజు ఈసారి సరికొత్త జోనర్‌ను నమ్ముకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. `అగధ` సినిమా కోసం ఆయన ఎంచుకున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇటీవల కాలంలో కంటెంట్ నడిపించే భిన్నమైన చిత్రాలను.. దైవిక అంశాలతో కూడిన సస్పెన్స్ డ్రామాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో భారీ వీఎఫ్ఎక్స్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ మంచి హైప్‌ను క్రియేట్ చేయగలిగింది.

దర్శకుడిగా ఎమ్‌ఎస్ రాజు గత చిత్రాలు డర్టీ హరి, మళ్లీ పెళ్లి వంటివి ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే టార్గెట్ చేయగా, `అగధ` మాత్రం పాన్-ఇండియా స్థాయిలో అందరినీ ఆకట్టుకునేలా భారీ కాన్వాస్‌పై తెరకెక్కింది. సుమారు 45 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ విజువల్స్ .. ఉత్కంఠ రేకెత్తించే స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా వేసవి ముగింపులో ఈ సినిమా థియేటర్లలోకి వస్తే.. సరైన ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా కూడా తన మార్క్ విలక్షణతను చాటుకోవడానికి ఎమ్‌ఎస్ రాజుకు ఈ చిత్రం ఒక కీలక పరీక్షగా మారనుంది.

Tags:    

Similar News